Let's talk: editor@tmv.in
స్టాక్ మార్కెట్లో సానుకూలత

స్టాక్ మార్కెట్లో సానుకూలత

FL - BRTH
18 సెప్టెంబర్, 2025

అమెరికా- ఇండియా మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలో భారత కీలక సూచీలు సెప్టెంబర్ 17న సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఆటో,ఐటీ, మీడియా, రియాల్టీ స్టాక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మెటల్ స్టాక్స్ ప్రతికూలంగా ట్రేడ్ అయ్యాయి. అమెరికా, ఇండియా మధ్య వాణిజ్య చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడటం, అమెరికా తరపున వాణిజ్య చర్చల కోసం బ్రెన్డన్ లించ్ ఇండియాకు రావడం ప్రధానంగా స్టాక్ మార్కెట్ సానుకూలంగా ట్రేడ్ అవ్వడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు ఇటీవలి కాలంలో మోదీ తనకు ఆప్తమిత్రుడని ట్రంప్ వ్యాఖ్యానించడం, అందుకు ప్రతిస్పందనగా అమెరికా, భారత్ సహజ మిత్రులని మోదీ మాట్లాడటం అమెరికా, ఇండియా వాణిజ్యం చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడినట్టు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత వాణిజ్య చర్చలు రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను తొలగించి, స్వేచ్చాయుత వాణిజ్యానికి తెరతీయాలని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

భారత్ పై అమెరికా 50 శాతం సుంకాలు విధించడంతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యారు. కానీ ఆ తర్వాత రెండు దేశాల మధ్య కీలక వాణిజ్య చర్చలకు అవకాశం ఏర్పడటంతో మార్కెట్లో సానుకూలత ఏర్పడింది. మరోవైపు యూఎస్ ఫెడ్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ కీలక నిర్ణయం తీసుకుంటారని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. బలహీన ఉద్యోగాల డేటా, ట్రంప్ విధానల ఒత్తిడితో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.

యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుతో ఇండియా కూడా ఆ దిశగా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ ఏర్పడుతోంది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు ఆర్బీఐ మానటరీ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అమెరికా, ఇండియా వాణిజ్య చర్చలు, వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశాభావం, ఇటీవలి జీఎస్టీ రేట్ల మార్పు మార్కెట్లో సెంటిమెంట్ బలపడటానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

స్టాక్ మార్కెట్లో సానుకూలత - Tholi Paluku