Let's talk: editor@tmv.in
సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్

సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్

Panthagani Anusha
15 ఫిబ్రవరి, 2026

రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా గత పాలకుల ఆర్థిక విధ్వంసాన్ని చక్కదిద్దుతూనే అభివృద్ధి, సంక్షేమాలను తన రెండు కళ్లుగా భావిస్తూ కూటమి ప్రభుత్వం వార్షిక ప్రణాళికను సిద్ధం చేసింది. శనివారం శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,32,205 కోట్ల భారీ వ్యయంతో కూడిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడీ కాదు ప్రజా సంక్షేమం, అభివృద్ధిని సమతూకంలో పరుగులు పెట్టించే మా ప్రభుత్వ దృఢ సంకల్పం అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు .

ఆర్థిక అగాధాన్ని పూడ్చే ప్రయత్నం

బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో ఆర్థిక మంత్రి గత వైకాపా ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత పాలనలో ఏర్పడిన 'ఆర్థిక గందరగోళం' నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా కోలుకోలేదని వ్యవస్థలను గాడిలో పెట్టడం సవాలుగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాల అమలులో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటును రూ. 22,002 కోట్లుగా (జీఎస్ డీపీ లో 1.11 శాతం) అంచనా వేశారు. బడ్జెట్‌లో మూలధన వ్యయం కింద రూ. 53,915 కోట్లు కేటాయించి మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు.

అమరావతికి నిధుల హారం.. విశాఖకు మాస్టర్ ప్లాన్

రాష్ట్రరాజధాని అమరావతి నిర్మాణ పనులకు ఈ బడ్జెట్‌లో రూ.6,000 కోట్లు కేటాయించారు. రాజధాని ప్రాంతంలో రూ. 57,868 కోట్ల విలువైన 97 ప్రాజెక్టులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు లభించినట్లు మంత్రి వెల్లడించారు. మరోవైపు విశాఖపట్నాన్ని ఆర్థిక శక్తిగా మార్చేందుకు విశాఖ ఆర్థిక ప్రాంతం మాస్టర్ ప్లాన్ కింద రూ. 28,000 కోట్లు ప్రతిపాదించారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.30,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేశారు.

బీసీ సంక్షేమానికి అగ్రతాంబూలం

నిధుల కేటాయింపులో ప్రభుత్వం సామాజిక వర్గాల వారీగా స్పష్టమైన ప్రాధాన్యతనిచ్చింది. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల అభ్యున్నతే లక్ష్యంగా బీసీ సంక్షేమ శాఖకు రికార్డు స్థాయిలో రూ. 51,021 కోట్లు కేటాయించింది. ఇది మొత్తం బడ్జెట్‌లోనే ఒక విభాగానికి చేసిన అత్యధిక కేటాయింపు కావడం గమనార్హం. అదేవిదంగా అగ్రవర్ణాల్లోని పేదల కోసం ఈడబ్ల్యూఎస్ సంక్షేమానికి రూ. 10,700 కోట్లు కేటాయించారు.

సూపర్‌ సిక్స్‌ హామీలకు పెద్దపీట

ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధుల వరద పారించింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రూ. 27,719 కోట్లు, తల్లికి వందనం పథకానికి రూ. 9,668 కోట్లు కేటాయించారు. రైతులకు అండగా నిలిచే అన్నదాత సుఖీభవ పథకానికి రూ. 6,660 కోట్లు, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం దీపం 2.0 పథకానికి రూ. 2,601 కోట్లు కేటాయించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించే స్త్రీ శక్తి పథకానికి రూ. 1,420 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు.

శాఖల వారీగా కేటాయింపులు

విద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాలకు ప్రభుత్వం గణనీయమైన నిధులు ఇచ్చింది. పాఠశాల విద్యాశాఖకు రూ. 32,308 కోట్లు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యవేక్షించే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.22,942 కోట్లు లభించాయి. జలవనరుల శాఖకు (పోలవరం రూ. 6,105 కోట్లతో కలిపి) రూ. 18,224 కోట్లు, మున్సిపల్ పరిపాలనకు రూ. 14,539 కోట్లు, విద్యుత్ రంగానికి రూ. 13,934 కోట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

‘ఏపీ వెల్త్ ఫండ్’.. భవిష్యత్ సంపద సృష్టి

రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే సరికొత్త అడుగుగా "ఏపీ వెల్త్ ఫండ్" ఏర్పాటును మంత్రి ప్రతిపాదించారు. నార్వే, అబుదాబి తరహాలో రూ. 100 కోట్ల సీడ్ కార్పస్‌తో ఈ నిధిని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇది దీర్ఘకాలంలో రాష్ట్ర సంపదను వృద్ధి చేసి రాబోయే తరాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.

అప్పులు–ఆర్థిక దిశ

2026-27 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.7.11 లక్షల కోట్లకు చేరనున్నట్లు అంచనా. ఓపెన్ మార్కెట్ రుణాల ద్వారా రూ.76,000 కోట్లు, కేంద్రం నుంచి రూ.19,000 కోట్లు సమీకరించనున్నారు. కాగా గత పాలనలో ఏర్పడిన ఆర్థిక గందరగోళాన్ని సరిచేయడం సవాలుగా ఉన్నప్పటికీ రాష్ట్ర పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రాజెక్టులకు వేగం పెంచుతూ సంక్షేమ పథకాల అమలులో రాజీ పడబోమని ఆయన హామీ ఇచ్చారు.