
సతరా మహిళా డాక్టరు ఆత్మహత్య కేసును సిట్ కు అప్పగించాలి: ఎన్సీపీ
రాష్ట్రంలోని సతారా జిల్లా ఫాల్టన్ తాలూకాలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సంపదా ముండే (28) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె చేతిపై రాసిన సూసైడ్ నోట్‌లో ఇద్దరు వ్యక్తుల పేర్లు, అందులో ఒకరు పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ గోపాల్ బడ్నే, మరోకరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రశాంత్ బంకర్ ఉన్నారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపింది.
సూసైడ్ నోట్‌లో డాక్టర్ సంపదా ముండే పై లైంగికంగా , మానసికంగా వేధించినట్లు, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులు, ఆమెపై పోలీసు అధికారులు, రాజకీయ నాయకుల నుంచి తప్పుడు మృతుల నివేదికలు తయారు చేయాలని ఒత్తిడి ఉందని ఆరోపించారు. పుణేలో నివసిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రశాంత్ బంకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచారు. పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ గోపాల్ బడ్నే పరారీలో ఉన్నారు. ఈ ఇద్దరిపై బలాత్కారం (రేప్) ఆత్మహత్యకు ప్రేరేపించడం (అబెట్‌మెంట్ టు స్యూసైడ్) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బడ్నేను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తుషార్ దోషి వెల్లడించారు.
ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ఆమె పై నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్ లో పేర్కోన్నారు.
సిట్ తో విచారణ చేయించాలి
‘డాక్టర్ సంపదా ముండే మరణం వ్యవస్థ వైఫల్యం. రాజకీయ ఒత్తిళ్లు, పోలీసు ప్రభావం కారణంగా ఒక యువ వైద్యురాలు ప్రాణాలు కోల్పోవడం దారుణం. స్వతంత్ర సిట్ విచారణ జరగాల’ని ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే డిమాండ్ చేశారు. మహిళా వైద్యురాలి ఆత్మహత్య వెనుక పెద్దల ఒత్తిళ్లు ఉన్నాయి. నిందితులెవరైనా, కఠిన శిక్ష తప్పదని శివసేన (ఉద్ధవ్ వర్గం) హెచ్చరించింది. ఈ ఘటనతో వైద్యులు భయాందోళనలో ఉన్నారు. మహిళా అధికారిణుల భద్రతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత సుజాతా ముండే అన్నారు. మహిళలపై మానసిక, సామాజిక ఒత్తిళ్లపై దృష్టి సారించారు. ఈ సంఘటనపై మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 'బ్లాక్ రిబ్బన్ ప్రొటెస్ట్' నిర్వహించింది. విచారణను సీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేసింది. డాక్టర్ సంపదా ముండే ఆత్మహత్యతో వైద్య సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. వైద్యాధికారులు, నర్సులు, రెసిడెంట్ డాక్టర్లు ఈ సంఘటనను నిరసిస్తూ నిరసనలు తెలిపారు. వైద్య సేవలపై ఒత్తిళ్లు, వేధింపులు పెరిగిపోతున్నాయని వారు పేర్కొన్నారు. అలాగే డాక్టర్ సంపదా ముండే మరణానికి సంబంధించి పారదర్శకమైన విచారణ జరగాలని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా)అని పేర్కొంది.
ఈ సంఘటన పోలీసు, రాజకీయ, వైద్య రంగాల్లో ఉన్న అవినీతి, ఒత్తిళ్ల వ్యవస్థను వెలుగులోకి తెచ్చింది. మహిళలపై జరుగుతున్న వేధింపులు, మానసికంగా వేధించడం వంటి అంశాలపై సమాజంలో చర్చలు మొదలయ్యాయి. పోలీసు శాఖ, ప్రభుత్వాలు ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
