
సొంత కుటుంబం కోసమే లాలూ తపన
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. తాజాగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. లాలూ ప్రసాద్ యాదవ్‌కు బీహార్ ప్రజల మీద ప్రేమ లేదని.. ఆయన ప్రేమ మొత్తం కుటుంబం మీదేనని నితీశ్ ఆరోపించారు. లాలు పేరు నేరుగా ప్రస్తావించకుండా నితీశ్ కుమార్ విమర్శలు గుప్పించారు. ‘ఆయనకు కుటుంబమే ముఖ్యం… కానీ మేము మాత్రం బీహార్ ప్రజల కోసం పని చేస్తాం’ అంటూ నితీశ్ చురకలు అంటించారు.
శుక్రవారం ఆయన మహిళా రోజ్గార్ యోజనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో “మహిళలకు చాలా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ కూడా మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ గత ప్రభుత్వం మాత్రం మహిళల కోసం ఏమీ చేయలేదు. ఒకప్పుడు లాలూ పదవి నుంచి తప్పుకున్న తర్వాత రబ్రీ దేవిని ముఖ్యమంత్రిగా చేశారు. ఆయనకు కుటుంబమే ముఖ్యమైంది. మేము అలా కాదు... మేము కుటుంబం కోసం కాదు, మొత్తం బీహార్ కోసం పని చేస్తున్నాం” అన్నారు.
2005 తర్వాతే నిజమైన అభివృద్ధి
నితీశ్‌కుమార్ మాట్లాడుతూ.. “గత ప్రభుత్వంలో అసలు పని జరగలేదు. బీహార్ పరిస్థితి బాగోలేదు. కానీ 2005 నవంబర్ 24న జేడీయూ-బీజేపీ, ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం నిజమైన అభివృద్ధి దిశగా నడిచింది. న్యాయవ్యవస్థ, విద్య, వైద్యసేవలు, మహిళా సాధికారత వంటి రంగాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాం” అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ముఖ్యమంత్రి మహిళా రొజ్గార్ యోజన’ను ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 75 లక్షల మహిళల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జమ చేయనున్నారు. మొత్తంగా రూ.7,500 కోట్లు ఖర్చు కానున్నాయి. ఈ పథకం మహిళలను ఆత్మనిర్భర్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో కుటుంబం నుంచి ఒక మహిళకు ఆర్థిక సహాయం చేస్తాం. దీని ద్వారా వారు స్వయం ఉపాధి లేదా జీవనోపాధి కార్యక్రమాలను ప్రారంభించుకోవచ్చు. ప్రథమ విడతలో పదివేల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. తర్వాత దశల్లో రెండు లక్షల వరకు అదనపు ఆర్థిక సహాయం కూడా లభించనుంది. వ్యవసాయం, పశుపోషణ, చేతిపనులు, కుట్టు, నేత, చిన్న వ్యాపారాలు వంటి రంగాల్లో మహిళలు ఈ సహాయాన్ని వినియోగించుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతోనేనా?
మహిళా రోజ్ గార్ యోజన పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అమలు చేస్తున్నారా? లేదంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనేనా అన్న విషయంలో క్లారిటీ లేదు. అధికార వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం కేంద్రం కూడా ఈ పథకానికి కొంత సాయం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల కోసమేనా?
బీహార్ ప్రభుత్వం ఎన్నికల సమయంలోనే ఈ పథకం తీసుకురావడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. నిజంగానే మహిళల మీద నితీశ్ కుమార్ కు అంత ప్రేమ ఉంటే ఈ పథకాన్ని ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసి ఉండొచ్చు కదా.. అలా కాకుండా ఎన్నికల సమయంలోనే ఎందుకు తీసుకొచ్చినట్టు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మహిళా ఓటర్లు బీహార్‌లో నిర్ణాయక శక్తిగా ఉన్నారు. గత ఎన్నికల్లో మహిళల ఓటు శాతం పురుషులకంటే ఎక్కువగా నమోదైంది. దీంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ పథకాన్ని ప్రారంభించినట్టు విమర్శలు వస్తున్నాయి.
ఎన్డీయే పరిస్థితి ఏమిటి?
ప్రస్తుతం బీహార్‌లో ఎన్డీయే కూటమి (బీజేపీ-జేడీయూ)లో అంతర్గత విభేదాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రజాదరణ క్రమంగా తగ్గుతోందని ప్రతిపక్షం అంటోంది. విపక్షం కూడా కాస్త దూకుడుగా ముందుకు సాగుతున్నది. ఇటీవల బీహార్ రాష్ట్రంలోనే సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించారు. రాహుల్ గాంధీ రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. పైగా సుదీర్ఘకాలం నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండటంతో ప్రజల్లో కొంత వ్యతిరేకత సహజంగానే ఉంటుంది. ఈ క్రమంలో ఎన్డీయే గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ రాష్ట్రానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. దానికి తోడు కొత్త కొత్త పథకాలు, హామీలు తెరమీదకు తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.
మహిళా ఓటు బ్యాంక్‌పై ప్రభావం ఎంత?
ఈ పథకం ద్వారా నిజంగా మహిళలకు ఉపాధి అవకాశాలు, ఆర్థిక బలహీనతల నుండి బయటపడే మార్గాలు లభిస్తే, దాని ప్రభావం తప్పక ఎన్నికల ఫలితాలపై పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి కల్పించగలిగితే, మహిళలు ఎన్డీయేకు అనుకూలంగా మొగ్గు చూపే అవకాశం ఉంది. “మహిళా రోజ్ గార్ యోజన” బీహార్ రాజకీయాల్లో గేమ్‌చేంజర్ అవుతుందా? లేక ఎన్నికల ముందు ఇచ్చిన మిగతా హామీల మాదిరిగానే నిలిచిపోతుందా? అనేది రాబోయే నెలల్లో తేలనుంది.
