
సర్జికల్ బ్లేడును లోపలే ఉంచి శస్త్రచికిత్స చేసిన వైద్యుడి సస్పెండ్
కాకినాడ జిల్లా తునిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం తీవ్ర కలకలం సృష్టించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడికి శస్త్రచికిత్స నిర్వహిస్తున్న సమయంలో సర్జికల్ బ్లేడును శరీరంలోనే వదిలేసి కుట్లు వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించిన ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ సత్యసాగర్, స్టాఫ్ నర్సు పద్మావతిని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సస్పెండ్ చేసింది.
ఘటన వివరాలు
రోడ్డు ప్రమాదానికి గురైన బాధితుడిని చికిత్స కోసం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ సత్యసాగర్ ఆధ్వర్యంలో అతనికి శస్త్రచికిత్స జరిగింది. అయితే ఆపరేషన్ అనంతరం బాధితుడు తీవ్రమైన నొప్పిగా ఉందని పదేపదే చెప్పడంతో, వైద్యులు ఎక్స్‌రే పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో డాక్టర్లు,నర్సు పద్మావతి సహా సిబ్బంది బాధ్యతారహితంగా సర్జికల్ బ్లేడ్‌ను శరీరంలోనే వదిలివేసినట్లు స్పష్టమైంది.
ఈ దారుణ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కారాదు" అని ఆయన హెచ్చరించారు.
మంత్రి ఆదేశాల మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా అధికారి లోతైన విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. విచారణలో వైద్యుడు సత్యసాగర్, నర్సు పద్మావతి తమ విధులను నిర్లక్ష్యం చేసినట్లు తేలింది. దీంతో, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు ఆదేశాల మేరకు వారిద్దరినీ తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ప్రస్తుతం బాధితుడికి మెరుగైన చికిత్స అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ ఘటన రాష్ట్రంలోని వైద్య సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యత అప్రమత్తత ఎంత అవసరమో మరోసారి తేటతెల్లం చేసింది
