
సమానత్వం కోసం శతాబ్దకాలపు పోరాటానికి సాక్ష్యం
ప్రతి సంవత్సరం మార్చి8 ప్రపంచవ్యాప్తంగా చాలామంది మహిళలకు ఒక సెలవురోజు. అవును ఆకాశంలో సగభాగంగా వంటిల్లు దాటి బయటి ప్రపంచాన్ని చూస్తున్నా ఈ సెలవురోజు క్యాలెండర్‌పై ఎరుపు రంగులో మెరిసే ఒక సెలవు దినం గానే భావిస్తారుతప్ప అది ప్రతి ఇంట్లో వెలుగులు నింపే అమ్మ త్యాగానికి, అడుగులో అడుగేసే అక్కాచెల్లెళ్ల అనురాగానికి, జీవిత ప్రయాణంలో తోడుండే భార్య సహనానికి ఇచ్చే ఒక గొప్ప గౌరవం అని ఎవరూ అనుకోరు.
మహిళలు ఆకాశంలో సగభాగం అని చెప్పడమే తప్ప, నేటికీ తమ హక్కుల కోసం, అస్తిత్వం కోసం పోరాడుతున్న కోట్లాది మంది మహిళల ఆత్మవిశ్వాసానికి ఈ రోజు ఒక ప్రతీక అని ఎంత మందికి తెలుసు? కంటికి కనబడని ఎన్నో ఆంక్షలను చెరిపేస్తూ, కన్నీటిని దిగమింగుతూ సమాజ గమనాన్ని మారుస్తున్న స్త్రీ మూర్తులందరికీ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన పవిత్రమైన రోజు అని ఎంతమంది భావిస్తున్నారు?
అవును, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ ఒక సాధారణ వేడుక మాత్రమే కాదు. ఇది మహిళల హక్కులు, సమానత్వం, గౌరవం, స్వేచ్ఛ కోసం శతాబ్దాలుగా సాగిన పోరాటాల ప్రతీక. మహిళలు ఎదుర్కొన్న వివక్ష, అన్యాయం, అణచివేతకు వ్యతిరేకంగా వారు చేసిన నిరసనల నుంచి పుట్టిన ఈ దినోత్సవం, నేటి ప్రపంచంలో కూడా సమాన వేతనం, పునరుత్పత్తి హక్కులు, విద్య, ఉద్యోగావకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం, మహిళలపై హింస నిర్మూలన వంటి అంశాలపై మన దృష్టిని కేంద్రీకరిస్తుంది.
ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా ఆవిర్భవించింది, అది ఎలా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది, ఆధునిక కాలంలో దాని ప్రాముఖ్యత గురించి విస్తృతంగా తెలుసుకుందాం.
మహిళా దినోత్సవం - ఆవిర్భావానికి నాంది
19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభంలో యూరప్, ఉత్తర అమెరికా దేశాలు వేగంగా పారిశ్రామికీకరణ దశలోకి ప్రవేశించాయి. కర్మాగారాలు, వస్త్ర పరిశ్రమలు విస్తరించాయి. ఈ మార్పుల్లో మహిళలు కీలక పాత్ర పోషించినా, వారికి తక్కువ జీతాలు, ఎక్కువ పని గంటలు, భద్రత లేని పని పరిస్థితులు, రాజకీయ హక్కుల లేమి ఎదురయ్యాయి.
1909 ఫిబ్రవరి 28న, న్యూయార్క్ నగరంలో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించిన “మహిళా దినోత్సవం” మొదటిసారిగా మహిళల సమస్యలను సమిష్టిగా ప్రపంచం ముందు ఉంచింది. ఈ కార్యక్రమానికి మహిళా కార్మికుల సమాన హక్కుల పోరాటమే కేంద్రబిందువుగా నిలిచింది. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి తొలి అడుగుగా చరిత్రలో నిలిచిపోయింది.
కార్లా జెట్కిన్ అంతర్జాతీయ దృక్పథం
1910లో డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ మహిళా సమావేశంలో జర్మన్ సామ్యవాద నేత క్లారా జెట్కిన్ ఒక చారిత్రక ప్రతిపాదన చేశారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల ఓటు హక్కు, సమానత్వం కోసం పోరాడే ఒక ప్రత్యేక దినోత్సవం ఉండాలని ఆమె సూచించారు.
ఈ సమావేశానికి 17 దేశాల నుంచి వచ్చిన వంద మంది ప్రతినిధులు క్లారా జెట్కిన్ ఆలోచనకు మద్దతు తెలిపారు. అయితే అప్పట్లో తేదీని నిర్ణయించలేదు. అయినా, ఇదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే భావనకు పునాది వేసింది.
