Let's talk: editor@tmv.in
సనాతన ధర్మం మూఢనమ్మకం కాదు: డిప్యూటీ సీఎం

సనాతన ధర్మం మూఢనమ్మకం కాదు: డిప్యూటీ సీఎం

Panthagani Anusha
9 డిసెంబర్, 2025

సనాతన ధర్మం ఎప్పటికీ మూఢనమ్మకానికి ప్రతీక కాదని, అది మానవజాతికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శాస్త్రీయంగా అందించే మార్గదర్శి అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రం ఉడుపిలోని శ్రీకృష్ణ క్షేత్రంలో పర్యాయ పుట్టిగె శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ‘బృహత్‌ గీతోత్సవ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పర్యాయ పుట్టిగె మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ పవన్ కళ్యాణ్‌కు ‘అభినవ శ్రీకృష్ణదేవరాయ’ బిరుదును ప్రదానం చేశారు. కనక కిండి ద్వారా శ్రీకృష్ణుడి దర్శనం అనంతరం స్వామీజీ ఆశీర్వచనం పొందిన పవన్ కళ్యాణ్‌కు ఆ క్షణం ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతి కలిగిందని చెప్పారు. కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు బి. ఆనంద్ సాయి పాల్గొన్నారు.

మన ధర్మాన్ని మనమే పరిరక్షించుకోవాలి

స్వామీజీ ఆశీర్వచనం అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇతరులు మన ధర్మం మీద దాడులు చేస్తున్నారు అని అనడం కంటే ముందు మనం మన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి, ఇతరులు మనపై దాడి చేయకుండా గళమెత్తాలన్నారు. తమిళనాడులో మన ధర్మాన్ని మనం అనుసరించడం కోసం న్యాయ పోరాటాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రతి హిందువులో చైతన్యం రావాలన్నారు.

భగవద్గీత ఏ ప్రాంతానికీ ఏ మతానికి పరిమితమైన గ్రంథం కాదని అది సమస్త మానవాళి కోసం వెలువడిన విజ్ఞాన భాండాగారం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భగవద్గీత మనసుకు ధైర్యం ఇచ్చే గురువు, అయోమయంలో దారిచూపే దిక్సూచి. దీనిని పెద్దలు పూజ గదిలో పెట్టే గ్రంథమని భావించకూడదు. యువత తప్పనిసరిగా చదవాలి. మనం ప్రతిరోజూ చిన్న చిన్న కురుక్షేత్రాలను ఎదుర్కొంటున్నాం… అలాంటి సమయంలో గీత మనకు బలాన్నిస్తుంది అని పేర్కొన్నారు.

ఎన్నికల ముందు 'గీత' ఇచ్చిన మార్గనిర్దేశం

గీత నాకు నిష్కామ కర్మ నేర్పింది. నేను మంత్రిగా నా కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తాను, ఓట్లు వస్తాయా రావా అనేది రెండో విషయం. సత్యం పక్షాన నిలబడాలి, ఒంటరిగా నిలబడాల్సి వచ్చినా సరే అని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు కురుక్షేత్రంలో అర్జునుని తరహాలో నాలోనూ అనేక సంశయాలు నెలకొన్న సమయంలో, శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం భగవద్గీత స్మరించుకుని, 21 సీట్లకు మాత్రమే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే వ్యక్తిగత లాభం కంటే రాష్ట్ర ప్రయోజనం ప్రధానం అని భావించాను. ఇదే ధర్మ–కర్తవ్య సంబంధం. నేను ఈరోజు ఇక్కడికి ఉప ముఖ్యమంత్రిగా కాదు, ధర్మాన్వేషిగా ఈ సభకు వచ్చాను.అని పేర్కొన్నారు. “ధర్మం మానవత్వానికి నైతిక దిక్సూచి… రాజ్యాంగం న్యాయ దిక్సూచి. రెండింటి లక్ష్యం ఒకటే న్యాయం, సమానత్వం, కరుణతో కూడిన సమాజం నిర్మాణం” అని అన్నారు.

భారత ఆధ్యాత్మిక శక్తి కేంద్రం – ఉడుపి

ఉడుపి క్షేత్రంలో అడుగుపెట్టగానే అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగిందని పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా తెలిపారు.

“ఇది ఆలయ పట్టణం మాత్రమే కాదు… భారత ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. లక్ష మంది భక్తులు ఏకస్వరంతో చేసిన గీతా పారాయణం భారత రక్షణ కవచం లాంటిది. కోటి మంది కలిసి గీతను స్వహస్తాలతో రాయడం ఇది పుట్టిగె మఠం తీసుకున్న చారిత్రాత్మక సంస్కృతిక బాధ్యత” అని కొనియాడారు.

ఇటీవల పుట్టిగె మఠాధిపతి సహా ఇతర మఠాధిపతులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ‘భారత భాగ్య విధాత’ బిరుదు ప్రదానం చేయడాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి దేశ సంస్కృతిని బలోపేతం చేయడంలో చేస్తున్న నిరంతర సేవకు ఇచ్చిన గౌరవం అది” అని తెలిపారు.

సనాతన ధర్మం మూఢనమ్మకం కాదు: డిప్యూటీ సీఎం - Tholi Paluku