Let's talk: editor@tmv.in
సజ్జనార్ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం: హ‌రీష్ రావు

సజ్జనార్ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం: హ‌రీష్ రావు

Gaddamidi Naveen
3 ఫిబ్రవరి, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ చీఫ్ వీ.సి. సజ్జనార్ తీరుపై సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోర్టులో విచారణ జరిగి, నేరం నిరూపణ కాకముందే ఈ వ్యవహారాన్ని చట్టవిరుద్ధం అని అధికారులు ఎలా ప్రకటిస్తారని ఆయన నిలదీశారు. దర్యాప్తు సంస్థ అధిపతి హోదాలో ఉండి ఇటువంటి ముందస్తు తీర్పులు ఇవ్వడం చట్టపరంగా చెల్లదని, ఇది అత్యంత ఆందోళనకరమైన విషయమని ఆయ‌న త‌న ఎక్స్ వేదిక ద్వారా పేర్కొన్నారు.

రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో, ఏ కోర్టు తీర్పు ఇవ్వనంత వరకు ఏ ఆరోపణను కూడా నేరంగా పరిగణించలేమని హరీష్ రావు గుర్తు చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికీ 'నేరం నిరూపితమయ్యే వరకు నిరపరాధి' అనే రక్షణ ఉంటుంది. పోలీసుల పని కేవలం దర్యాప్తు చేయడం మాత్రమే, వారు న్యాయమూర్తులు కాదు. విచారణ దశలోనే ఒక అంశాన్ని చట్టవిరుద్ధమని ముద్ర వేయడానికి పోలీసులకు ఎలాంటి అధికారం లేదు అని ఆయన స్పష్టం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అన్నది భారత టెలిగ్రాఫ్ చట్టం సెక్షన్ 5(2), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, అలాగే పీయూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం మాత్రమే నిర్ణయించాల్సిన అంశమన్నారు. ఈ నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా జరిగిందా అన్నది న్యాయపరిశీలన ద్వారానే తేలాల్సిన విషయం తప్ప, పోలీసు అధికారుల ప్రకటనల ద్వారా కాదన్నారు. అధికారిక ప్రకటనల్లో చట్టవిరుద్ధమైన ఫోన్ ట్యాపింగ్ అనే పదాన్ని వాడటం ద్వారా సిట్ చీఫ్ తనకున్న ముందస్తు అభిప్రాయాలను బయటపెట్టారని, ఇది ఆల్ ఇండియా సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్, 1968కు విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు నిష్పక్షపాతంగా ఉండాలని, రాజకీయ ఉద్దేశాలతో వ్యవహరించకూడదని హ‌రీష్ హితవు పలికారు.

ప్రజాస్వామ్య వ్యవస్థల బలహీనత

మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత శాసనసభలో ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్‌కు సంబంధించిన అంశంలో ఈ విధమైన ముందస్తు వ్యాఖ్యలు రాజకీయ ప్రేరణతో కూడిన దర్యాప్తుపై అనుమానాలు కలిగిస్తున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఎన్నోసార్లు దర్యాప్తు న్యాయంగా ఉండడమే కాకుండా, న్యాయంగా కనిపించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసిందని ఆయ‌న‌ గుర్తుచేశారు.

దర్యాప్తు సంస్థల అధిపతులే దోషాన్ని ముందుగానే సూచించే భాష వాడితే ప్రజాస్వామ్య సంస్థలపై విశ్వాసం దెబ్బతింటుందని, న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం క్షీణిస్తుందని ఆయన హెచ్చరించారు. పోలీసు అధికారిక ప్రకటనలు రాజకీయ కథనాలను బలపర్చడానికి లేదా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి వేదికగా మారకూడదని హ‌రీష్ అన్నారు. తెలంగాణ ప్రజలు ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రస్తుత శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్‌ను సిట్ చీఫ్ ఎందుకు గౌరవనీయ ప్రతిపక్ష నేతగా గుర్తించడంలేదని ఆయన నిలదీశారు. దర్యాప్తు సంస్థలు చట్ట పరిధిలో, స్వతంత్రంగా, వృత్తిపరంగా పనిచేయాలని, తీర్పులు కోర్టులే ఇవ్వాలి తప్ప పోలీసు సందేశాల ద్వారా కాదని ఆయన స్పష్టం చేశారు.

సిట్ చీఫ్ తీరుపై కేటీఆర్ ఆగ్రహం

సిట్ చీఫ్ సజ్జనార్ అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మిస్టర్ కమిషనర్.. మీరే జడ్జిగా, మీరే జ్యూరీగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నది కేవలం ఒక ఆరోపిత నేరం మాత్రమేనని, దాన్ని న్యాయస్థానం ముందు నిరూపించాల్సి ఉందని ఆయ‌న‌ గుర్తుచేశారు. కోర్టు తీర్పు రాకముందే ఈ తరహా తీవ్ర వ్యాఖ్యలు చేయడం సరికాదని, దర్యాప్తు సంస్థలు తమ పరిధిలోనే వ్యవహరించాలని కేటీఆర్ సూచించారు. ఈ అంశంపై గౌరవనీయ న్యాయస్థానాలు దృష్టి సారిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అసలు ఏం జరిగింది?

అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. ఈ విచారణను సిట్ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. కేసుపై తదుపరి చర్యలు కొనసాగనున్నాయని సిట్ చీఫ్ సజ్జనార్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.