Let's talk: editor@tmv.in
స్థానిక ఎన్నికలపై సీఎం రేవంత్ సమీక్ష

స్థానిక ఎన్నికలపై సీఎం రేవంత్ సమీక్ష

Shaik Mohammad Shaffee
21 సెప్టెంబర్, 2025

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో స్థానిక సంస్థల నిర్వహణకు మరికొంత సమయం కావాలని హైకోర్టును కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రపతి వద్ద పెండింగ్ బిల్లులు, గవర్నర్ వద్ద సవరణ బిల్లులు పెండింగ్ ఉన్న అంశాన్ని కోర్టుకు వివరించాలని నిర్ణయించింది. మరికొంత సమయం ఇస్తే బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా స్పష్టత వస్తుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ నెల 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలోనే ఈ సమీక్ష సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం మేడారం అభివృద్ధి ప్రణాళికపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీజేతో సీఎం రేవంత్ భేటీ

జూబ్లీహిల్స్‌లోని డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం అంశాలపై చర్చించారు.

కొత్త జిల్లాల్లో అవసరమైన చోట కోర్టు భవనాలు, మౌలిక వసతులను కల్పించడంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాలని ప్రభుత్వాన్ని హైకోర్టు సీజే కోరారు. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ప్రాధాన్యత వారీగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు కొత్త జిల్లాల్లో కోర్టులకు మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, లా సెక్రటరీ పాపి రెడ్డి, జస్టిస్ పి.సామ్ కోశి, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు .

స్థానిక ఎన్నికలపై సీఎం రేవంత్ సమీక్ష - Tholi Paluku