
సమ్మక్క- సారక్క జాతరకు జాతీయ పండుగ హోదా
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా గుర్తింపు పొందిన సమ్మక్క-సారక్క మహాజాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.
మేడారంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణాలో ప్రజల ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిర్వహిస్తున్న రెండవ సమ్మక్క-సారక్క జాతర ఇదేనని తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ చారిత్రక గిరిజన పండుగకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టామని స్పష్టం చేశారు.
సమ్మక్క-సారక్క జాతర గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని, పరిమాణం, ప్రాధాన్యతలో ఇది కుంభమేళాతో సమానమని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు మేడారం సందర్శించడం ఆనందకరమని, ఈ పర్యటనలతో జాతీయ పండుగ హోదాపై ఉన్న దీర్ఘకాలిక డిమాండ్ త్వరలో నెరవేరుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
మహాజాతరను విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన అధికారులు, సిబ్బంది, అన్ని శాఖలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రజలకు సమాచారం చేరవేయడంలో సహకరించిన మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆలయ అభివృద్ధి పనులు, మౌలిక వసతుల ఏర్పాట్లను కేవలం 90 రోజుల్లోనే పూర్తి చేశామని చెప్పారు. సాధారణంగా నాలుగు రోజులపాటు జరిగే జాతరకు ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో విస్తృత ఏర్పాట్లు చేశామని తెలిపారు.
జాతర ప్రశాంతంగా, సజావుగా కొనసాగుతోందని పేర్కొన్న మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్, ఎస్పీ, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది, మీడియా ప్రతినిధుల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని ప్రశంసించారు.
అదేవిధంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సూచనల మేరకు గద్దెల పునర్నిర్మాణం సహా మౌలిక వసతుల పనులు నిర్ణీత గడువులో పూర్తి చేశామని తెలిపారు. సమ్మక్క-సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలంటూ కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువాల్ ఓరమ్ కు వినతిపత్రం సమర్పించినట్లు వెల్లడించారు. జాతర నిర్వహణకు కేంద్రం నుంచి అధిక నిధులు మంజూరు చేయాలని కూడా కోరినట్లు తెలిపారు.
లక్షలాది మంది భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మహాజాతర విజయవంతానికి సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు, మీడియాకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
