
సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
కోనసీమ జిల్లా సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్‌లో క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం వెల్లడించారు. అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసాలతిప్ప గ్రామాలకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఆగస్టు 3న ఉదయం 10 గంటల సమయంలో ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి చేపల వేటకు బయలుదేరారు. అదే రోజు ఉదయం 11 గంటల వరకు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన వారు ఆ తర్వాత అందుబాటులోకి రాలేదు. ఆగస్టు 12న తిరిగి రావాల్సిన పడవ రాకపోవడంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
సుదీర్ఘ గాలింపు అనంతరం పశ్చిమ బెంగాల్‌లోని శంకర్‌పూర్ ఫిషింగ్ హార్బర్ సమీపంలో పడవను గుర్తించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. పడవలో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని, వారంతా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వారికి అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. మత్స్యకారులను వీలైనంత త్వరగా స్వస్థలాలకు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ నేవీ, కోస్ట్‌గార్డ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపారని మంత్రి చెప్పారు. సముద్రం, గగనతలంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
పడవలో సాంకేతిక సమస్య ఏర్పడి ఉండే అవకాశం, గాలి దిశ, సముద్ర ప్రవాహాలు, పడవ కొట్టుకుపోయే అవకాశాలను అధికారులు విశ్లేషించినట్లు మంత్రి వివరించారు. పడవ పశ్చిమ బెంగాల్ తీరం వైపు వెళ్లి ఉండొచ్చన్న అంచనాతో అక్కడి కోస్ట్‌గార్డ్ యూనిట్లు, స్థానిక మత్స్యకారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. పడవ యజమాని సోదరుడు భవానీ ప్రసాద్‌తో తాను మాట్లాడి ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నానని తెలిపారు.
మత్స్యకారులను స్వస్థలాలకు సురక్షితంగా తీసుకురావడానికి మత్స్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారని చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, నేవీ, కోస్ట్‌గార్డ్, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో గాలింపు చర్యలు నిర్వహించినట్లు తెలిపారు. మత్స్యకారుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
