
సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. శుక్రవారం బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మేడారం సందర్శించి, వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ సంప్రదాయ చేనేత వస్త్రాలు ధరించిన గ్యారెత్ విన్ ఓవెన్, భక్తిశ్రద్ధలతో అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన 'తులాభారం' మొక్కును చెల్లించుకున్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఆయనకు మేడారం జాతర విశిష్టతను, కోట్లాదిగా తరలివచ్చే భక్తుల కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను వివరించారు. గిరిజన సంస్కృతి, ఆచారాల పట్ల ఆయన ఈ సందర్భంగా ఆసక్తి కనబరిచారు.
మేడారంలో న్యూజిలాండ్ ‘హాకా’ నృత్యం
జాతరలో మరో ప్రధాన ఆకర్షణగా న్యూజిలాండ్‌కు చెందిన మావోరీ తెగ ప్రతినిధుల ప్రదర్శన నిలిచింది. ఇండో-న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా 'న్గాటి రంగోమాయి' ఐవీకి చెందిన మావోరీ బృందం అమ్మవార్ల సన్నిధిలో తమ సంప్రదాయ 'హాకా' నృత్యాన్ని ప్రదర్శించింది. నృత్యం ప్రదర్శించబడటం అంతర్జాతీయ గిరిజన ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు. 'హాకా' ధైర్యానికి, ఐక్యతకు చిహ్నంగా భావించే ఈ శక్తివంతమైన నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనను మంత్రి సీతక్క స్వాగతించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరిజన సంస్కృతులన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయని, మానవత్వమే వాటి ఉమ్మడి భాష అని ఆమె పేర్కొన్నారు.
భారత్, న్యూజిలాండ్ మధ్య గిరిజన సమాజాల పరస్పర అవగాహన, గౌరవాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం నిర్వహించారు. రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు. గిరిజన చరిత్ర, విశ్వాసాలపై ఆధారపడి సమ్మక్క, సారలమ్మల త్యాగం, పోరాట స్ఫూర్తిని స్మరించుకునే ఈ జాతర ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంటోంది.
