

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన యువకుడికి సీపీ సత్కారం
ఆపదలో ఉన్న ఓ చిన్నారి పాలిట ఆ యువకుడు ఆపద్బాంధవుడయ్యాడు. కామాంధుడి కళ్లుగప్పి, సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎనిమిదేళ్ల బాలికను సురక్షితంగా కాపాడాడు. సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించడమే నిజమైన మానవత్వమని చాటిచెప్పిన మహ్మద్ ఫిరోజ్‌ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. బషీర్‌బాగ్‌లోని పాత సీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఫిరోజ్‌ను శాలువాతో సత్కరించి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
అసలేం జరిగిందంటే..?
ఈ నెల 1వ తేదీన అబిడ్స్ ప్రాంతంలోని ఓ పాఠశాల ముగిసిన అనంతరం ఇంటికి వెళ్తున్న బాలికను, మెహదీపట్నం హిల్స్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ సలీం మాయమాటలతో తన వాహనంలోకి ఎక్కించుకున్నాడు. బాలికను గోల్కొండలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించసాగాడు. అదే సమయంలో మసీదు నుంచి బయటకు వస్తున్న ఫిరోజ్.. ఆటోలో చిన్నారి రోదనలను గమనించారు. అనుమానం వచ్చి వెంటనే ఆటోను అడ్డుకున్నారు. భయంతో వణికిపోతున్న చిన్నారిని ప్రశ్నించగా, డ్రైవర్ దుశ్చర్య బయటపడింది. ఫిరోజ్ గట్టిగా నిలదీయడంతో ప్రమాదాన్ని పసిగట్టిన నిందితుడు బాలికను వదిలేసి పరారయ్యాడు.
బాలిక దగ్గరున్న ఐడీ కార్డు ఆధారంగా ఆమె తండ్రికి ఫిరోజ్ వెంటనే సమాచారం అందించారు. అప్పటికే స్కూల్ వద్ద బిడ్డ కోసం వెతుకుతూ ఆందోళనలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు అబిడ్స్ పీఎస్ బ్లూ కోట్స్ కానిస్టేబుళ్లు సాయికృష్ణ, కేదార్ సింగ్ చేరుకున్నారు. ఫిరోజ్ ఇచ్చిన సమాచారంతో తక్షణమే గోల్కొండకు చేరుకున్న పోలీసులు, బాలికను సురక్షితంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, పరారీలో ఉన్న నిందితుడు సలీంను ఏప్రిల్ 2న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సమాజంలో ఎవరు కష్టాల్లో ఉన్నా స్పందించే గుణం ఉండాలని, నేరం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండకుండా, బాధ్యతాయుతమైన పౌరుడిగా ఫిరోజ్ స్పందించిన తీరు సమాజానికి ఆదర్శం. ప్రతి ఒక్కరూ ఇలాంటి సమయస్ఫూర్తిని అలవరచుకోవాలి అని వీసీ సజ్జనర్ స్పష్టం చేసారు.
సమర్థవంతంగా పనిచేసి బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన బ్లూ కోట్స్ కానిస్టేబుళ్లను కూడా సీపీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ ఎన్. శ్వేత, డీసీపీలు కె. శిల్పవల్లి, ఎస్. శ్రీనివాస్, లావణ్య నాయక్ జాదవ్, అబిడ్స్ ఏసీపీ పి. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
