
స్టీల్‌ప్లాంట్‌పై కుట్రలు ఆపండి
విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని, అక్రమంగా తొలగించిన 5 వేలమంది కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, కార్మికులపై దుష్ప్రచారం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విశాఖ సీఐటీయూ కార్యాలయంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు కే లోకనాధం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడులతో కలిసి జరిగిన విలేఖర్ల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా ఆపలేకపోయిందని ఆరోపించారు.
‘కూటమి ప్రభుత్వం ఆపలేకపోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆందోళన కూడా అణచివేయడానికి పూనుకుంటున్నారు. కనీసం ఆందోళనాలకు అనుమతించకుండా ప్రజాస్వామ్యహక్కులు కాలరాస్తూ ఐదేండ్లుగా నిరాటంకంగా నడుస్తున్నటువంటి ధర్నా శిబిరాన్ని తొలగించి ఇనుప కంచెలు పెట్టి మీరు ధర్నా చేయడానికి వీల్లేదని చెప్పి కార్మికుల నోర్లు మూయించే ప్రయత్న చేస్తున్నారు.అంతేకాదు ఎంపి భరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌లు కార్మికుల మీద కార్మికుల సంఘాల మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గుర్తింపు యూనియన్ చీప్ పాట్రన్‌గా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు ఈ ఆరోపణలు చేస్తున్నారంటే ఆయనకేమైన ముట్టిందా? లేకపోతే వాళ్ళ సంఘానికి ముట్టిందా? అసలు దొంగలు ఎవరనేది బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
మీరు చేసిన తప్పును మొత్తం కార్మికుల మీద కార్మిక సంఘాల మీద నెట్టి రుద్దేసి నైతికంగా దెబ్బ తీయాలని అనుకుంటే అది క్షమించరాని నేరం అవుతుందని, ఈ రకమైన తప్పుడు ఆరోపణలు చేయడం సరైనది కాదు. పదేపదే మేము అడుగుతున్నామని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన ప్యాకేజీ ఏమైంది? దేని కోసం వినియోగించారు.మెటీరియల్, పరిశ్రమ నడపడానికి ఎంత ఖర్చు పెట్టారు.? జీతాలకు ఎంత ఖర్చు పెట్టారు ? 12 నెలలుగా కార్మికులకు పూర్తి జీతాలు లేవని ధ్వజమెత్తారు. జీతాలు ఇవ్వకపోయినా త్యాగాలు చేసి పని చేస్తున్న కార్మికులను అభినందించాల్సింది పోయి ఆరోపణలు చేయడం అనేది చాలా దుర్మార్గమన్నారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక వైపు కార్మికుల సంఖ్య పెరిగిపోయింది అని చెప్తు 5000 మంది కాంట్రాక్టు, 1400 మంది పర్మినెంట్ కార్మికులను తీసేసింది. ఇప్పుడు వారి స్థానంలో ఇతర రాష్ట్రాల్లో నుండి కాంట్రాక్టు కార్మికులను తీసుకుంటున్నది. పాతవారికి , నిర్వాశితులకు ఇప్పుడు ఉద్యోగాలు లేవు. ఇతర రాష్ట్రాల వచ్చిన వారైతే నోరుమెదపకుండా తక్కువ జీతానికి ఎక్కువ పనిగంటలు పనిచేస్తారని, దాని వల్ల రాబోయే ప్రైవేట్ కంపెనీలకు ఎక్కువ లాభం చేకూరేలా చర్యలు చేపడుతోంది.రాబోయే ప్రైవేట్ సంస్థల ప్రయోజనాలకు కార్మికులను తగ్గించి, ఉత్పత్తి తగ్గించి, ఇప్పుడు మూడు ఫర్నేష్‌లు మొదలుపెట్టినా రెండు ఫర్నేష్‌ల ఉత్పత్తి మాత్రమే వస్తోంది.ఎందుకు పెంచలేదు? తక్కువ ప్రొడక్షన్ చేస్తూ ఉద్ధేశ పూర్వకంగానే ప్రొడక్షన్ నష్టాలను చూపిస్తూ. ప్రైవేటీకరించాలని చూస్తోంది.
