
సరుకు రవాణాలో భారత రైల్వే రికార్డు
దేశ ఆర్థిక పురోగతికి వెన్నెముకగా నిలిచిన భారత రైల్వే, వస్తువుల (ఫ్రైట్) రవాణాలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26లో నవంబర్ 19 వరకు మొత్తం ఫ్రైట్ లోడింగ్ 1 బిలియన్ టన్నుల మార్క్ దాటి 1020 మిలియన్ టన్నులకు చేరింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.
అయితే దేశ వ్యాప్తంగా ఎక్కువగా సరఫరా అయిన వస్తువులను పరిశీలిస్తే బొగ్గు(కోల్) 505 మిలియన్ టన్నులు, ఐరన్ ఓర్ 115, సిమెంట్ 92, కంటైనర్ ట్రాఫిక్ 59, పిగ్ ఐరన్, ఫినిష్డ్ స్టీల్ 47, ఎరువులు 42, మినరల్ ఆయిల్ 32, ఫుడ్‌గ్రెయిన్‌లు 30, స్టీల్ ప్లాంట్ల కోసం రా మెటీరియల్ సుమారు 20మిలియన్ టన్నులు, ఇతర వస్తువులు 74 మిలియన్ టన్నులుగా నిలిచాయి.
గతేడాది కంటే పెరిగిన రోజువారీ లోడింగ్
ప్రతిరోజూ సగటున 4.4 మిలియన్ టన్నుల లోడింగ్ జరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో 4.2 మిలియన్ టన్నులు మాత్రమే కావడం గమనార్హం. ఇది రైల్వే ఆపరేషనల్ సామర్థ్యం మరింత మెరుగైనట్లు సూచిస్తుంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మొత్తం లోడింగ్ 935.1 మిలియన్ టన్నులు, గతేడాది ఇదే కాలంలో 906.9 మిలియన్ టన్నులు మాత్రమే. ఫ్రైట్ లోడింగ్ సాఫీగా నిరంతరం పెరుగుతూ వస్తోందని ఇది సూచిస్తోంది.
సిమెంట్ రవాణా కోసం కొత్త విధానాలు
ఫ్రైట్ సెక్టార్ సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో రైల్వే ఇటీవల పలు సంస్కరణలు చేపట్టింది. ముఖ్యంగా భారీగా సిమెంట్ రవాణా చేయడానికి బల్క్ సిమెంట్ టర్మినల్ పాలసీ అమలు చేయాలని నిర్ణయించింది. కంటైనర్లలో సిమెంట్ రవాణా కోసం రేట్ల సవరించారు. దీంతో సిమెంట్ రంగానికి పెద్ద ఊతం లభిస్తుందని, రవాణా సమయం, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి, పరిశ్రమలకు, వినియోగదారులకు లాభం చేకూరుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
పర్యావరణానికి కూడా లాభం
భారీ సరుకు రవాణా రోడ్లపై నుంచి రైలుకు మారితే కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. అలాగే జాతీయ రహదారులపై కూడా రవాణా రద్దీ తగ్గుతుంది.ఎంఎస్ఎంఈలు సహా అనేక రంగాలకు తక్కువ ఖర్చుతో రవాణా అందుబాటులోకి వస్తోంది. ఇదే సమయంలో దేశం లక్ష్యంగా పెట్టుకున్న నెట్ జీరో కార్బన్ ఎమిషన్ దిశగా రైల్వే ఫ్రైట్ ఆపరేషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్రం పేర్కొంది.
గత ఐదు సంవత్సరాలుగా సరుకు రవాణా పెరుగుదల వృద్ధి
2020-21: 1,233 మిలియన్ టన్నులు (COVID-19 ప్రభావంతో రికవరీ ప్రారంభం).
2021-22: 1,416 మిలియన్ టన్నుల స్థాయికి పెరుగుదల
2022-23: 1,512 మిలియన్ టన్నులు
2023-24: 1,591 మిలియన్ టన్నులు (మరింత స్థిర వృద్ధి).
2024-25: 1,617.38 మిలియన్ టన్నులు గా నమోదైంది.
