Let's talk: editor@tmv.in
సునీతకు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ టికెట్

సునీతకు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ టికెట్

Aravind Maryada Reddy
27 సెప్టెంబర్, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. అటు కాంగ్రెస్ పార్టీ సైతం ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి, సునీతను బరిలోకి దించబోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందని.. హామీలు అమలు చేయడం లేదు కాబట్టి తమకు గెలుపు అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ భావిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఉందా? అన్నది అనుమానమే. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. సర్వశక్తులు ఒడ్డేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ముస్లిం ఓటు బ్యాంక్, బస్తీ ఓటు బ్యాంక్ ఈ ఎన్నికల్లో కీలకంగా కాబోతున్నాయి.

కేసీఆర్ ఏమన్నారు?

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. పార్టీ కార్యకర్తలను ఆ దిశగా సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేయాలని.. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడం లేదని.. అభివృద్ధి చేయడం లేదని ప్రతి ఓటరు దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించాలని ఆయన నేతలకు సూచించారు. సర్వేలు మొత్తం మనకే అనుకూలంగా ఉన్నాయంటూ ఆయన చెప్పుకున్నారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్‌తో పాటు పలువురు నాయకులతో ఆయన సమావేశమయ్యారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ధనవంతులు, ఐటీ నిపుణులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ 20,000కి పైగా ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ తరపున గెలిచారు. ఆయన ఇటీవల మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల్లోనూ ఆయనకు మంచి పేరుంది. అందుకే ఈ నియోజకవర్గంలో సానుభూతి పనిచేస్తుందని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

సునీతకు అనుభవ లేమి?

అయితే బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు పెద్దగా రాజకీయ అనుభవం లేదు. గోపినాథ్ అనుచరులు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్, పార్టీ ముఖ్య నేతల సహకారంతో ఆమె ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావు ఈ నియోజకవర్గం మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి.. పోల్ మేనేజ్ మెంట్, బస్తీ వాసులను ఆకట్టుకోవడం, ముస్లిం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మజ్లిస్ మద్దతు కూడా ఈ ఎన్నికల్లో అత్యంత కీలకం.

కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్ఠాత్మకం

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానం అయినప్పటికీ కాంగ్రెస్ ఈ నియోజకవర్గం మీద గట్టి ఫోకస్ పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు సాగుతోంది. బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ నియోజకవర్గ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొండాపూర్-గచ్చిబౌలి ఫ్లైఓవర్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రచారంలో హైలైట్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో నవీన్ యాదవ్‌కు బస్తీల్లో మంచి ఆదరణ ఉంది. దీంతో ఆయనకు టికెట్ ఇస్తే బీసీ ఓట్లు కూడా కలిసివస్తాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.

గత ఎన్నికల్లో ఏ పార్టీ ఓటు షేర్ ఎంత?

2023 ఎన్నికల ఓటు షేర్‌లో బీఆర్ఎస్ 48%, కాంగ్రెస్ 40%, బీజేపీ 10% సాధించాయి. ప్రస్తుత సర్వేలు బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అధికార బలం, స్థానిక అభివృద్ధి పనులు ఈ పోటీని తీవ్రంగా మార్చాయి. బీఆర్ఎస్ సానుభూతి పనిచేస్తుందా? లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికార బలం పని చేస్తుందా? అన్నది వేచి చూడాలి.

సునీతకు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ టికెట్ - Tholi Paluku