Let's talk: editor@tmv.in
సీబీఐకి సవీంద్రారెడ్డి అరెస్ట్ కేసు

సీబీఐకి సవీంద్రారెడ్డి అరెస్ట్ కేసు

Venkatesh Balusula
27 సెప్టెంబర్, 2025

సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డిపై అక్రమ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్ట్ జారీ చేసిన ఆదేశాలు సీఎం చంద్రబాబుకు చెంపపెట్టని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. హైకోర్ట్ జారీ చేసిన ఈ ఆదేశాలను వైయస్ఆర్‌సీపీ స్వాగతిస్తోందన్నారు. ఒకవైపు కోర్ట్‌లు ఈ ప్రభుత్వ దుర్మార్గాలపై మొట్టికాయలు వేస్తున్నా, సీఎం చంద్రబాబు సోషల్ మీడియా నియంత్రణ కోసం అంటూ కమిటీ వేసేందుకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభ సాక్షిగా తాను గొప్ప విజనరీని అని చెప్పుకున్న చంద్రబాబు, ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి ప్రశ్నిస్తున్న సోషల్ మీడియాపై ఎందుకు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో కూడా చెప్పాలని నిలదీశారు.

ప్ర‌శ్నించాడ‌న్న అక్కసుతోనే అక్ర‌మ కేసు

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాడనే అక్కసుతోనే సోషల్ మీడియా సవీంద్రారెడ్డిపై చట్టాలను అపహాస్యం చేస్తూ గంజాయి కేసు పెట్టార‌న్నారు. ఈ అక్రమ అరెస్ట్‌పై ఆయన కుటుంబం కోర్ట్‌ను ఆశ్రయించడంతో పోలీసుల నిర్వాకం న్యాయస్థానంలో బట్టబయలు అయ్యింద‌ని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై వచ్చేనెల 13వ‌ తేదీ లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సీబీఐని హైకోర్ట్ ఆదేశించింది. ప్రభుత్వ వైఫల్యాలను, అసమర్థతను ప్రశ్నించే వారి పట్ల అత్యంత దుర్మార్గంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంద‌న్నారు. ఇటువంటి నిరంకుశ విధానాలు, చట్ట విరుద్దంగా వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలు ప్రజాస్వామిక స్పూర్తిని పరిరక్షించేలా ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

చంద్రబాబుపై అవినీతి విమ‌ర్శ‌లు

ఏడాదిన్న కూటమి పాలనలో ప్రజలకు ఏం మేలు చేశామో చెప్పుకోలేని స్థితిలో సీఎం చంద్రబాబు ఉన్నార‌ని జోగి ర‌మేష్ విమ‌ర్శించారు. అసెంబ్లీ సమావేశాల సాక్షిగా దొంగతనం ఎలా చేయాలి, పట్టుబడకుండా ఎలా వ్యవహరించాలి, మోసం ఎలా చేయాలి, వెన్నుపోటు ఎలా పొడవాలి, తరువాత దానిని ఎలా సమర్థించుకోవాలి అనే విషయంలో శాసనసభ్యులు, స్పీకర్‌కు సీఎం చంద్రబాబు చాలా గొప్ప ప్రజెంటేషన్ ఇచ్చార‌ని ఎద్దేవా చేశారు..గతంలో రూ.371 కోట్లు స్కిల్ స్కాంలో ఇదే చంద్రబాబు సీఎంగా దోచుకుని అవినీతికి పాల్పడ్డార‌ని ఆరోపించారు. మరోవైపు ఆయన తాబేదారు నోటుకు కోట్లు కేసులో రూ.50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయాడ‌ని, అదే సమయంలో చంద్రబాబు ఫోన్ సంభాషణలో ఇదే కేసులో దొరికిపోయాడ‌ని విమ‌ర్శించారు. అధికార కాంక్షతో సొంత‌ మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడ‌ని ఆరోపించారు. చింతమనేని ప్రభాకర్ ప్రజలపై రౌడీయిజం చేస్తూ, ప్రభుత్వ మహిళా అధికారిణిపై దౌర్జన్యం చేస్తే, ఆయనపై ఉన్న కేసులను చంద్రబాబు వ్యతిరేకిస్తార‌న్నారు.

