Let's talk: editor@tmv.in
సముద్రుడిని బతకనివ్వండి!

సముద్రుడిని బతకనివ్వండి!

Dr.Chokka Lingam
7 నవంబర్, 2025

ప్రపంచంలోని సముద్రాలు ఇప్పటికే మానవ చర్యల భారంతో వణికిపోతున్నాయి. ఈ రోజు కేవలం వాణిజ్య మార్గాల్లా కనిపిస్తున్న సముద్రాలు రేపటికి మానవ తప్పిదాల కరాళ నాటకస్థలాలుగా మారిపోతాయన్న హెచ్చరిక స్పష్టంగా వినిపిస్తోంది. శాస్త్రవేత్తలు ఇచ్చిన అంచనాల ప్రకారం 2050 నాటికి సముద్రాలపై మానవ ప్రభావం రెట్టింపు అవుతుంది. ఇది సహజమైన పెరుగుదల కాదు, ఇది విధ్వంసానికి పిలుపు. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సముద్ర జలాలను వేడెక్కిస్తున్నాయి. చేపల సంపద మాయమవుతోంది. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. యసిడిటి పెరగడం, పోషకాల కాలుష్యం పెరగడం లాంటి అంశాలు కలిసి సముద్రాల సమతౌల్యాన్ని చెదరగొడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ ఒక్కొక్కటే కాదు, ఒకదానితో మరొకటి ముడిపడి ఒక గాలివానలా ముప్పు పెంచుతున్నాయి.

సముద్రాలపై మన ప్రభావం ఇప్పటికే తీవ్రమైన స్థాయిలో ఉంది. మరో 25సంవత్సరాల్లో అది రెండింతలు అవుతుంది. ఇది చాలా భయంకరమని సైంటిస్టులు చెబుతున్నారు. రెండు దశాబ్దాలుగా వేర్వేరు సమస్యలను వేర్వేరుగా చూసిన వారు ఇప్పుడు మొత్తాన్ని కలిపి చూడగానే వాస్తవ రూపం బయటపడింది. సముద్రం ఎంతో పెద్దది, మన తప్పిదాలు దానికి పెద్ద నష్టం చేయవని అనుకున్న భావన క్షణాల్లో కూలిపోయింది. వాణిజ్య మార్గాల కోసం సముద్రాలు రోజుకో అడుగు మానవ కదలికను భరిస్తున్నాయి. 90శాతం కంటే ఎక్కువ అంతర్జాతీయ వాణిజ్యం సముద్ర మార్గాలపైనే ఆధారపడుతోంది. ఇంధన కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలు, నియంత్రణ లేని ఫిషింగ్‌... లాంటివి కలిపి ఒక ఆహుతి అవుతున్నాయి. ఉష్ణమండల ప్రాంతాలు, ధ్రువ ప్రాంతాలు రెండూ ఒకే రకమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఒకసారి ఆ హద్దు దాటితే తిరిగి పునరుద్ధరణ అసాధ్యమవుతుంది.

మరోవైపు తీరప్రాంతాలు ఇంకా ఎక్కువగా బాధపడుతున్నాయి. పగడ భూములు క్షీణిస్తున్నాయి. తీయని నీరు, ఉప్పునీటి సమతౌల్యం చెదిరిపోతోంది. సంతానోత్పత్తి కేంద్రాలు మాయమవుతున్నాయి. చెట్లలా నిలిచిన మంగ్రోవ్ అడవులు కనుమరుగవుతున్నాయి. ఇదంతా సముద్ర జీవవైవిధ్యాన్ని కేవలం కుదించడమే కాదు, మానవ జీవితాలను కూడా హరించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ మార్పుల భారాన్ని ముఖ్యంగా సముద్రాలపైనే ఆధారపడే దేశాలు భరించాల్సి ఉంటుంది. చేపల వేటపై, తీర ప్రాంత వాణిజ్యంపై, సముద్ర సంపదపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా వణుకుతాయి. ఆహారం తగ్గుతుంది, ఉద్యోగాలు మాయం అవుతాయి, ఆర్థికత కూలిపోతుంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఈ కఠిన సత్యాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి దగ్గరపడుతోంది.

ఇది కేవలం ఒక అధ్యయనం కాదు, ఇది ఒక అలారం. గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం, జీవావాసాలను రక్షించడం, వాతావరణ సహన విధానాలను అమలు చేయడం, చేపల వనరులను కాపాడే కొత్త వ్యవస్థలు సృష్టించడం లాంటివి అత్యవసరం కావాలి. లేకపోతే సముద్రాలు రేపటికి మన తప్పిదాలను క్షమించవు. ఈ రోజు చేసిన హెచ్చరిక ఒక చివరి అవకాశం. భవిష్యత్తును మార్చగల శక్తి ఇంకా మన చేతిలోనే ఉంది. కానీ సమయం కరిగిపోతోంది. అందుకే ఇప్పుడే నిద్రలేవాలి.. లేదంటే వినాశనం తప్పదు!