Let's talk: editor@tmv.in
స్థానిక పోరులో కొత్త నీరు

స్థానిక పోరులో కొత్త నీరు

Gaddamidi Naveen
27 సెప్టెంబర్, 2025

తెలంగాణలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల హ‌డావిడి ప్రారంభ‌మైంది. స్థానిక పోరుకు సంబందించి ఒక్కో అడుగు ముందుకు పడుతుంది. తాజాగా ఎన్నికలు నిర్వహించే వార్డులు, గ్రామాలు,ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను రాష్ట్ర ప్ర‌భుత్వం ఖ‌రారు చేయ‌డంతో క్షేత్ర‌స్థాయిలో రాజ‌కీయం వేడెక్కుతోంది. రాష్ట్రంలో 566 జెడ్పీటీసీ స్థానాలు, 5,773 ఎంపీటీసీ స్థానాలు, ఎంపీపీ 566 స్థానాలు, గ్రామ పంచాయతీల సంఖ్య 12,778, మొత్తం 1,12,694 వార్డులు ఉన్నట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌ను జారీ చేసిన విష‌యం తెల్సిందే.

స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లుకు పంచాయితీరాజ్ చ‌ట్టం 2018 లోని సెక్ష‌న్ 285 (ఎ) గతంలో రిజర్వేషన్లను 50 శాతం గ‌తంలో పరిమితం చేసేది. ఈ సవరణకు అసెంబ్లీ ఆమోదం లభించింది, ఇప్పుడు గవర్నర్ ఆమోదం కోసం ఇప్ప‌టికే ఆర్డినెన్స్ ముసాయిదాను పంపింది. గవర్నర్ ఆమోదం పొందిన త‌రువాత రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో ముందుకెళుతుంది. అయితే ఎన్నిక‌ల రంగంలోకి దిగి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు యువ‌త సిద్ద‌మ‌వుతున్నారు. ఎవ‌రికి వారు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. దీంతో న‌గ‌రాల్లో, గ్రామాల్లో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి.

ఇన్నాళ్లు ప్ర‌జ‌ల‌తో అంటి ముట్ట‌న‌ట్లు ఉన్న‌వారు సైతం ఒక్క‌సారిగా గ్రామాల్లో తిరుగుతూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లను నేరుగా వాళ్ల ద‌గ్గ‌ర‌కే వెళ్లి తెలుసుకుంటూ ఆ స‌మ‌స్య‌లను ప‌రిష్కారానికి చొర‌వ చూపుతున్నారు. తాము గెలిస్తే గ్రామాభివృద్దికి చేప‌ట్ట‌బోయే అభివృద్ది ప‌నుల‌ను వివ‌రిస్తూ వారి నుండి మ‌ద్ద‌తు కోరుతున్నారు. నేటిత‌రం యువ‌త రాజకీయాల‌లో ఉంటే గ్రామాలు, ప‌ట్ట‌ణాలు ఏవిధంగా అభివృద్ది చెందుతాయో చూపించానికి ఒక్క అవ‌కాశం కోరుతున్నారు. ఇన్ని రోజులు ఏ పార్టీల్లో స‌భ్య‌త్వం లేని వారు కూడా ఆయా పార్టీల మ‌ద్ద‌తును పొందేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కొంతమంది స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా పోటీ చేయనున్నారు.

యువ‌త రాజకీయాల వైపు ఎందుకు?

ఉన్న‌త చ‌దువులు చ‌దివి ఉద్యోగాలు రాక‌, స‌మాజంలో ప్ర‌జా ప్ర‌తినిధులకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్, రాజ‌కీయాల్లో ఉంటే ఏదైనా సాధించ‌వ‌చ్చ‌నే న‌మ్మ‌కంతో కొందరు, డ‌బ్బు సంపాద‌న‌తో పాటు స‌మాజంలో ప‌ర‌ప‌తి పెరుగుతుంద‌ని మ‌రికొంద‌రు, రాజకీయాల్లో నూతన మార్గాన్ని ఏర్పాటు చేయడానికి కొంతమంది రాజకీయాల వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రసుతం ఎమ్మెల్యే, ఎంపీ ప‌ద‌వుల‌ను పొందిన వారిలో చాలామంది స్థానిక సంస్థ‌ల నుంచే త‌మ రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని మొదలుపెట్టారు. అందువల్ల యువత స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వైపు గురి పెడుతున్నట్లు చెప్పవచ్చు.

గ్రామాల్లో, మండలంలో తమ పట్టు పెంచుకుంటే ఏ రాజకీయ పార్టీలోనైనా నేతగా ఎదిగే అవకాశం ఉండటంతో మొదట స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో ప‌ద‌వుల్లో నెగ్గేందుకు చాలామంది య‌వ‌త గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా స‌ర్పంచ్ ప‌ద‌విపై దృష్టి పెడుతున్నారు. ల‌క్ష‌లు ఖర్చు అయినా ప‌ర్వాలేదు. కానీ టార్గెట్ మాత్రం మిస్ కావొద్ధ‌నే పట్టుదలతో రాజ‌కియంగా త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు యువ‌త సిద్ద‌మ‌వుతుంది. ఈ సారి పెద్ద సంఖ్య‌లో యువ‌త ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లలో దాదాపు ప్ర‌తి చోట గట్టి పోటీ త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, పార్టీలకు స్థానిక పోరులో యువ‌త‌తో గట్టి పోటీ ఉండనుంది. రాష్ట్రమంతా జరిగే ఈ త్రిముఖ‌ పోరులో గెలుపు ఖ‌ద్ద‌ర్ దుస్తులదా? లేక జీన్స్‌ల‌దా? యువ‌త ఎన్ని స్థానాలు గెలుపొందుతుంది? గ్రామాల్లో ప్రజలు నమ్మి యువతకు అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి.

స్థానిక పోరులో కొత్త నీరు - Tholi Paluku