Let's talk: editor@tmv.in
సకాలంలో పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేయండి: యూజీసీ

సకాలంలో పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేయండి: యూజీసీ

Shaik Mohammad Shaffee
29 నవంబర్, 2025

దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఒక కీలక ఆదేశాన్ని జారీ చేసింది. సకాలంలో పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేయాలని ఉన్నత విద్యా సంస్థలను యూజీసీ ఆదేశించింది.

కొన్ని ఉన్నత విద్యా సంస్థలు పరీక్షలను సకాలంలో నిర్వహించడం లేదని, అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సిన డిగ్రీలు, సర్టిఫికెట్లను ఆలస్యం చేస్తున్నాయని యూజీసీ దృష్టికి వచ్చింది. ఈ ఆలస్యం వల్ల విద్యార్థులు తమకు రావలసిన మంచి ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని, పై చదువులకు (ఉన్నత విద్యకు) వెళ్లలేకపోతున్నారని యూజీసీ గుర్తించింది.

యూజీసీ ఆదేశాలు ఏమిటంటే?

విద్యార్థులకు ప్రాస్పెక్టస్‌లో చెప్పిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం కచ్చితంగా పరీక్షలు సకాలంలో నిర్వహించాలి, ఫలితాలను ప్రకటించాలి. ఫలితాలు ప్రకటించిన 180 రోజుల్లోపు (సుమారు 6 నెలలు) కచ్చితంగా విద్యార్థులకు డిగ్రీ లేదా ఫైనల్ సర్టిఫికెట్ ఇవ్వాలని యూజీసీ స్పష్టం చేసింది. సకాలంలో పరీక్షలు రాయడం, ఫలితాలు పొందడం, డిగ్రీ సర్టిఫికెట్ తీసుకోవడం అనేది విద్యార్థుల హక్కు అని యూజీసీ ఈ సందర్భంగా గుర్తు చేసింది.

యూజీసీ చివరి హెచ్చరిక

ఈ నిబంధనలను పాటించమని గతంలో కూడా (19.06.2024న ఒక బహిరంగ నోటీసు ద్వారా) యూజీసీ అన్ని కాలేజీలను, యూనివర్సిటీలను కోరింది. అయినప్పటికీ ఆలస్యం జరుగుతుండటంతో యూజీసీ ఇప్పుడు చివరిసారిగా గట్టిగా హెచ్చరించింది. యూజీసీ ఆదేశాలను పాటించని విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కమిషన్‌కు ఉందని స్పష్టం చేసింది. కాబట్టి అన్ని ఉన్నత విద్యా సంస్థలు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలను సకాలంలో నిర్వహించాలని, డిగ్రీలు, ఫైనల్ సర్టిఫికెట్లను ఆలస్యం చేయకుండా వెంటనే జారీ చేయాలని మరోసారి కోరింది. ఈ చర్యల వల్ల విద్యార్థులు సరైన సమయంలో తమ చదువు పూర్తి చేసి, ఉద్యోగ, ఉన్నత విద్య అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారని పేర్కొంది. విద్యార్థులు తమ సర్టిఫికెట్ల కోసం గడువు దాటినా ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, నేరుగా వాటి కోసం యూజీసీని లేదా సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని కూడా స్పష్టం చేసింది.