Let's talk: editor@tmv.in
సరిహద్దుల్లో శాంతే ముఖ్యం: భారత్, చైనా ఉమ్మడి ప్రకటన

సరిహద్దుల్లో శాంతే ముఖ్యం: భారత్, చైనా ఉమ్మడి ప్రకటన

Shaik Mohammad Shaffee
30 అక్టోబర్, 2025

భారత్, చైనా సరిహద్దు ప్రాంతాలలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించే దిశగా మరో కీలక అడుగు పడింది. రెండు దేశాల మధ్య 23వ కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశం ఈ నెల అక్టోబర్ 25న భారత్ భూభాగంలో, చుషుల్‌-మోల్దో సరిహద్దు పాయింట్ వద్ద స్నేహపూర్వక వాతావరణంలో జరిగినట్లు భారత విదేశాంగ శాఖ, చైనా రక్షణ శాఖలు పేర్కొన్నాయి.

ఈ చర్చల్లో ఇరు దేశాల సైనిక, దౌత్య ప్రతినిధులు సరిహద్దుల్లోని పశ్చిమ సెక్టార్‌లో సుస్థిరతను సాధించడంపై దృష్టి సారించారు. గతంలో తీసుకున్న నిర్ణయాల మేరకు, ఏడు ఘర్షణ పాయింట్ల నుంచి ఇరువైపులా సైన్యాన్ని పూర్తిగా తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఐదు పాయింట్ల నుంచి పెట్రోలింగ్ పునఃప్రారంభమైంది, తూర్పు లడఖ్‌లోని సరిహద్దుల్లో ఉద్రిక్తత పూర్తిగా తగ్గిందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

సరిహద్దు అంశాలపై సైనిక, దౌత్య మార్గాల ద్వారా నిత్యం సమన్వయం చేసుకోవాలని, కూలంకషంగా సంప్రదింపులు కొనసాగించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. ప్రస్తుతం ఉన్న శాంతిని కొనసాగించడానికి, భవిష్యత్తులో ఏవైనా సమస్యలు తలెత్తితే ఏకాభిప్రాయానికి వచ్చి పరిష్కరించుకోవాలని తీర్మానించాయి. అపార్ధాలకు తావు ఇవ్వకుండా వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంట సుస్థిరత సాధించాలని ఉమ్మడిగా తీర్మానించాయి.

చర్చల నేపథ్యం, పురోగతి

తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఏసీ వెంట 2020 గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత నాలుగు సంవత్సరాల పాటు తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి. 2024 అక్టోబర్‌లో జరిగిన 22వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశం తర్వాత సాధించిన పురోగతిని ఈ భేటీలో సమీక్షించారు. 2025 ఆగస్టులో జరిగిన 24వ చర్చల తర్వాత పశ్చిమ కమాండ్‌లో జరిగిన జనరల్ లెవెల్ మెకానిజం కోసం ఇది తొలి సమావేశం.ఈ ఏడాది జులైలో వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. ఆ తర్వాతే సరిహద్దుల్లో శాంతి నెలకొందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.

ఈ ఏడాది ఆగస్టులో చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చారిత్రక సమావేశం జరిగింది. ఈ భేటీలో "భారత్-చైనా ప్రత్యర్థులు కాదు, భాగస్వాములు" అని ఇరు దేశాధినేతలు స్పష్టం చేశారు.

పెరుగుతున్న వాణిజ్య లోటు

భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం భారీగా ఉన్నప్పటికీ, వాణిజ్య లోటు (భారత్ దిగుమతులు ఎక్కువగా, ఎగుమతులు తక్కువగా ఉండటం) ఆందోళన కలిగిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం సుమారు 136 బిలియన్ అమెరికన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో భారత్ ఎగుమతులు చైనాకు కేవలం 17–18 బిలియన్ డాలర్లు మాత్రమే కాగా, చైనా నుండి దిగుమతులు 118 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. అంటే, భారత్‌కు సుమారు 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది. కారణం చైనా నుంచి భారత్ భారీగా ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, ఆటో విడిభాగాలు, ఫార్మా ముడిసరుకులు దిగుమతి చేసుకుంటుంది. ఈ అసమతుల్యత భారతీయ పరిశ్రమలను దెబ్బతీస్తుంది. దేశీయ ఉత్పత్తి లక్ష్యాలకు అడ్డంకిగా మారుతుంది.

సరిహద్దు వివాదం

సరిహద్దు విషయంలో లడఖ్‌లోని అక్సాయ్ చిన్, గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు, డెప్సాంగ్ ప్లైన్స్, అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లోని తావాంగ్ ప్రాంతం ప్రధాన వివాదాస్పద ప్రాంతాలు. 2020 గాల్వాన్ ఘర్షణ తరువాత ఇరుదేశాలు అనేక సార్లు సైనిక చర్చలు జరిపి కొంత డిస్‌ఎంగేజ్‌మెంట్ సాధించాయి. అయినప్పటికీ, పూర్తి పరిష్కారం ఇంకా రాలేదు. ఇరుదేశాలు సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ఉన్నత స్థాయి చర్చలు కొనసాగిస్తున్నాయి.

సరిహద్దుల్లో శాంతే ముఖ్యం: భారత్, చైనా ఉమ్మడి ప్రకటన - Tholi Paluku