Let's talk: editor@tmv.in
సభ ప్రతిష్టను దిగజార్చకండి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

సభ ప్రతిష్టను దిగజార్చకండి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Panthagani Anusha
13 ఫిబ్రవరి, 2026

శాసనసభ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రవర్తించడం ఎవరికీ తగదని ప్రజల్లో చట్టసభలపై విశ్వాసం సన్నగిల్లేలా వ్యవహరించడం బాధ్యతారాహిత్యమని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. బుధవారం గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగం సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ సభ్యులు అనుసరించిన తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గురువారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో మాట్లాడిన స్పీకర్.. ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన తనను ఎంతో కలచివేసిందని ఆవేదన చెందారు.

గవర్నర్ ప్రసంగానికి అడుగడుగునా అంతరాయం కలిగించడం, నినాదాలతో సభను హోరెత్తించడం అధికారిక పత్రాలను చింపివేయడం వంటి ఘటనలను స్పీకర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధులు సభ గౌరవాన్ని పెంచలేకపోయినా పరవాలేదు కానీ ప్రజల దృష్టిలో దానిని అణగదొక్కే హక్కు ఎవరికీ లేదని ఆయన తేల్చి చెప్పారు. చట్టసభల పనితీరును ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపై ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

మరోవైపు సభా కార్యక్రమాలను వీక్షించేందుకు గ్యాలరీకి వచ్చిన పాఠశాల విద్యార్థుల సమక్షంలోనే ఇలాంటి ఘటనలు జరగడం పట్ల స్పీకర్ విచారం వ్యక్తం చేశారు. “ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులను ఆహ్వానిస్తే మనం ఇచ్చే సందేశం ఇదేనా? ఆ పిల్లలు మన గురించి ఏమనుకుంటారు? రేపటి పౌరుల మనసుల్లో చట్టసభలపై ప్రతికూల భావన ఏర్పడితే దాన్ని ఎవరూ తుడిచి వేయలేరు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ముందు ప్రజాప్రతినిధులు హుందాతనాన్ని కోల్పోవడం భవిష్యత్తు తరాలకు తప్పుడు సంకేతాలు పంపడమేనని హెచ్చరించారు.

ఆత్మపరిశీలన చేసుకోవాలి

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తమ ప్రవర్తనపై ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్ఆర్‌సీపీ సభ్యులకు స్పీకర్ సూచించారు. సభ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని పేర్కొన్నారు. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో సోమవారం సభ్యులు సభను నుంచి వాకౌట్ చేసిన నేపథ్యంలో తాజాగా స్పీకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.