
సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేనిది: రేవంత్ రెడ్డి
ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం మనదని, సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంత పాలనను పక్కనపెట్టామన్నారు. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావులేదని, స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయంలో రోల్మోడల్గా ఉన్నామన్నారు రేవంత్ రెడ్డి. ఉన్నత చదువుల ద్వారా మన యువత సత్తా చాటాలని, భవిష్యత్తులో పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, త్వరలో రాష్ట్ర విద్యా విధానం తెస్తున్నామని వెల్లడించారు. సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేనిది. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి సత్తాచాటారని కొనియాడారు.
కోటిమందిని కోటీశ్వరులను చేస్తాం
డ్వాక్రా ఉత్పత్తుల విక్రయానికి మరిన్ని మహిళా మార్టులు ఏర్పాటు చేస్తామని, రైతుల కోసం తెచ్చే పథకాలు సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయని చెప్పారు. ఏ రాష్ట్రం చేయని విధంగా వారికి మేలు చేస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులున్నా రైతుల సంక్షేమం విషయంలో రాజీ పడలేదని చెప్పారు. సాగు మోటార్లకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహించి వేగంగా ఫలితాలు వెల్లడించాం. సివిల్స్ పరీక్షలు రాసేవారికి ఆర్థిక సాయం అందిస్తున్నామని రేవంత్ వివరించారు. సామాజిక న్యాయం, ప్రజల ఆకాంక్షలే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. స్వేచ్ఛ, సమానత్వంలో తెలంగాణ రోల్మోడల్ అని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి అవకాశాలు అందుకోవాలంటే విద్యే మార్గమమని చెప్పారు. గొప్ప లక్ష్యాలతో యంగ్ ఇండియా స్కూల్స్కి శ్రీకారం చుట్టామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. భవిష్యత్ తెలంగాణ కోసం విద్యపై భారీ పెట్టుబడి పెట్టామన్నారు. విద్యతో పాటు క్రీడలకు సైతం తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు పెద్ద పీట వేస్తూ కోటి మందిని కోటీశ్వరులుగా చేస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
రైతులే రాజులు
తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిదని చెప్పారు. మహిళల అభివృద్ధికి అండదండలు అందిస్తున్నామన్నారు. త్వరలో విద్యా పాలసీ తీసుకొస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ ద్వారా రైతులకు విముక్తి కల్పించామని గుర్తు చేశారు. రైతులను రాజులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. రైతుల సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ లేదని సీఎం రేవంత్ కుండ స్పష్టం చేశారు. రైతుల పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని వివరించారు. వరి కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. ఎన్నో రంగాల్లో దేశంలోనే తెలంగాణ తొలిస్థానంలో ఉందని స్పష్టం చేశారు. దేశంలో పేదలకు సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణగా అని గుర్తు చేశారు. కృష్ణా, గోదావరి నీటి వాటాల విషయంలో ఎలాంటి రాజీ లేదని కుండ బద్దలు కొట్టారు. కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. అలాగే తెలంగాణ వాటా కోసం కృష్ణా ట్రిబ్యునల్లో వాదనలు సైతం వినిపిస్తున్నామని పేర్కొన్నారు.
మూసీని అభివృద్ధి చేస్తాం
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. 2027 డిసెంబర్ నాటికి ఈ టన్నెల్ పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ను గేట్ ఆఫ్ వరల్డ్గా తీర్చిదిద్దుతామన్నారు. 2047 నాటికి 3 ట్రిలయన్ డాలర్ ఎకానమీగా మార్చుతామని సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. వందేళ్ల వరకు నీటి సమస్య లేకుండా హైదరాబాద్కు గోదావరి నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన చేసి హైదరబాద్ను సుందరంగా మార్చుతామన్నారు. మూసీ చుట్టూ జీవిస్తున్న ప్రజలకు మెరుగైన జీవితం కల్పిస్తామని స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామన్నారు. మూసీ ప్రక్షాళనతో కొత్త ఆర్థిక వ్యవస్థ సృష్టిస్తామని చెప్పారు. మూసీకి ఇరు వైపులా ప్రపంచ స్థాయి కట్టడాలు నిర్మిస్తామని రేవంత్ చెప్పారు. అదే విధంగా మూసీ ప్రక్షాళనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో మూసీ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
గ్రామాలకు విస్తరిస్తున్న మత్తు
తెలంగాణను పట్టి పీడిస్తున్న మత్తు మాఫియాను తరిమికొడతామన్నారు. నగరాల్లోనే కాదు, పట్టణాలు, గ్రామాలకు కూడా గంజాయి విస్తరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అండగా నిలబడితే మత్తు మాఫియాను తరిమికొడతామన్నారు. గతంలో కొందరు హైదరాబాద్ను గేట్ వే ఆఫ్ డ్రగ్స్గా మార్చారని మండిపడ్డారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ పోలీసులు అద్భుతంగా పని చేస్తున్నారంటూ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరున్నా వారిని జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డపై గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని పేర్కొన్నారు. ఫామ్ హౌస్ల్లో జరిగే డ్రగ్ పార్టీలపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించారు. డిసెంబర్లో 2047 తెలంగాణ డాక్యుమెంట్ విడుదల చేస్తామని తెలిపారు.
30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీకి అడ్డంకులు సృష్టిస్తున్న వారికి బుద్ధి చెప్పాలంటూ ఈ సందర్భంగా ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
సమర్థంగా భూ భారతి
గత ప్రభుత్వం తెచ్చిన ‘ధరణి’ వల్ల రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. మా ప్రభుత్వం వచ్చాక భూభారతి చట్టం తెచ్చి సమర్థంగా అమలు చేస్తున్నామని, పేదల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి. 904 టీఎంసీల సాధనకు ట్రైబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపిస్తాం. కృష్ణా జలాల హక్కుల కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తాం. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా వెనకడుగు వేసేది లేదు. హైదరాబాద్ అంటేనే ఒక బ్రాండ్. ఈ నగరాన్ని గేట్వే ఆఫ్ వరల్డ్గా తీర్చిదిద్దుతాం. 2047 నాటికి మన రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలి. హైదరాబాద్కు గోదావరి జలాలు తీసుకొస్తున్నాం. కాలుష్యం లేని నగరంగా మారుస్తున్నాం. మూసీ నది పక్కన జీవించే పేదలకు మంచి జీవన ప్రమాణాలు కల్పిస్తాం. ఈ పరిధిలో ఉన్నవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మారుస్తాం. ఈ ఏడాది డిసెంబర్ 9 లోగా అనేక అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం.