1911లో మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
1911 మార్చి 19న, ఆస్ట్రియా-హంగేరీ, జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్ దేశాల్లో మొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. దాదాపు 10 లక్షల మందికి పైగా మహిళలు, పురుషులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వియన్నా నగరంలో మహిళలు పారిస్ కమ్యూన్ అమరవీరులను స్మరిస్తూ కవాతు చేశారు. యూరప్ అంతటా మహిళలు ఓటు హక్కు, ప్రభుత్వ పదవుల్లో భాగస్వామ్యం, ఉద్యోగాలలో లింగ వివక్షకు ముగింపు కోసం గళమెత్తారు. ఇది మహిళా ఉద్యమాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కీలక మలుపు అని చెప్పవచ్చు.
రష్యావిప్లవం, మార్చి 8
1917 మార్చి 8 (జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23) నాడు, రష్యాలోని పెట్రోగ్రాడ్ నగరంలో మహిళా వస్త్ర కార్మికులు “బ్రెడ్ అండ్ పీస్” అనే నినాదంతో వీధుల్లోకి దిగారు. మొదటి ప్రపంచ యుద్ధం వల్ల ఏర్పడిన ఆహార కొరత, నిరుద్యోగం, అణచివేతకు వ్యతిరేకంగా ఈ నిరసనలు జరిగాయి. ఈ ఉద్యమమే రష్యన్ విప్లవానికి నాంది పలికింది. ఏడు రోజుల్లోనే జార్ నికోలస్ II పదవీ విరమణ చేశాడు. తాత్కాలిక ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కును మంజూరు చేసింది.
ఈ చారిత్రక సంఘటనను గుర్తు చేస్తూ, 1922లో వ్లాదిమిర్ లెనిన్ మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత సామ్యవాద, కమ్యూనిస్టు దేశాల్లో ఈ దినోత్సవం విస్తృతంగా జరగడం ప్రారంభమైంది.అప్పటినుండి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తింపు పొందింది.
ప్రపంచవ్యాప్తంగా విస్తరణ
1920ల నుంచి 1960ల మధ్యకాలంలో, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేక దేశాల్లో విస్తృతంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. చైనా 1922 నుంచి ఈ దినోత్సవాన్ని పాటించింది. ఆస్ట్రేలియాలో 1928లో తొలి వేడుకలు జరిగాయి. యూరప్ దేశాలు పెద్ద ఎత్తున కవాతులు, సమావేశాలు ప్రారంభించాయి. చైనా ప్రజా గణతంత్రం స్థాపన తర్వాత, మార్చి 8న మహిళలకు సగం రోజు సెలవు ప్రకటించారు. మధ్య ఆసియాలో మహిళలపై ఉన్న సంప్రదాయ ఆంక్షలను తొలగించేందుకు కూడా ఈ రోజును ఉపయోగించారు.
రెండవ తరం స్త్రీవాదం, కొత్త ఊపిరి
1960, 1970లలో రెండవ తరం స్త్రీవాద ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుంది. ఈ దశలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కేవలం సామ్యవాద దేశాలకు పరిమితం కాకుండా, పశ్చిమ దేశాల్లో కూడా క్రియాశీల ఉద్యమ దినంగా మారింది. సమాన వేతనం, పునరుత్పత్తి హక్కులు, చట్టపరమైన సమానత్వం, పిల్లల సంరక్షణ సదుపాయాలు, మహిళలపై హింస నిర్మూలన వంటి అంశాలు ప్రధాన అజెండాగా మారాయి.
ఐక్యరాజ్యసమితి పాత్ర
1975లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది. అదే సంవత్సరం నుంచి యూఎన్ కూడా అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది.
1977లో, సభ్య దేశాలు తమ సంప్రదాయాలకు అనుగుణంగా మహిళా హక్కులు, ప్రపంచ శాంతి కోసం ఒక ప్రత్యేక దినాన్ని పాటించాలని యూఎన్ జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది. అప్పటి నుంచి మార్చి 8ను ప్రపంచవ్యాప్తంగా యూఎన్ ఆధ్వర్యంలో జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక ఇతివృత్తాన్ని ప్రకటించి, మహిళల సమస్యలపై అవగాహన పెంచుతున్నారు.
ఆధునిక కాలం - విమర్శలు
యునైటెడ్ స్టేట్స్‌లో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన #మీ టూ, # టైమ్స్ అప్ వంటి ఉద్యమాలు 2019 నాటికి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి కొత్త అర్థాన్ని ఇచ్చాయి. లైంగిక వేధింపులు, దాడులు, కార్యాలయాల్లో లింగ వివక్ష, వేతన అంతరం వంటి అంశాలపై మహిళలు బహిరంగంగా మాట్లాడేందుకు ఈ ఉద్యమాలు బలమైన వేదికలుగా మారాయి. అదే సమయంలో, 50కి పైగా దేశాల్లో సమన్వయంతో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా సమ్మె మహిళల శ్రమ, గృహపని, సంరక్షణ, లైంగిక పని సహా సమాజానికి ఎంత కీలకమో ప్రపంచానికి గుర్తు చేసింది. 2019లో ఈ సమ్మె, మహిళలపై హింసకు వ్యతిరేకంగా లైంగిక పనిని నేరరహితం చేయాలనే డిమాండ్‌లతో మరింత రాజకీయ స్పష్టతను సంపాదించింది.
