
సత్యా, రితేష్ రాణా ప్రాజెక్ట్..మళ్లీ కలుస్తున్న మత్తువదలరా టీమ్
‘మత్తు వదలరా’, ‘మత్తు వదలరా 2’ వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన దర్శకుడు రితేష్ రాణా మరోసారి నటుడు సత్యాతో కలిసి కొత్త సినిమా చేస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చిరంజీవి(చెర్రీ), హేమలతా పెడమళ్ళు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంస్థకు ఇది నాలుగో ప్రాజెక్ట్.
మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. సత్యా సరసన నటిస్తున్న ఆమె పాత్ర ఆకర్షణీయంగా, కథలో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. రియా స్టైలిష్, ధైర్యవంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఆమె అందచందాలతో అభిమానులను మరింత ఆకర్శిస్తుంది. ఇక మత్తు వదలరా కథ ఎంత ఆసక్తిగా తెరకెక్కించారో గుర్తు చేసుకుంటే చాలు ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు రెట్టింపవుతాయి.
రితేష్ రాణా తన హాస్యం, అసాధారణ కథల మిశ్రమంతో మరో వినోదాత్మక చిత్రాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. సినిమాలో ట్విస్ట్ ఏంటనేది ఎవ్వరికి అంతు చిక్కకుండా హాస్యం తో, కథపై ఆసక్తి రేకెత్తిస్తూ తెరకెక్కించడం ఈ దర్శకుడి ప్రత్యేకత. ఇది ఆయన నాలుగో దర్శకత్వ ప్రయాణం. ఈ కొత్త ప్రాజెక్ట్ విషయం లో కూడా దర్శకుడు తనకు కలిసి వచ్చిన టీమ్ నే నటీనటులుగా కొనసాగిస్తున్నారు. సంగీతం కాళ భైరవ, సినిమాటోగ్రఫీ సురేష్ సరంగం, ఎడిటింగ్ శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైన్ నార్ని శ్రీనివాస్. హాస్య నటులు వెన్నెల కిషోర్, అజయ్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికైతే సినిమా కథ వివరాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. అయితే ఆసక్తికరమైన ట్విస్టులు, ఉల్లాసకరమైన కథాంశాలతో కూడిన వినోద ప్రయాణంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రదర్శిస్తున్నారు. భారీ పూజా కార్యక్రమంతో చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. రితేష్ రాణా, సత్యా జోడీ మళ్లీ వస్తుందంటే థియేటర్స్ హౌస్ ఫుల్, ఎంటర్టైన్మెంట్ పక్కా అనే నమ్మకం అభిమానుల్లో ఉంది.
