Let's talk: editor@tmv.in
సుధీర్ఘ రష్యా యుక్రెయిన్ యుద్ధం- సమాధానం లేని ప్రశ్నలు

సుధీర్ఘ రష్యా యుక్రెయిన్ యుద్ధం- సమాధానం లేని ప్రశ్నలు

Dr.Chokka Lingam
27 సెప్టెంబర్, 2025

యుక్రెయిన్ యుద్ధంతో రష్యా బలహీనపడిందా? వారంలో ముగించగల యుద్ధాన్ని మూడున్నరేళ్లయినా ముగించలేకపోవడానికి రష్యా శక్తిమంతంగా లేకపోవడమే కారణమా? రష్యాను పేపర్ టైగర్ అని, యుక్రెయిన్ పోగొట్టుకున్న భూభాగాన్ని తిరిగి పొందగలదని ట్రంప్ ఇప్పుడెందుకు చెబుతున్నారు? అసలు యుక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాకున్న వ్యూహమేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ కచ్చితమైన సమాధానాలు లేవు కానీ అంతర్జాతీయంగా ఇదొక పరిష్కారం లేని సమస్యగా మిగిలిందిన్నది మాత్రం నిజం. 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై పూర్తిస్థాయి ఆక్రమణ ప్రారంభించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన వెంటనే ఒక వారం లేదా ఒక నెలలో యుక్రెయిన్‌పై రష్యా విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ యుక్రెయిన్ యుద్ధం అంచనాలకు అందనిరీతిలో సాగింది. అమెరికా, పాశ్చాత్యదేశాల ఆయుధ, ఆర్థిక సహకారం, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ పట్టుదల కలిసి దీన్ని సుదీర్ఘయుద్ధంలా మార్చేశాయి. ఓ లక్ష్యం లేకుండా రష్యా మూడున్నరేళ్లగా యుద్ధం చేస్తోందని, నిజమైన మిలటరీ శక్తికి వారం కన్నా తక్కువ సమయం పట్టేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా ఆర్మీని పేపర్ టైగర్ అన్నారు. నిజానికి యుద్ధం ప్రారంభమైనప్పుడు రష్యా వారంలో ఎలా యుద్ధం ముగిస్తుందని అంతా ఎలా అనుకున్నారో తాను అధికారంలోకి వస్తే నెలరోజుల్లోపుల యుక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ముగించగలనని ట్రంప్ అలాగే అనుకున్నారు.

రష్యా, యుక్రెయిన్ మధ్య ఒప్పందం కుదర్చడం చాలా తేలికైన వ్యవహారమని ఆయన భావించారు. అసలు యుద్ధానికి రష్యాదే బాధ్యతని అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడన్, పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తే ట్రంప్ మాత్రం అధికారంలోకొచ్చిన కొత్తలో యుద్ధానికి యుక్రెయిన్‌ది కూడా బాధ్యతన్నారు. అంతేకాకుండా యుద్ధాన్ని ముగించడానికి యుక్రెయిన్ కొన్ని త్యాగాలకు కూడా సిద్ధం కావాల్సి ఉంటుందని ట్రంప్ చెప్పేవారు. ట్రంప్ ప్రతినిధి పలుమార్లు మాస్కో వెళ్లి పుతిన్ యంత్రాంగంతోనూ, ఆయన అధికారులతోనూ సమావేశమయ్యారు. చాలా రోజుల పాటు ఆ చర్చలు అనుకున్నమేర ముందుకు సాగకపోవడంతో పుతిన్, జెలన్ స్కీల విషయంలో ట్రంప్ వైఖరి మారుతూ వచ్చింది. రష్యాపై మరో విడత ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. అలస్కాలో పుతిన్‌తో నేరుగా సమావేశం కాకముందు ఆ చర్చలు విఫలమైతే రష్యాను అష్టదిగ్బంధనం చేస్తామన్న తరహాలో హెచ్చరికలు చేశారు. కానీ సమావేశసమయం దగ్గర పడుతున్నకొద్దీ మెత్తబడిన ట్రంప్ వైఖరి తర్వాత పూర్తిగా మారిపోయింది.

