Let's talk: editor@tmv.in
సరూర్‌నగర్‌ చెరువును పునరుద్ధరిస్తాం: హైడ్రా కమిషనర్‌

సరూర్‌నగర్‌ చెరువును పునరుద్ధరిస్తాం: హైడ్రా కమిషనర్‌

Gaddamidi Naveen
22 జనవరి, 2026

సరూర్‌నగర్ చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించి, వరద నియంత్రణకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ అనుమతులు తీసుకుని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సుమారు 140 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువు పరిధిలో గతంలో చాలా వరకు నివాసాలు ఏర్పడ్డాయని, ప్రస్తుతం వాటిని తొలగించే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం మిగిలి ఉన్న 90 ఎకరాలకు పైగా చెరువు విస్తీర్ణాన్నే అభివృద్ధి చేస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలోని ప్రధాన చెరువులన్నింటినీ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించిన నేపథ్యంలో, ఆ జాబితాలో సరూర్‌నగర్ చెరువు కూడా ఉందని కమిషనర్ తెలిపారు. ఈ క్రమంలో బుధవారం ఆయన చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించి, మార్చి నెలలోపే పనులు ప్రారంభించి, ఏడాదిలోపు పూర్తిచేస్తామని ఆయ‌న‌ ప్రకటించారు.

చెరువుల అభివృద్ధి అంటే కేవలం పైపొర అందంగా మార్చడమే కాదని, ఇప్పటికే హైడ్రా పునరుద్ధరించిన బతుకమ్మకుంట, బమ్రుకాన్-ఉద్-దౌలా, కూకట్‌పల్లి నల్లచెరువులను పరిశీలిస్తే అది స్పష్టమవుతుందని కమిషనర్ తెలిపారు. అదే విధంగా సరూర్‌నగర్ చెరువులో 10 నుంచి 15 అడుగుల వరకు పూడికను తొలగించి లోతు పెంచుతామని చెప్పారు. దీని వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు భూగర్భ జలాల మట్టం కూడా మెరుగుపడుతుందని వివరించారు. చెరువు ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా వరదల నియంత్రణలో ఈ చెరువు కీలక పాత్ర పోషించేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మురుగు నీరు చెరువులోకి రాకుండా వాటర్ బోర్డు సహకారంతో చర్యలు తీసుకుంటూ, ఎస్‌టీపీల సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపారు.

పర్యావరణ హితంగా చెరువు పరిసరాల్లో ఔషధ గుణాలు కలిగిన మొక్కలను పెద్ద ఎత్తున నాటుతామని చెప్పారు. ఇప్పటికే ఉన్న ఇందిరా ప్రియదర్శిని పార్కుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పార్కులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. చెరువు చుట్టూ బండ్, వాకింగ్ ట్రాక్‌లు, చిన్నారుల కోసం క్రీడా పార్కులు, అన్ని వయసుల వారికి అనువైన ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. మంచి నీరు చేరడంతో దుర్వాసన తొలగి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఆయ‌న‌ చెప్పారు.

హైడ్రా కమిషనర్ పర్యటనపై లింగోజిగూడ, గడ్డిఅన్నారం కార్పొరేటర్లు దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ, హైడ్రా చేపడితే చెరువు సర్వాంగ సుందరంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కమిషనర్‌ను శాలువాలతో సత్కరించారు. హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, ఏసీపీ తిరుమల్ తదితర అధికారులు పర్యటనలో పాల్గొన్నారు.