
సజావుగా ఎల్పీజీ సరఫరా.. ఆందోళన వద్దు
రాష్ట్రంలో ఎల్పీజీ (వంట గ్యాస్) సరఫరాపై వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ కేంద్రం నుంచి గ్యాస్ సరఫరా పరిస్థితిపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కాగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని వచ్చే 15 రోజుల అవసరాలకు ఇవి సరిపోతాయని ఆయన వెల్లడించారు.
అంతరాయం లేకుండా సరఫరా
సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు పెట్రోలియం సంస్థలు, గెయిల్, ఓఎన్జీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆసుపత్రులు, వసతి గృహాలు, దేవాలయాల వంటి అత్యవసర విభాగాలకు గ్యాస్ సరఫరాలో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం జరగకూడదని ఆదేశించారు. అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఇంధన సరఫరాపై ప్రభావం పడుతున్నా రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని భరోసా ఇచ్చారు.
అక్రమాలకు అడ్డుకట్ట.. ఈ-కేవైసీ తప్పనిసరి
వంట గ్యాస్ పంపిణీలో పారదర్శకత పెంచాలని సిలిండర్ల అక్రమ మళ్లింపును అరికట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం ఈ-కేవైసీ, ఓటీపీ విధానాలను పక్కాగా అమలు చేయాలని సూచించారు. గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా రాష్ట్రవ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్‌ల లభ్యతను పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా కేజీ బేసిన్ నుంచి లభ్యమయ్యే సహజ వాయువును వినియోగించుకుంటూ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను విస్తరించి ప్రతి ఇంటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ముందస్తు బుకింగ్ వద్దన్న ఐవోసీఎల్
మరోవైపు దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా సురక్షితంగానే ఉందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు వివరించారు. సరఫరా నిలిచిపోతుందనే భయంతో వినియోగదారులు ఒక్కసారిగా ముందస్తు బుకింగ్‌లు చేయడం వల్ల డెలివరీలో స్వల్ప ఆలస్యం జరుగుతోందని, ప్రజలు ఆందోళనతో అనవసరంగా బుక్ చేసుకోవద్దని కోరారు. రాష్ట్రంలో సిఎన్‌జి వినియోగాన్ని కూడా ప్రోత్సహించాలని, గ్యాస్ కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో సూచించారు.