ఇక మీడియా, కార్పొరేట్ రంగాల్లో కూడా 2019లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రత్యేక చర్చకు దారితీసింది. ద న్యూ యార్క్ టైమ్స్ ప్రారంభించిన “ ఓవర్‌లుక్డ్ నో మోర్ ” శ్రేణి ద్వారా చరిత్రలో విస్మరించబడిన మహిళల జీవితాలను వెలుగులోకి తీసుకురావడం ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది. మరోవైపు, మెక్‌డొనాల్డ్స్ వంటి సంస్థలు లోగో మార్పులు చేసి ఎమ్ అక్షరాన్ని డబ్ల్యూ గా మార్చి మహిళలను గౌరవిస్తున్నట్టు చూపినప్పటికీ, వాటి నిజమైన విధానాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాలన్నీ కలిసి, 2019 నాటికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కేవలం వేడుకగా కాకుండా ఉద్యమం, ప్రశ్న, మార్పు కోసం ఒత్తిడి చేసే దినంగా ప్రపంచవ్యాప్తంగా బలంగా నిలిచిందని స్పష్టం చేశాయి.
21వ శతాబ్దంలోకి వచ్చేసరికి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరింత ప్రసిద్ధి చెందింది. అయితే, దీనిపై విమర్శలు కూడా పెరిగాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలు ఈ దినాన్ని మార్కెటింగ్ సాధనంగా ఉపయోగిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా హ్యాష్‌ట్యాగ్‌లు, శుభాకాంక్షల సందేశాలు మాత్రమే మిగిలి, అసలైన సమస్యలు పక్కన పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవును నిజంగా నేటి రోజుల్లో విమెన్స్ డే వాట్సప్ స్టేటస్ లో ఒక విషెస్ లా మిగిలిపోతుంది.
అయినా కూడా, మహిళలపై జరుగుతున్న హింస, లింగ వివక్ష, అసమాన వేతనాలు, రాజకీయ ప్రాతినిధ్యం లోపం వంటి సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాముఖ్యత తగ్గలేదు, మరింత పెరిగింది.
2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇతివృత్తం “అందరు మహిళలు, బాలికలకు హక్కులు, సమానత్వం,సాధికారత” ప్రపంచవ్యాప్తంగా మహిళల మౌలిక హక్కులను కేంద్రబిందువుగా ఉంచింది. ఈ ఇతివృత్తం ద్వారా విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రత, పునరుత్పత్తి హక్కులు వంటి రంగాల్లో మహిళలు ఇంకా ఎదుర్కొంటున్న అసమానతలను తొలగించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.
2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇతివృత్తం “గివ్ టు గైన్ ”. ఇది మహిళా సమానత్వం కోసం ఉదారత, సహకారం ఎంత కీలకమో స్పష్టంగా వివరిస్తుంది. మహిళల పురోగతికి మనం సమయం, జ్ఞానం, వనరులు, విద్య, శిక్షణ, మార్గదర్శకత్వం, ప్రోత్సాహం లేదా ఆర్థిక సహాయం రూపంలో ఏదైనా “ఇస్తే”, అది నష్టంగా కాకుండా సమాజమంతటికి లాభంగా మారుతుందనే భావన ఈ ప్రచారం యొక్క సారాంశం. మహిళలకు అవకాశాలు పెరిగినప్పుడు కుటుంబాలు, సంస్థలు, సమాజాలు బలపడతాయి. ఒకరు ఎదిగితే అందరం ఎదుగుతాం. వ్యక్తిగా, సంస్థగా లేదా సమాజ సమూహంగా కార్యాలయంలో, ఇంట్లో, ప్రజాజీవితంలో గౌరవం ఇవ్వడం, విరాళాలు అందించడం, కనిపించేలా చేయడం, జ్ఞానం పంచుకోవడం, నిధులు కేటాయించడం, న్యాయం, రక్షణ, భద్రత కల్పించడం, సమాన వేతనం ఇవ్వడం, మార్గదర్శకత్వం, స్పాన్సర్‌షిప్ అందించడం, కృషికి క్రెడిట్ ఇవ్వడం, శిక్షణ అవకాశాలు కల్పించడం వంటి ప్రతి చర్య కూడా మహిళల జీవితాల్లో అర్థవంతమైన మార్పును తీసుకువస్తుంది.
