
సత్తుపల్లిలో సింగరేణి జీఎం కార్యాలయం ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి
సత్తుపల్లిలో సింగరేణి కోల్ మైన్స్‌కు చెందిన జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం భట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. సింగరేణి సంస్థకు 136 సంవత్సరాల విశిష్ట చరిత్ర ఉందని, ఆ ఘనమైన వారసత్వాన్ని మరింత బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, క్రిటికల్ మినరల్స్ తవ్వకాలు, సోలార్, హైడల్, బ్యాటరీ, హైడ్రోజన్, పంపుడు స్టోరేజ్ వంటి గ్రీన్ ఎనర్జీ రంగాల్లో కీలక పాత్ర పోషించేందుకు ముందడుగులు వేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపేర్కొన్నారు.
సింగరేణి “లోకల్” స్థాయిలోనే కాకుండా “గ్లోబల్” స్థాయిలో ఎదగాలని, ప్రపంచవ్యాప్తంగా సింగరేణి జెండా ఎగరాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. మేక్ ఇన్ తెలంగాణా – గ్లోబల్ లీడర్ గా సింగరేణిని తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. సింగరేణిపై 85 వేల మందికి పైగా ఉద్యోగులు, వారి కుటుంబాల భవిష్యత్తు ఆధారపడి ఉందని గుర్తుచేశారు. అందువల్ల ప్రతి ఉద్యోగి, ప్రతి అధికారి సంస్థ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాజస్థాన్‌లో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు, 1500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల్లో సింగరేణి భాగస్వామ్యం కావడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన తెలిపారు. సింగరేణి మనందరిదని, దాని ఉజ్వల భవిష్యత్తు కోసం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, అధికారులు అందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సత్తుపల్లిలోని జలగం వెంగళరావు ఓపెన్ మైన్‌ను అధికారులతో కలిసి స్వయంగా ఆయన పరిశీలించారు. మైన్‌లో బొగ్గు ఉత్పత్తి విధానం, రవాణా వ్యవస్థ, సిబ్బంది పనివిధానాలు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై విపులంగా సమీక్ష నిర్వహించారు. రెండు గంటల పాటు మైన్‌లోపల పరిస్థితులను పరిశీలించి, ప్రతి విభాగంపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బొగ్గు ఉత్పత్తి పరిమాణం, మార్కెట్ ధరలు, రవాణా భద్రతా చర్యలపై ప్రశ్నలు అడిగి సమాచారం సేకరించారు. అనంతరం కోల్ డిస్పాచ్ సెంటర్‌ను సందర్శించి, అక్కడి నుంచి బొగ్గు రవాణా జరిగే విధానాన్ని డిప్యూటీ సీఎం పరిశీలించారు.
