
సచ్చిదానందమూర్తికి అంతర్జాతీయ ఖ్యాతి
తత్వవేత్త ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి తత్వశాస్త్రంలో అంతర్జాతీయ ఖ్యాతి సాధించారని ఒడిషా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మూడు రోజులు(ఈ నెల 24 నుంచి 26) జరిగే ఆచార్య సచ్చిదానందమూర్తి శత జయంతి వేడుకలను ముఖ్య అతిథిగా హాజరైన ఆయన బుధవారం ఉదయం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సచ్చిదానందమూర్తి రాసిన శ్రీమద్ భగవద్గీత పుస్తకాన్ని విశిష్ట అతిథి పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవిష్కరించి వేదికపై ఉన్న అతిథులకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గవర్నర్ హరిబాబు ప్రసంగించారు.
ఆచార్య సచ్చిదానందమూర్తి జీవితకాలం తత్వశాస్త్రంపై రచనలు చేశారని హరిబాబు తెలిపారు. అందుకే ఆయన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారని కొనియాడారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు సచ్చిదానందమూర్తి చిన్ననాటి నుండే విద్యపై ఆసక్తి ఏర్పరచుకున్నారన్నారు. ఈ సందర్భంగా హరిబాబు ఆయన రాసిన పలు రచనలను వివరించారు. విశిష్ట అతిథి పద్మభూషణ్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ఆచార్య సచ్చిదానందమూర్తి తన 16వ ఏట రచించిన శ్రీమద్ భగవద్గీత పుస్తకాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. చిన్ననాటి నుండే సచ్చిదానం దమూర్తి తెలుగు భాషతో పాటు సంస్కృతాన్ని అలవర్చుకొని తత్వశాస్త్రంపై మంచిపట్టు సాధించారని కొనియాడారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తూ ఆంధ్రా యూనివర్సిటీకి విశేష ఖ్యాతి తీసుకువచ్చారని యార్లగడ్డ ప్రశంసించారు.
వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ నరసింహారావు మాట్లాడుతూ ఏయూలో ఎంతోమంది చదువుకొని వజ్రాల్లా మెరుస్తూ సమాజానికి కాంతి పంచారని, అలాంటి వజ్రమే సచ్చిదానందమూర్తి అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో సచ్చిదానందమూర్తి శత జయంతి వేడుకలు జరుగుతుండటం గర్వించదగ్గ విషయమన్నారు. సచ్చిదానందమూర్తి తండ్రి సంస్కృతంలో పండితులని, అందుకే చిన్ననాడే రామాయణం మహాభారతంపై ఆయనకు పట్టుందన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు జాతీయ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ నరసింహారావు అధ్యక్షత జరిగిన మొదటి రోజు వేడుకల్లో హవాయి యూనివర్సిటీ ప్రొఫెసర్ పద్మశ్రీ అరవింద్ శర్మ, ప్రొఫెసర్ అరిందం చక్రవర్తి, ఏయూ వీసీ జిపి రాజశేఖర్, డైరెక్టర్ కె అరవిందరావు ప్రసంగించగా శాఖాధిపతి కే రమేష్ బాబు, ఏయూ రెక్టార్ ఎన్ కిషోర్ బాబు, రిజిస్టార్ కే రాంబాబు, ఏయూ అధికారులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
