Let's talk: editor@tmv.in
సమగ్రాభివృద్ధికి, ఐక్యత - సమానత్వం - సుస్థిరాభివృద్ధే ప్రధానం

సమగ్రాభివృద్ధికి, ఐక్యత - సమానత్వం - సుస్థిరాభివృద్ధే ప్రధానం

Pinjari Chand
23 నవంబర్, 2025

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక–ఆర్థిక ఉద్రిక్తతలు, యుద్ధాలు, అసమానతల మధ్య ఐక్యత, సమానత్వం, స్థిరత్వం సమగ్ర (ఇన్‌క్లూజివ్‌) వృద్ధికి ప్రధాన స్తంభాలని జి20 దేశాలు శనివారం స్పష్టంచేశాయి. ఇక్కడ జరుగుతున్న జి20 నాయకుల సదస్సులో 39 పేజీల భారీ డిక్లరేషన్‌ను సభ్యదేశాల అధినేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. అమెరికా చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసినా డిక్లరేషన్ ను అడ్డుకోలేకపోయిందని దౌత్య వర్గాలు తెలిపాయి.

ఎవరూ వెనుకపడకూడదు

ప్రపంచం పరస్పర ఆధారిత వ్యవస్థ. ఎవ్వరిని దీంట్లో వెనక్కి నెట్టకూడని అభివృద్ధే మా లక్ష్యమని డిక్లరేషన్‌లో జి20 సభ్యదేశాలు మరోసారి స్పష్టం చేశాయి.అభివృద్ధి చెందుతున్న దేశాలకు భాగస్వామ్యం, మాక్రో ఎకనామిక్‌ సమన్వయం, సుస్థిర అభివృద్ధి భాగస్వామ్యం తప్పనిసరిగా అవసరమని పేర్కొన్నాయి.

యుద్ధాలపై కఠిన వ్యాఖ్యలు

రష్యా, ఇజ్రాయెల్‌, మయన్మార్‌లను ఉద్దేశిస్తూ వాటి పేర్లు తీయకుండా ఆయా దేశాలు భూభాగాలపై దాడులు, ఆక్రమణ యత్నాలు ఏవీ చేయకూడదని హెచ్చరించాయి. అంతర్జాతీయ చట్టం, యునైటెడ్ నేషన్స్‌ చార్టర్‌ ప్రకారం ‘శాంతియుత పరిష్కారం తప్పనిసరి’ అని నొక్కిచెప్పాయి. జాతి, మతం, భాష, లింగం అనే తేడా లేకుండా మానవ హక్కులకు గౌరవం ఇవ్వాలని సభ్యదేశాలకు సూచించాయి.

చిన్న దేశాలపై ప్రత్యేక శ్రద్ధ

విపత్తుల ప్రభావం అత్యధికంగా చిన్న దీవి దేశాలు (ఎస్ఐడీఎస్ ), అత్యల్ప అభివృద్ధి చెందిన దేశాలు (ఎల్డీసీస్) మీదే పడుతోందని, వీటి కోసం ప్రత్యేక నిధులు–సహాయం అవసరమని పేర్కొన్నాయి. అభివృద్ధికి అడ్డుగా మారిన భారీ ఋణ భారం పరిష్కారానికి అంతర్జాతీయ వేదికలు చురుకుగా ముందుకు రావాలని సూచించారు. ఎనర్జీ భద్రత “దేశ సార్వభౌమత్వానికి హృదయం” అని జీ20 స్పష్టం చేస్తూ, సౌతాఫ్రికా అధ్యక్షతలో రూపొందిన వాలంటరీ ఎనర్జీ సెక్యూరిటీ టూల్‌కిట్‌ను ప్రశంసించింది. ఎనర్జీ టెక్నాలజీల సమన్వయం, రిస్క్‌ ఐడెంటిఫికేషన్, ప్రాంతీయ ఇంటర్‌ కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిజిలియన్స్, ఎమర్జెన్సీ ప్రిపేర్‌నెస్ వంటి రంగాల్లో ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉపయోగకరమని అభిప్రాయపడ్డాయి. సుస్థిర పారిశ్రామికీకరణ, ఎనర్జీ ట్రాన్సిషన్‌లకు మూలాధారం అని పేర్కొంటూ సుస్థిర పారిశ్రామికీకరణ‌కు సంబంధించిన స్వచ్ఛంద మార్గదర్శకాలను ఆమోదించాయి. క్రిటికల్ మినరల్స్‌ రంగంలో పారదర్శకత–సుస్థిరత కోసం రూపొందిన వాటిని కూడా స్వాగతించాయి. ప్రతి వ్యక్తికి ఆకలి లేని జీవనం ‘మౌలిక హక్కు’ అని జీ20 గుర్తించింది. సురక్షితమైన, పోషకాహారంతో కూడిన ఆహారం అందుబాటులోకి రావడానికి రాజకీయ సంకల్పం అత్యవసరం అని స్పష్టం చేసింది.

టెక్నాలజీ అందరికీ చేరాలంటే…

ఏఐ సహా డిజిటల్‌ టెక్నాలజీల సామర్థ్యం విశాలమని, వాటి లాభాలు ప్రపంచంలో అందరికీ సమానంగా చేరేందుకు నైతిక, సమగ్ర శ్రేణి విధానాలు అవసరమని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.అలాగే మల్టీలేటరల్ డెవలప్‌మెంట్ బ్యాంకులు పేదరికం తగ్గించడం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థికాభివృద్ధికి ప్రధాన బలమని ప్రశంసించాయి.

డిక్లరేషన్‌లో ప్రాముఖ్యత పొందిన ఇతర అంశాలు:

• వాతావరణ మార్పు చర్యలు వేగవంతం చేయాలి

• అవినీతిని అరికట్టే పటిష్ట వ్యవస్థల ఏర్పాటు

• విజిల్‌ బ్లోయర్ రక్షణ పద్ధతులు బలోపేతం

• వలస కార్మికులు, శరణార్థుల హక్కులకు మద్దతు

సోషల్‌ సమ్మిట్‌కు జి20 ప్రశంస

జోహన్నెస్‌బర్గ్‌లో జి20తో పాటు నిర్వహించిన సోషల్‌ సమ్మిట్‌ను డిక్లరేషన్ మెచ్చుకుంది. ప్రభుత్వేతర వర్గాలకు తమ అభిప్రాయాలు వెల్లడించే అరుదైన అవకాశమని పేర్కొంది. చివరగా జి20ను ప్రపంచ ఆర్థిక సహకారానికి ప్రముఖ వేదికగా కొనసాగించాలని ప్రతిజ్ఞ చేసింది. అందరూ సభ్యులు సమాన హోదాతో, ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలి అనే సందేశంతో డిక్లరేషన్ ముగిసింది.

సమగ్రాభివృద్ధికి, ఐక్యత - సమానత్వం - సుస్థిరాభివృద్ధే ప్రధానం - Tholi Paluku