
సరైన తనిఖీలు లేకుండా శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలు ఇవ్వకూడదు: ఎన్. రామచందర్ రావు
తెలంగాణలో సరైన క్షేత్రస్థాయి పరిశీలన, ధృవీకరణ లేకుండా ఎవరికీ శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలు (పీఆర్‌సీ) ను జారీ చేయకూడదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు స్పష్టం చేశారు. తగిన తనిఖీలు లేకుండా పీఆర్‌సీలను ఇస్తే అది దేశ భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతుందని, అక్రమ వలసదారులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఎంఐఎం పార్టీలు రెండూ ఒకే విధమైన డిమాండ్ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. సరైన ధృవీకరణ లేకుండానే పీఆర్‌సీలను వెంటనే జారీ చేయాలని ఈ పార్టీలు ఒత్తిడి తెస్తున్నాయన్నారు. నిర్ణీత సర్వే ప్రక్రియ పూర్తయిన తర్వాతే పీఆర్‌సీ జారీ చేసే అంశం ముందుకు రావాలి. కానీ ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడే దీనిని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయన్నారు. దేశంలో ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడమే వీరి లక్ష్యం. ఎలాంటి తనిఖీలు లేకుండా పీఆర్‌సీ ఇస్తే, అక్రమ వలసదారులు ఇక్కడే స్థిరపడి భారత పౌరులుగా చెప్పుకునే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా ఒకే విధమైన పీఆర్‌సీ ఇచ్చే ముందు కచ్చితంగా నిబంధనలను పాటించాలని, పక్కాగా ధృవీకరణ జరగాలని డిమాండ్ చేశారు.
అర్హులైన ఓటర్లకు పీఆర్‌సీ జారీ చేయాలి: ఓవైసీ
సర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం (పీఆర్‌సీ) లేదా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజును కలిసి వినతిపత్రం అందజేశారు.
పేదలు, బలహీన వర్గాలు నివాస ధ్రువీకరణలో ఇబ్బందులు పడకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 కింద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కర్నాటక విధానాన్ని ఆదర్శంగా తీసుకుని సమగ్ర కుటుంబ సర్వే, కుల గణన, మున్సిపల్ పన్నులు, విద్యా శాఖ రికార్డుల ఆధారంగా ఈ ధ్రువపత్రాలు ఇవ్వొచ్చని ఆయన సూచించారు. దీనివల్ల పేదలు, మైనారిటీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు సర్ ప్రక్రియలో సులభంగా తమ నివాసాన్ని నిరూపించుకొని ఓటు హక్కును కాపాడుకోగలరని ఆయన అభిప్రాయపడ్డారు.
చివరి దశకు చేరిన సర్ ప్రక్రియ..
ఇదిలా ఉండగా, తెలంగాణలో సర్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 99 శాతం పూర్తైంది. ఇప్పటివరకు సుమారు 28 శాతం ఫారాలు తిరిగి అందినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఫారాల సేకరణ జూలై 24 వరకు కొనసాగనుండగా, అనంతరం జూలై 30న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తదుపరి దశలపై ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
