
సీఎం చెప్పింది కరెక్టా? నీళ్ల మంత్రి చెప్పింది కరెక్టా?
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా జలాల వాటా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విభిన్న ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి 'హంతకుడే సంతాప సభ పెట్టినట్లు' ఉందని, తెలంగాణకు ద్రోహం చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాపై కాంగ్రెస్ నాయకులకు కనీస అవగాహన లేదని మండిపడ్డారు.
వారికి అవగాహన లేదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా జలాలపై ఒకసారి 500 టీఎంసీలు, మరోసారి 904 టీఎంసీలు తమ వాటాగా చెబుతుండగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 763 టీఎంసీలు తమ హక్కుగా డిమాండ్ చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వైరుధ్యం వారి అజ్ఞానానికి నిదర్శనమని దీనివల్ల తెలంగాణకు రావాల్సిన నీటి వాటా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కాంగ్రెస్ హయాంలోనే ద్రోహం
కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు కేటాయించి ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం చేసిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఒప్పందంపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ సంతకం చేయలేదని, దీనిని ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవికి రాజీనామా చేయాలని హరీష్ రావు సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ పోరాట ఫలితమే
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా సాధించేందుకు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవిశ్రాంతంగా పోరాడిందని హరీష్ రావు తెలిపారు. ఉమా భారతి, గడ్కరీ, ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి సుప్రీంకోర్టులో పోరాడి 'సెక్షన్ 3' సాధించామని వివరించారు. ఈ పోరాట ఫలితంగానే 763 టీఎంసీల హక్కు కోసం వాదనలు వినిపించగలుగుతున్నామని చెప్పారు.
ప్రాజెక్టులపై ప్రచారం
సమ్మక్క సాగర్ బ్యారేజీని పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అయితే కాంగ్రెస్ డబ్బా ప్రచారం చేసుకుంటోందని హరీష్ రావు విమర్శించారు. కేవలం 50 ఎకరాలకు సంబంధించిన అంగీకారం కుదిరితే ప్రాజెక్టును తామే పూర్తి చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
పక్క రాష్ట్రాల ప్రయోజనాలకే పెద్దపీట
చంద్రబాబుకు భయపడి బనకచర్ల ప్రాజెక్టుపై, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం వల్ల ఆలమట్టి ఎత్తు పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే పక్క రాష్ట్రాల ప్రయోజనాలకే ఆయన పెద్దపీట వేస్తున్నారని మండిపడ్డారు. ఈ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. నీళ్ల దోపిడీని అడ్డుకోకపోతే సీఎం చరిత్రహీనుడిగా మిగిలిపోక తప్పదని హరీష్ రావు హెచ్చరించారు.