గత 5సం॥లుగా ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నించినా బిజెపి మినహా అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. దాని కారణంగా ప్రైవేటీకరణ సాధ్యపడలేదు. కానీ ఈ రోజు తెలుగుదేశం, జనసేన, కూటమి ప్రభుత్వాలు వెన్నుపోటు పొడిచి పోరాటం నుంచి బయటకు వచ్చేసాయి.ఇప్పుడు కేంద్రం పని సులభమైంది.కేంద్రం యొక్క కుట్రలకు కూటమి నేతలు సహకరిస్తున్నారు.మిట్టల్ గనుల కోసం కూటమి ఎంపీలు రిప్రజెంట్ చేసారు. లోకల్ ఎంపీలు, గ్రూప్ అఫ్ ఎంపీలు మిట్టల్ సంస్థకు ఎజెంట్లా? లేదా వాళ్ళ ఉద్యోగులా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది దేనికి ? విశాఖ స్టీల్ తరుపున, ఓట్లు వేసిన ప్రజల తరుపున మాత్రం మీరు రిప్రజెంట్ చేయరా! ఏమిటి అన్యాయం.? ఈ విద్రోహాన్ని ప్రజలు సహించరు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి స్టీల్ ప్లాంట్ కాపాడడానికి ఎన్నికలకు ముందు ఎలాగైతే ముందుకొచ్చారో ఇప్పుడు కూడా కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాలి. అలాగే తొలగించిన కాంట్రాక్టు కార్మికుకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.
అసెంబ్లీలో జీఎస్‌టీ మీద ప్రధాన మంత్రిని అభినందిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఒక తీర్మాణాన్ని పెట్టారు. ప్రారంభం నుండి నాలుగు స్లాబులను లెప్ట్‌పార్టీ ఎంపీలు వ్యతిరేకిస్తు వచ్చారు. ఇంతవరకు నాలుగు స్లాబులు పెట్టి మొత్తం ప్రజలను దోచుకున్నారు. ఇప్పుడు ప్రజలు కొనుగోలు శక్తి పడిపోయింది. కార్పొరేట్ల వద్ద సరుకులు నిల్వ ఉండిపోయాయి.దాని కారణంగా జిఎస్‌టి స్లాబులు తగ్గించి మొత్తం ప్రజలకు జిఎస్‌టి నుంచి భారం తగ్గించినట్లు ప్రచారం చేస్తున్నారు. తగ్గిన జిఎస్‌టి స్లాబుల కారణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన జిఎస్‌టి వాటా 8వేల కోట్ల రూపాయిలు ఎలా భర్తీ చేస్తారో కేంద్రంను రాష్ట్ర ప్రభుత్వం నిలదీయాలని డిమాండ్ చేసారు.
కూటమి ప్రభుత్వం లూలూ,అదానీ, ఉర్సా తదితర కార్పొరేట్లకు, విదేశీ సంస్థలకు విశాఖ భూములను కారు చౌకగా కట్టబెడుతోంది. వేలసంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నది. భూములు తీసుకున్న అనేక సంస్థలు కనీస కార్యకలాపాలు ప్రారంబించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎన్ని సంస్థలకు ఎన్ని ఎకరాల భూములు కేటాయించారు. ఎన్ని సంస్థలు ప్రారంభించాయి. ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారన్నది స్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు.
మావోయిస్టు పార్టీ ఆయుదాలు విడిచిపెట్టి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని ప్రకటించిన తరువాత కూడా కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధపడకపోవడం, ఎన్ కౌంటర్ల పేరుతో మావోయిస్టులను అమాయక గిరిజనులను మట్టుపెట్టడం, ప్రభుత్వమే ప్రజాస్వామ్య పద్దతులను కాలరాయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం అక్రమ ఎన్ కౌంటర్లు నిలిపివేసి మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని డిమాండ్ చేసారు.
