Let's talk: editor@tmv.in
సెప్టెంబర్ 30 లోపు

సెప్టెంబర్ 30 లోపు

Aravind Maryada Reddy
20 సెప్టెంబర్, 2025

తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఈనెల 30 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ కుదరని స్పష్టం చేశారు. తాము త్వరలోనే ఈ విషయంపై న్యాయనిపుణులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.

తెలంగాణలో సర్పంచుల పదవీ కాలం 2024లో ముగిసిన తర్వాత గ్రామాల్లో పాలనా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు జూన్ 25, 2025న సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలు నిర్వహించలేమని చేతులెత్తేశారు. ఈ నిర్ణయం గ్రామాల పరిస్థితిని మరింత దిగజార్చడంతో పాటు రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశం ఉందన్న చర్చ జరుతుతోంది.

కోర్టు దిక్కరణ కిందకు వస్తుందా?

హైకోర్టు స్పందన ఎలా ఉండవచ్చు అనే విషయానికి వస్తే, కోర్టు ఆదేశాలు పాటించకపోతే అది కోర్టు దిక్కరణ (కంటెంప్ట్ ఆఫ్ కోర్టు) కిందికి వస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. హైకోర్టు ప్రభుత్వాన్ని జరిమానా విధించవచ్చు లేదా ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలని మరింత కఠినంగా ఆదేశించవచ్చు. గతంలో కూడా తెలంగాణలో స్థానిక ఎన్నికల ఆలస్యం విషయంలో హైకోర్టు పలుమార్లు ప్రభుత్వాన్ని మందలించింది. ఈసారి ప్రభుత్వం బీసీ కోటా 42 శాతం పెంచడం, వరదలు, ఇతర కారణాలు చూపి వాయిదా కోరినా కోర్టు సానుకూలంగా స్పందించకపోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలు ప్రజాస్వామ్యంగా నడవాలి. కోర్టు తీర్పు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారవచ్చు, ఎందుకంటే ఇది రాజకీయంగా ప్రతిపక్షాలకు మంచి అస్త్రం అవుతుంది.

ప్రత్యేక అధికారుల చేతుల్లో పాలన

సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత గ్రామ పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల చేతుల్లో ఉన్నాయి. ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే కావడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా వంటి మౌలిక సమస్యలు పరిష్కారం కావడం లేదు. వరదలు వచ్చినప్పుడు సహాయం చేరడం ఆలస్యమవుతోంది. గ్రామాల్లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు, ఎందుకంటే ఎన్నికైన ప్రతినిధులు లేకుండా సమస్యలు చెప్పుకునే వారు లేరు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది, ప్రజల విశ్వాసం ప్రభుత్వంపై తగ్గుతోంది.

ఆలస్యంతో కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందా?

స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యంగా జరిగితే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందా? మేలు చేసే అంశమా అంటే, రెండు వైపులా ఉంది. ఒకవైపు పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో తమ నాయకత్వాన్ని బలోపేతం చేసుకునేందుకు సమయం దొరుకుతుంది. బీసీ కోటా పెంచడం ద్వారా వెనుకబడిన వర్గాల మద్దతు పెంచుకోవచ్చు. ఇది భవిష్యత్ ఎన్నికల్లో ఉపయోగపడుతుంది. కానీ మరోవైపు హైకోర్టు ఆదేశాలు పాటించకపోతే ప్రభుత్వం అసమర్థతగా కనిపిస్తుంది. ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ దీన్ని రాజకీయంగా వాడుకుని విమర్శలు చేస్తాయి. ప్రజల అసంతృప్తి పెరిగి పార్టీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. మొత్తంగా ఆలస్యం కాంగ్రెస్‌కు తాత్కాలిక లాభం ఇచ్చినా దీర్ఘకాలంలో నష్టమే మిగులుతుంది. ఈ జాప్యంతో జరిగే పరిణామాలు చూస్తే, గ్రామాల్లో పాలనా శూన్యత మరింత కాలం కొనసాగి అభివృద్ధి ఆగిపోతుంది. ప్రజలు సమస్యలు పరిష్కరించుకోలేక అసంతృప్తి పెరుగుతుంది. ఇది రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది.

ప్రభుత్వ వ్యతిరేకతతోనే వెనక్కి తగ్గారా?

ప్రస్తుతం తెలంగాణలో యూరియా కొరత తీవ్ర సమస్యగా మారింది. బ్లాక్ మార్కెట్‌లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. వర్షాకాలం ముగిసిన తర్వాత విత్తనాలు వేసే సమయంలో ఈ కొరత రైతులను మరింత ఇబ్బంది పెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల టన్నుల యూరియా అవసరం ఉన్నప్పటికీ, కేవలం 2 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రైతులు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగదన్న చర్చ సాగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారా? అన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తుంది? పరిస్థితులు సద్దుమణిగాక.. యూరియా కొరత సమస్య లేకుండా పోయాకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నిర్వహిస్తుందా? అన్నది వేచి చూడాలి.

సెప్టెంబర్ 30 లోపు - Tholi Paluku