మూడున్నరేళ్ల యుద్ధంలో రష్యా ఆక్రమించిన కొంత భూభాగాన్ని వదులుకోక తప్పదని యుక్రెయిన్‌కు సంకేతాలు పంపిన ట్రంప్, యుక్రెయిన్ ఎంత రాజీపడినా, పుతిన్‌ను మాత్రం యుద్ధ విరమణకు ఒప్పించలేకపోయారు. చివరకు ఎలాంటి ఫలితాన్నివ్వకుండా ముగిసిన అలస్కా చర్చలు అంతర్జాతీయంగా ట్రంప్ పరువుతీశాయి. ఆ తర్వాత కొన్నాళ్లు మామూలుగా ఉన్న ట్రంప్ ఇప్పుడు మళ్లీ రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. రష్యాను బలహీనపడ్డ దేశంగా ప్రపంచం ముందు చూపేందుకు ఐక్యరాజ్యసమితిని వేదికగా తీసుకున్నారు. బలహీనమైన ఆర్మీ వల్లే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఇన్నేళ్లపాటు చేయాల్సి వచ్చిందని, ఇకముందు కూడా యుద్ధంతో రష్యా సాధించేదేమీ లేదని, అమెరికా, పాశ్చాత్య దేశాల మద్దతుతో యుక్రెయిన్ తమ భూభాగాన్ని తిరిగి పొందుతుందని, యుద్ధంలో గెలుస్తుందని మాట్లాడుతున్నారు. శాంతి ఒప్పందం యుక్రెయిన్‌కు ఇష్టం లేదని గతంలో విమర్శించిన ట్రంపే ఇప్పుడు యుద్ధంలో ఆ దేశం గెలుస్తుందని చెబుతున్నారు. ఆయుధ, ఆర్థిక సాయం చేస్తున్నప్పటికీ యుక్రెయిన్ గెలుపు గురించి బహుశా ఇంత నేరుగా ఇప్పటిదాకా ఏ దేశమూ మాట్లాడలేదు.

ట్రంప్ వ్యాఖ్యలను బట్టి చూస్తే అమెరికా సహకారం యుక్రెయిన్‌కు మరింత పెరుగుతుందని భావించవచ్చు. అలస్కా సమావేశంలో చర్చలు విఫలమవడం ట్రంప్‌కు ఇబ్బందికరంగా మారి ఉండవచ్చు. రానున్నరోజుల్లో రష్యాపై, పుతిన్‌పై ట్రంప్ స్వరం మరింత పదునెక్కే అవకాశమూ ఉంది. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా ఆచితూచి స్పందించింది. యుద్ధం విషయంలో ఆచితూచి, జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని, అతి తక్కువ నష్టం మాత్రమే జరగాలని పుతిన్ పదే పదే చెబుతున్నారని, తమను తక్కువ అంచనావేయడం తప్పని, పేపర్ టైగర్లు ఉండవని వ్లాదిమిర్ పుతిన్ ప్రతినిధి పెస్కోవ్ చెప్పారు. యుద్ధంలో తాము దూసుకుపోతున్నామని, తమ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని తెలిపారు. అలస్కాతో సమావేశం తర్వాత యుక్రెయిన్, రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవడం తప్పనిసరని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు.

ట్రంప్ చేసిన విమర్శలను పక్కనపెడితే యుద్ధం సుదీర్ఘకాలం సాగడం, పాశ్చాత్యదేశాల ఆంక్షలు రష్యా ఆర్థికవ్యవస్థకు తీవ్రనష్టం కలిగిస్తున్నాయన్నది మాత్రం నిజం. రష్యా దగ్గర చమురు కొంటూ యుక్రెయిన్ యుద్ధానికి ఊతమిస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ భారత్‌పై 50శాతం టారిఫ్‌లు విధించారు. కానీ ట్రంప్‌కు ఇదొక సాకు మాత్రమే భారత్‌కు, చైనాకు రష్యా చమురు అమ్ముతున్నప్పటికీ యుద్ధం కలిగిస్తున్న భారీ నష్టాలముందు రష్యాకు ఆ నిధులు సరిపోవడం లేదన్న అంచనాలున్నాయి. అయితే ఆర్థిక నష్టం సంగతి పక్కనపెడితే యుద్ధం దీర్ఘకాలికంగా కొనసాగించడంలో రష్యాకు ఒక వ్యూహముందని భావిస్తున్నారు. అమెరికా, పాశ్చాత్య దేశాల సహకారం ఎంత ఉన్నప్పటికీ యుద్ధాన్ని సుదీర్ఘంగా చేసే శక్తి యుక్రెయిన్‌కు లేదని, ఇప్పటికే యుక్రెయిన్ పూర్తిగా బలహీనపడిందని, ఇప్పటిదాకా ఆక్రమించుకున్న యుక్రెయిన్ భూభాగాన్ని వదిలిపెట్టకూడదనే షరతు రష్యా విధించినా ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్లిపోయిందని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు.

అందుకే ట్రంప్‌తో సమావేశంలోనే కాదు, యుక్రెయిన్‌కు సంబంధించిన ఎలాంటి చర్చల్లోనయినా పుతిన్ నేతృత్వంలోని రష్యా వెనక్కి తగ్గడం లేదని భావిస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా తమకు అనుకూలంగా ఉండేలా యుక్రెయిన్‌పై ఒత్తిడి పెంచడమే మాస్కో లక్ష్యమని, అందుకోసం ఇంకెన్నాళ్లయినా యుద్ధం కొనసాగించడానికి రష్యా సిద్ధంగా ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. మరింతకాలం యుద్ధం కొనసాగడం రష్యాకు భారమైనప్పటికీ, యుక్రెయిన్‌కు అది ఆత్మహత్యాసదృశం అవుతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

సుధీర్ఘ రష్యా యుక్రెయిన్ యుద్ధం- సమాధానం లేని ప్రశ్నలు - Tholi Paluku