
సనాతన ధర్మ రక్షణకు కమిటీ ఏర్పాటు చేయాలి: ఉపముఖ్యమంత్రి
తిరుమల తిరుపతి దేవస్థానంలో నకిలీ నెయ్యి సరఫరా విషయం బయటపడటం దేశవ్యాప్తంగా భక్తుల్లో ఆగ్రహం రేపింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ హిందూ సంప్రదాయాలు, ధార్మిక ఆచారాలను కాపాడేందుకు “సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు” ఏర్పాటు అత్యవసరమని పేర్కొన్నారు. ఈ బోర్డును సంబంధిత భక్తపక్షాలు, ఆధ్యాత్మిక వర్గాలు, న్యాయ నిపుణుల సలహాలతో ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక అన్వేషణ బృందం (సిట్ ) వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితులు భారీగా నకిలీ నెయ్యి తయారుచేసి సరఫరా చేసినట్లు బయటపడింది. మొత్తం 68 లక్షల కిలోల నకిలీ నెయ్యి సుమారు రూ. 251 కోట్ల విలువ చేస్తుందని సిట్ తన దర్యాప్తులో వెల్లడించింది. అంతేకాక ఈ నెయ్యిలో 37 లక్షల కిలోలు (రూ. 137 కోట్లు) వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్లు గుర్తించారు.
అయితే ఈ నెయ్యిని భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డు తయారీలో ఉపయోగించినట్లు తెలియడంతో తిరుమల దేవాలయ సంప్రదాయం, భక్తుల విశ్వాసం పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తిరుమల కేవలం పుణ్యక్షేత్రం మాత్రమే కాదని, ప్రపంచ హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిందని ఆయన అన్నారు. తిరుపతి లడ్డు భక్తులకు ప్రసాదం మాత్రమే కాకుండా, భక్తి, విశ్వాసం, ఆనందానికి ప్రతీక, భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి ప్రసాదాన్ని పంచుకోవడం ద్వారా ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడుతుందని వివరించారు. ప్రతి సంవత్సరం దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలను దర్శించుకునేందుకు వస్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో భక్తులు నమ్మకంతో వస్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. పవన్ వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే చేశారని, అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో భక్తులు మృతిచెందినప్పుడు భక్తుల కుటుంబాలను పరామర్శించకపోవడం, సంతాపం తెలియజేయకపోవడం ఆయనలో ప్రజాప్రతినిధికి కావాల్సిన నైతిక బాధ్యతలు లేవని రుజువు చేస్తోందని అన్నారు.
అదే విధంగా విశాఖపట్నంలోని టీడీపీ నేత కోల్డ్ స్టోరేజ్‌లో రూ. 1.89 లక్షల కిలోల గోమాంసం కేసుపై పవన్ కళ్యాణ్ మౌనం పాటించారని రాంబాబు ఆరోపించారు. హిందూ ధర్మంపై మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇలాంటి సున్నితమైన విషయాలపై స్పందించకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. రాంబాబు ఎద్దేవా చేస్తూ, “సనాతన ధర్మ పరిరక్షకుడని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు బయటకు వచ్చారు. న్యాయం, సత్యం, ధర్మం కోసం కాదు… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం కోసం ముందుకు రావడం నిజంగా విచిత్రం,” అంటూ ‘X’లో వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా నడుస్తున్నాయి. దేవాలయాల పరిరక్షణ, ప్రసాదాల నాణ్యత, భక్తుల విశ్వాసం వంటి అంశాలపై అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సిట్ పూర్తి నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టే అవకాశముంది. ఇదే సమయంలో టీటీడీ ఈ వ్యవహారంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు.
