Let's talk: editor@tmv.in
సనాతన విలువల సారథి పతంజలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

సనాతన విలువల సారథి పతంజలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Pinjari Chand
3 నవంబర్, 2025

యోగా, ఆయుర్వేదం, నేచురోపతి రంగాల్లో భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో పతంజలి యూనివర్సిటీ కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఆదివారం జరిగిన పతంజలి యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవంలో ఆమె ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ భారత మహానుభావులు మానవ సంస్కృతి అభివృద్ధికి విశేష కృషి చేశారు. మహర్షి పతంజలి యోగా ద్వారా మనస్సును, వ్యాకరణం ద్వారా మాటలను, ఆయుర్వేదం ద్వారా శరీరాన్ని పవిత్రం చేశారు. ఆయన స్ఫూర్తితో ఈ యూనివర్సిటీ సమాజానికి ఆ ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందిస్తున్న తీరు అభినందనీయం అని కొనియాడారు. ఈ పవిత్రమైన నేలపై ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. స్వస్థ్ భారత్ లో ఈ సంస్థ భాగం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణజీ, బాబా రాందేవ్ కు ధన్యవాదాలు తెలిపారు.

పతంజలి యూనివర్సిటీ భారతీయ దృక్కోణంలో విద్యా విధానాన్ని కొనసాగిస్తోందని ఆమె పేర్కొన్నారు. వేద జ్ఞానం, ఆధునిక విజ్ఞాన పరిశోధనల సమన్వయంతో గ్లోబల్‌ సవాళ్లను ఎదుర్కొనే దిశగా ఈ సంస్థ ముందుకు సాగుతోందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, ప్రకృతితో అనుకూల జీవనశైలి అనుసరణ భవిష్యత్‌ మానవతకు అత్యవసరం. ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు ఈ విలువలను జీవితంలో అమలు చేస్తారని రాష్ట్రపతి ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు.

‘సర్వే జనాః సుఖినో భవంతు’ అనే మన సంస్కృతి సూత్రం సమగ్ర అభివృద్ధికి మార్గదర్శకం అవుతుందన్నారు. వ్యక్తి అభివృద్ధి ద్వారానే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. వ్యక్తిత్వ వికాసం ద్వారా దేశ నిర్మాణ మార్గంలో పతంజలి యూనివర్సిటీ అడుగులు వేస్తోందని ఆమె ప్రశంసించారు. అమ్మాయిలు కూడా బాగా చదువుకోవాలని సూచించారు. బాగా చదివితేనే వికసిత్ భారత్ సాధ్యమన్నారు. ఈ విశ్వవిద్యాలయం నుంచి పట్టాలు పొందిన విద్యార్థులు సత్ప్రవర్తనతో ఆరోగ్యవంతమైన సమాజం, అభివృద్ధి చెందిన భారత్‌ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని నాకు నమ్మకం ఉందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. తదనంతరం విద్యార్థులకు పట్టాలందించారు.