
సిద్దిపేట ఎవరి జాగీరు కాదు
‘సిద్దిపేట ఎవరి జాగీరు కాదు.. నన్ను కొందరు కుటుంబం నుంచి దూరం చేశారు’ అంటూ కవిత వ్యాఖ్యానించారు. ఆదివారం ఆమె సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. తన పుట్టినింటికి వచ్చిన కవిత భావోద్వేగానికి లోనయ్యారు. పరోక్షంగా హరీశ్ రావును టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "సిద్దిపేట, చింతమడక ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు.. ఆంక్షలు పెట్టినా మళ్లీ మళ్లీ వస్తాను" అంటూ కవిత ఫైర్ అయ్యారు. భవిష్యత్‌లో సిద్దిపేట కేంద్రంగా రాజకీయాలు చేయాలనే ఉద్దేశాన్ని సూచించారా? లేక హరీశ్ రావు ఇమేజ్‌పై ముప్పు పెంచాలనే వ్యూహమా? ఈ వ్యాఖ్యలతో స్థానిక రాజకీయాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. రామాలయం నుంచి ప్రభుత్వ పాఠశాల వరకు బతుకమ్మను తీసుకొచ్చి, మహిళలతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం మైదానంలో మాట్లాడిన కవిత భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చా
"ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితిలో ఇక్కడికి వచ్చాను. ఉద్యమం మొదలైన తర్వాత కేసీఆర్ ఇక్కడికి మరొకరిని తెచ్చిపెట్టారు. కొందరు సిద్దిపేట, చింతమడకను తమ ప్రైవేట్ ప్రాపర్టీలా వ్యవహరిస్తున్నారు. చింతమడక చిరుత పులులను కన్నది. రాజకీయంగా ఆంక్షలు పెట్టినా మళ్లీ ఇక్కడకు వస్తాం. కేసీఆర్‌కు మచ్చ తెచ్చే పనులు కొందరు చేశారు. ఇదే విషయం చెప్పడంతో నన్ను బద్నాం చేశారు. నా కుటుంబం నుంచి నన్ను దూరం చేసిన వాళ్లను వదలను. ఈ గడ్డ ఎవరి జాగీరూ కాదు.. ఆంక్షలు పెట్టినా మళ్లీ మళ్లీ వస్తా" అని కవిత స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల్లో హరీశ్ రావును పరోక్షంగా ఉద్దేశించారని రాజకీయ వర్గాలు అంచనా. కవిత మరోసారి హరీశ్ రావును లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత నిరంతరం పార్టీ, కుటుంబ సభ్యులపై విమర్శలు చేస్తున్నారు. మొదట్లో సోదరుడు కేటీఆర్ టార్గెట్, తర్వాత హరీశ్ రావు, సంతోష్ కుమార్‌లపై విమర్శలు.. ఈసారి బతుకమ్మ వేడుకల సందర్భంగా చింతమడకకు వెళ్లడం, స్థానికుల ఆహ్వానమే కాకుండా, సిద్దిపేటలో తన పట్టు బలోపేతం చేసుకోవాలనే వ్యూహమా? రాజకీయ విశ్లేషకులు ఇలా అంచనా వేస్తున్నారు.
"చింతమడక చరిత్ర సృష్టించిన గ్రామం. ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ మొదటి అడుగు ఇక్కడే వేశారు" అంటూ కవిత గ్రామ చరిత్రను గుర్తు చేస్తూ, తనను బయటకు గెంటేసిన వారి భరతం పడతాను అంటూ పేర్కొన్నారు. ఇది కేవలం భావోద్వేగమా? లేక భవిష్యత్‌లో సిద్దిపేట అసెంబ్లీ లేదా మెదక్ పార్లమెంట్ సీటుకు పోటీ చేసే మార్గం సుగమం చేసుకోవడమా? ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చినది అన్నది ఆసక్తికరంగా మారింది.
హరీశ్ రావు వ్యూహం ఏమిటి?
సిద్దిపేటలో హరీశ్ రావుకు ఇప్పటికే బలమైన ఇమేజ్ ఉంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ మీద మొత్తం బాధ్యతలు అంకితం చేసిన ఆయన, స్థానిక సమస్యల్లో చురుకుగా ఉంటూ మద్దతును సాధించుకున్నారు. కానీ కవిత రూపంలో ఆయనకు ముప్పు వాటిల్లబోతుందా? ఒకవేళ కవిత సిద్దిపేట కేంద్రంగా రాజకీయాలు చేస్తే, హరీశ్ రావు ఏం చేస్తారు? రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం హరీశ్ రావును ఆమె లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే హరీశ్ రావు ఇప్పటికే నియోజకవర్గంలో పాతుకుపోయారు. ఈ నేపథ్యంలో ఆయన కవితను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.
"నన్ను కుటుంబానికి దూరం చేసిన వారి భరతం పడతా" అని ఆమె స్పష్టం చేయడంతో, ఇది వ్యక్తిగత వైరం నుంచి రాజకీయ పోరాటంగా మారబోతున్నదని తెలుస్తోంది. సిద్దిపేటలో కవిత పోటీ చేసే అవకాశం ఉందా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఆమె తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. రాజకీయాల్లో ఆమెకు ఉన్న అనుభవం అనుకూలంగా మారనుంది. అయితే కవిత రాజకీయ వ్యూహం ఏమిటి? ఆమె ఏ ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్యలు చేశారు? అనేది తేలాల్సి ఉంది.
