
సూపర్-4కు భారత్.. మరి పాకిస్తాన్?
ఆసియా కప్ 2025లో గ్రూప్-ఏ నుంచి భారత జట్టు సూపర్-4కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. యూఏఈ, పాకిస్తాన్లతో తమ తొలి రెండు మ్యాచ్లలో ఘన విజయాలు సాధించిన తర్వాత, యూఏఈ ఒమన్ను ఓడించడంతో భారతదేశం అధికారికంగా సూపర్-4లో స్థానం దక్కించుకుంది. ఇప్పుడు గ్రూప్-ఏ నుంచి సూపర్-4కు వెళ్లే రెండో జట్టు కోసం పాకిస్తాన్, యూఏఈ మధ్య పోటీ నెలకొంది. ఈ కీలక దశలో ఒకవేళ పాకిస్తాన్ టోర్నమెంట్ నుంచి వైదొలగితే ఎలాంటి పరిణామాలు ఉంటాయనే ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది.
భారత్ సూపర్-4కు అర్హత సాధించిందిలా
ఆసియా కప్ 2025 గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ జట్లు ఉన్నాయి. భారత్ తన తొలి మ్యాచ్లో యూఏఈపై 9 వికెట్ల తేడాతో, రెండో మ్యాచ్లో పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో గెలిచి అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. రెండు విజయాలతో భారత్ 4 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా, ఒమన్-యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్లో యూఏఈ 42 పరుగుల తేడాతో ఒమన్ను ఓడించింది. దీంతో ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఫలితం భారత్కు సూపర్- 4లో స్థానాన్ని అధికారికంగా ఖరారు చేసింది.
రెండో జట్టు ఏది?
ఇక గ్రూపు-ఏ నుంచి సూపర్ ఫోర్ రౌండ్కు అర్హత సాధించేందుకు పాకిస్తాన్, యూఏఈ జట్లు బుధవారం పోటీ పడనున్నాయి. ఈ రెండు జట్లు తలపడే చివరి గ్రూప్ మ్యాచ్లో గెలిచిన జట్టు సూపర్-4కు అర్హత సాధిస్తుంది. అయితే ఇవాళ జరిగే ఈ మ్యాచ్లో యూఏఈని ఓడించడం పాక్కు అంత సులువు కాదు. ఎందుకంటే ఈ టోర్నీకి ముందు జరిగిన ట్రై సిరీస్లో కూడా పాక్కు యూఏఈ గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు ఆసియా కప్లోనూ అదే పట్టుదలతో పాక్ను ఢీకొట్టేందుకు సిద్దమైంది. పాకిస్తాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరూ ఊహించలేరు. పాక్ జట్టు జింబాబ్వే వంటి పసికూన చేతిలో కూడా ఓడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు జట్లలో ఎవరూ సూపర్-4కు వెళ్తారన్నది ముందే అంచనా వేయడం కష్టమనే చెప్పాలి.
మరోవైపు కొన్ని కారణాల వల్ల పాకిస్తాన్ టోర్నమెంట్ నుంచి వైదొలగే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత రెండు జట్ల ఆటగాళ్ల మధ్య షేక్హ్యాండ్ల వివాదం తలెత్తడం, దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేయడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఐసీసీ చర్యలు తీసుకోపోతే యూఏఈతో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బెదిరిస్తోంది.
ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే టోర్నమెంట్ నుంచి వైదొలిగితే, యూఏఈ ఎటువంటి పోటీ లేకుండా సూపర్ 4కు అర్హత సాధిస్తుంది. ఇది ఆసియా కప్ షెడ్యూల్ను ప్రభావితం చేయడంతో పాటు మొత్తం టోర్నీ మజానే తగ్గిస్తుంది. ఎందుకంటే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. గ్రూప్ దశలో ఇప్పటికే ఒకసారి ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఒకవేళ పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధిస్తే, ఈ రెండు జట్లు మరోసారి తలపడే అవకాశం ఉంది. ఒకవేళ ఫైనల్లోనూ ఇద్దరు టాప్-2లో నిలిస్తే మూడోసారి కూడా మ్యాచ్ జరగొచ్చు. కానీ పాకిస్తాన్ వైదొలిగితే ఈ ఉత్కంఠకు తెరపడినట్టే అవుతుంది.
