Let's talk: editor@tmv.in
స్టాలిన్​పై బీజేపీ విమర్శలు

స్టాలిన్​పై బీజేపీ విమర్శలు

Pinjari Chand
25 సెప్టెంబర్, 2025

కేంద్రం చేపడుతున్న పథకాల విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​ ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించరని, ప్రస్తుతం జీఎస్టీలో సంస్కరణలు చేపట్టినా కనీసం స్పందించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్​ నాగేంద్రన్​ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలతో చర్చించే జీఎస్టీలో నిర్ణయాలు తీసుకుంటారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలను ప్రజా వ్యతిరేక పథకాలుగా చిత్రీకరిస్తోందని వాపోయారు.

కేంద్రమే నిధులు సమకూరుస్తోంది

ముఖ్యమంత్రి తెలిపినట్లు వంద శాతం జీఎస్టీ చెల్లిస్తే యాభై శాతమే వస్తుందంటున్నారు. కానీ రాష్ట్రం కేంద్రానికి జీఎస్టీ చెల్లించే వాటిలో తిరిగి 50 శాతం పొందుతుందని, మిగతా 50 శాతంలో కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి, రేషన్, ఇతర సంక్షేమ పథకాలకు నిధులను సమకూర్చుతుందని, దీంతో రాష్ట్రానికి ఎటువంటి ఖర్చు లేకుండానే అభివృద్ధి పనులు అవుతున్నాయని తెలిపారు. కేంద్రం రేషన్​ దుకాణాలలో అనేక సరుకులను సరఫరా చేస్తున్నా, 50 శాతం నిధులను ఖర్చుపెట్టి సంక్షేమ పథకాలు ఇస్తున్నా ఏ ఒక్క విషయంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం స్టాలిన్​ సమర్థించలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రేటర్ చెన్నైకి చెందిన బీజేపీ నాయకులు కరాటే త్యాగరాజన్​ కొలత్తూర్​ సహా కొన్ని నియోజకవర్గాల్లో నకిలీ ఓట్లను చేరుస్తున్నారని ఆరోపించారు.

అక్టోబర్​ 6న జేపీ నడ్డా రాక

ఎంజీఆర్​ విశ్వవిద్యాలయంలో అక్టోబర్​ 6వ తేదీన జరిగే స్నాతకోత్సవ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెన్నైకి వస్తున్నారని నాగేంద్రన్​ తెలిపారు. అలాగే టీటీవీ దినకరన్​, అన్నామలై సమావేశం గురించి మాట్లాడుతూ అది కేవలం స్నేహపూర్వక సమావేశం మాత్రమేనని, అందులో భాగంగా అనేక అంశాలు సహజంగానే మాట్లాడుకుంటారన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ఎంఆర్​ రాధ భార్య గీతా రాధ మరణంపై నాగేంద్రన్​ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినిమా జగత్తుకు ఆమె చేసిన సేవలను కొనియాడారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

స్టాలిన్​పై బీజేపీ విమర్శలు - Tholi Paluku