ప్రసిద్ధ స్త్రీవాది, జర్నలిస్టు, కార్యకర్త గ్లోరియా స్టైనమ్ చెప్పినట్టుగా, మహిళల సమానత్వ పోరాటం ఎవరి ఒంటరి కృషి కాదు. మానవ హక్కుల పట్ల శ్రద్ధ ఉన్న అందరి సమిష్టి ప్రయత్నమే. అందుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ఎవరు ఎలా జరుపుకున్నా, హక్కుల కోసం పోరాటంగా, కట్టుబాట్ల పునరుద్ఘాటనగా, విజయాల వేడుకగా లేదా ఉత్సవంగా.. ప్రతి ప్రయత్నం విలువైనదే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 “గివ్ టు గైన్” ఆత్మతో ఐక్యతలో ముందుకు సాగుతూ మహిళలు, బాలికల సాధికారతకు మన వంతు సహకారం అందించడమే నిజమైన గౌరవం. ఇలాంటి చిన్న చర్యలే కలిసి ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వాన్ని బలపరిచే శక్తిగా మారతాయి.
భారత్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
భారత్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న విస్తృతంగా జరుపుకుంటారు. ఇది మహిళల హక్కులు, సమానత్వం, గౌరవం, సాధికారతపై జాతీయ స్థాయిలో చర్చను ముందుకు తీసుకొచ్చే ముఖ్యమైన సందర్భం. స్వాతంత్రానికి ముందు నుంచే మహిళా ఉద్యమాలకు భారత్‌లో బలమైన చరిత్ర ఉంది. స్వాతంత్ర ఉద్యమంలో మహిళల పాత్ర, ఆ తర్వాత భారతరాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు కల్పించడం, ఈ నేపథ్యం మహిళా దినోత్సవానికి ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తుంది. ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు కార్యక్రమాలు నిర్వహించి, మహిళలపై హింస, లింగ వివక్ష, వేతన అంతరం, ఆరోగ్యం, విద్య వంటి అంశాలపై అవగాహన పెంచుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రదర్శిస్తే, పట్టణాల్లో సెమినార్లు, ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఇటీవలి కాలంలో భారత్‌లో మహిళా దినోత్సవం కేవలం వేడుకగా కాకుండా విధానాలపై ప్రభావం చూపే దినంగా మారింది. మహిళల విద్య, ఉపాధి, స్టార్టప్‌లు, క్రీడలు, రాజకీయాల్లో పాల్గొనడంపై దృష్టి పెరిగింది. అలాగే లైంగిక వేధింపుల నిరోధం, పని ప్రదేశాల్లో భద్రత, డిజిటల్ సాధికారత వంటి అంశాలు ప్రధాన చర్చగా నిలుస్తున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు ప్రకటించడం, విజయవంతమైన మహిళలను సత్కరించడం, యువతుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం పరిపాటిగా మారింది. ఈ విధంగా, భారత్‌లో మహిళా దినోత్సవం మహిళల సాధనలను గుర్తించడమే కాకుండా, ఇంకా పరిష్కరించాల్సిన అసమానతలను గుర్తుచేస్తూ, సమానత్వం దిశగా సమాజాన్ని ముందుకు నడిపించే కీలక వేదికగా నిలుస్తోంది
‘జన్ సున్వాయి’
ఈ 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళల సమస్యలను ప్రత్యక్షంగా విని త్వరితగతిన పరిష్కరించేందుకు భారతజాతీయ మహిళా కమిషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ‘జన్ సున్వాయి’ పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమం మహిళా దినోత్సవం రోజు ప్రారంభమయ్యి, అనగా మార్చి 8 నుంచి మార్చి14 వరకు దేశంలోని సుమారు 500 జిల్లాల్లో జరగనుందని కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ కిషోర్ రహాత్కర్ ప్రకటించారు. మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను స్థానిక స్థాయిలోనే విని వెంటనే పరిష్కార మార్గాలను అన్వేషించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు.
ఒక రోజు కాదు, ఒక ఉద్యమం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక పండుగ కాదు, ఒక సెలవురోజు కాదు, ఒక ఉద్యమం. ఇది మహిళలు సాధించిన విజయాలను గుర్తు చేస్తుంది, ఇంకా సాధించాల్సిన లక్ష్యాలను మన ముందుంచుతుంది. సమానత్వం, గౌరవం, స్వేచ్ఛ ఇవి మహిళలకు దయగా ఇవ్వాల్సినవి కాదు, సహజ హక్కులు అని ప్రపంచానికి చాటిచెబుతుంది.
మార్చి8 ఒక్కరోజే కాదు. అది ప్రతి రోజూ మన ఆలోచనల్లో, చర్యల్లో, విధానాల్లో ప్రతిబింబించాలి. మహిళలు ముందుకు సాగితేనే, సమాజం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. ఇదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనకు ఇచ్చే శాశ్వత సందేశం.