వైయ‌స్ జ‌గ‌న్‌కు అడుగ‌డుగునా ఆంక్ష‌లు

చంద్రబాబుకు నిత్యం వైయస్ జగన్ పేరు స్మరించనిదే నిద్రపట్టడం లేద‌ని జోగి ర‌మేష్ అన్నారు. జ‌గ‌న్‌ ఎక్కడ మళ్లీ సీఎం అవుతాడేమోననే భయంతో వణికిపోతున్నాడ‌న్నారు. ప్రజల్లో అత్యంత ఆదరణ ఉన్న నాయకుడుగా ఉన్న నేత వైయస్ జగన్ అని, వైసీపీకి ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వడానికే భయపడుతున్నార‌ని పేర్కొన్నారు. చివరికి వైయస్ జగన్ ప్రజల్లోకి వెడుతున్నా సరే అనేక ఆంక్షలు పెట్టి, అడుగుడుగునా ఆటంకాలు కల్పిస్తున్నార‌న్నారు. రాష్ట్రంలో యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధర లేని పరిస్థితిపై సోషల్ మీడియాలో అనేక మంది ప్రశ్నిస్తుంటే, దానిని పరిష్కరించకుండా అలా ప్రశ్నిస్తున్నవారిపైనే చర్యలకు సిద్దమయ్యారు. బీఎన్‌ఎస్ సెక్షన్లు పెట్టి, వారిని అక్రమంగా అరెస్ట్ చేసి, జైళ్ళపాలు చేయాలని కుట్రకు తెగబడ్డార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయస్ జగన్ హయాంలో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి, అయిదు కాలేజీలను ప్రారంభించామ‌ని, కూటమి ప్రభుత్వం మొత్తం కాలేజీలను తనకు కావాల్సిన వారికి అమ్ముకునేందుకు సిద్దమైంద‌ని ఆరోపించారు. .

ప‌వ‌న్ క‌ళ్యాన్‌పై విమ‌ర్శ‌లు

చంద్రబాబు బాటలోనే నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నడుస్తున్నాడ‌ని, అసెంబ్లీలో సైకోలుగా మారి మాట్లాడుతున్న వీరిని చూసి ప్రజలు అవాక్కవుతున్నార‌ని విమ‌ర్శించారు. ఇలాంటి వాళ్ల‌ని అసెంబ్లీకి పంపాం అని ప్ర‌జ‌లు బాధపడుతున్నార‌న్నారు. ఎన్టీఆర్ రాజకీయ వారసుడిని అని చెప్పుకునే అర్హత బాలకృష్ణకు లేద‌న్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి ఎందుకు రాజకీయ వారసుడిగా బాలకృష్ణ నిలబడలేద‌ని ప్ర‌శ్నించారు. ఎన్టీఆర్‌ను చెప్పులతో కొట్టిస్తే, అదే చంద్రబాబు పంచన చేరి, వైయస్ జగన్ వంటి ప్రజానాయకుడి గురించి పిచ్చిపట్టినట్లు మాట్లాడార‌ని వ్యాఖ్యానించారు. అలాగే కూటమి ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవిని గురించి నిండు సభలో వాడు, వీడు అంటూ కనీస మర్యాద కూడా లేకుండా దూషించాడ‌ని, దీనిపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? అని, తన అన్నను అసెంబ్లీలో కించపరిచేలా మాట్లాడితే చీమకుట్టినట్లు కూడా అనిపించడం లేదా? అని ప్ర‌శ్నించారు. చివరికి విదేశాల్లో ఉన్న చిరంజీవి దీనిపై స్పందించార‌ని, వైయస్ జగన్ సీఎంగా తనకు సముచిత గౌరవం ఇచ్చారు, భోజనం పెట్టి పంపారు అని చెప్పార‌ని, ప‌వ‌న్ దీనిపై ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని నిల‌దీశారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతున్న‌ద‌ని ఆయ‌న ఆరోపించారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక వైసీపీ నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుంటూ అరెస్టుల ప‌ర్వం కొన‌సాగుతోంద‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈ అరెస్టుల ప‌ర్వం కొన‌సాగుతోంద‌ని చెప్పారు. ఇప్ప‌టికైనా కూట‌మి ప్ర‌భుత్వం త‌న తీరును మార్చుకోవాల‌ని సూచించారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌న్నారు.

సీబీఐకి సవీంద్రారెడ్డి అరెస్ట్ కేసు - Tholi Paluku