
సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల
జాయింట్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంయుక్తంగా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) పరీక్ష-2025 డిసెంబర్ సెషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. సైన్స్ విభాగాలలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) పొందడానికి, యూనివర్సిటీలు/కళాశాలల్లో లెక్చరర్‌షిప్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించడానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 24 చివరి తేదీ.
సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు. ఇందులో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. పార్ట్ ఏ (జనరల్ ఆప్టిట్యూడ్): అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకు ఇది తప్పనిసరి. ఇందులో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ బి&సీ: అభ్యర్థులు ఎంచుకున్న సంబంధిత సబ్జెక్టుల నుంచి ఈ ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ బిలో సాధారణంగా డైరెక్ట్ ప్రశ్నలు ఉండగా, పార్ట్ సీలో అభ్యర్థి విశ్లేషణాత్మక నైపుణ్యాలను పరిశీలించేలా లోతైన ప్రశ్నలు అడుగుతారు.
విద్యార్హతల విషయానికి వస్తే ఎంఎస్సీ, బీఎస్-ఎంఎస్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్/బీఎస్, బీఈ/బీటెక్, బీ-ఫార్మసీ లేదా ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. జనరల్ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు, ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం అభ్యర్థుల గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. లెక్చరర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు. జనరల్ అభ్యర్థులకు రూ.1,150, ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ(ఎన్‌సీఎల్) రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.325 దరఖాస్తు ఫీజుగా ఉంది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, సబ్జెక్టుల సిలబస్, ఇతర సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://csirnet.nta.nic.inను సందర్శించండి.
