Let's talk: editor@tmv.in
సంస్థాగతంగా పార్టీ బలోపేతం అవసరం: దిగ్విజయ్ సింగ్ కు శశిథరూర్ మద్దతు

సంస్థాగతంగా పార్టీ బలోపేతం అవసరం: దిగ్విజయ్ సింగ్ కు శశిథరూర్ మద్దతు

Pinjari Chand
29 డిసెంబర్, 2025

కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు కాంగ్రెస్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఆదివారం మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో శశి థరూర్, దిగ్విజయ్ సింగ్ పక్కనే కూర్చొని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నట్లు థరూర్ తెలిపారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ముందు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. ఆర్ఎస్ఎస్–బీజేపీ సంస్థాగత శక్తిని ప్రస్తావిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ పాత ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన, ఒక సాధారణ కార్యకర్త ఎలా తమ నేతల పాదాల దగ్గర కూర్చొని క్రమంగా ముఖ్యమంత్రి, అనంతరం ప్రధానమంత్రి స్థాయికి ఎదిగాడో వివరించారు.బీజేపీని అధికారంలో నుంచి దించాలంటే కాంగ్రెస్ పార్టీ గ్రాస్‌రూట్ స్థాయిలో సంస్థాగతంగా బలోపేతం కావడం అత్యంత అవసరమని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలపై మరుసటి రోజు స్పందించిన దిగ్విజయ్ సింగ్, తాను చెప్పాల్సిందంతా ఇప్పటికే చెప్పానని తెలిపారు. నేను 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అసెంబ్లీ, పార్లమెంట్, సంస్థాగత స్థాయిలో కమ్యూనల్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాను. వారి సిద్ధాంతాలకు నేను పూర్తిగా వ్యతిరేకిని, భవిష్యత్తులోనూ అలానే పోరాడతానని ఆయన అన్నారు. ప్రతి సంస్థకూ బలోపేతం అవసరమే అని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.

ఈ అంశంపై శశి థరూర్ మాట్లాడుతూ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు.దిగ్విజయ్ సింగ్‌తో కలిసి కూర్చొని ఈ అంశంపై చర్చించారా? అని అడిగిన ప్రశ్నకు థరూర్ మేం స్నేహితులం. తరచూ మాట్లాడుకుంటూ ఉంటామని సమాధానమిచ్చారు. ఇది పార్టీకి అత్యంత కీలకమైన రోజు. దేశానికి కాంగ్రెస్ చేసిన సేవలను, చారిత్రక పాత్రను మనం ఈ రోజున గుర్తు చేసుకుంటామని తెలిపారు.

దేశ ప్రయాణంలో కాంగ్రెస్ ది ముఖ్యపాత్ర

1885లో స్థాపించిన భారత జాతీయ కాంగ్రెస్, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించింది. దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో కాంగ్రెస్ కీలక స్థంభంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. అలాగే దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యల ఉద్దేశాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేట్ ఆరోపించారు. మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే సిద్ధాంతాల నుంచి ప్రేరణ పొందే సంఘ్ నుంచి మేం ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటాన్ని జన ఉద్యమంగా మలిచిన పార్టీ కాంగ్రెస్. మేం ఎవరి దగ్గరా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇతరులే కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు. సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ కాంగ్రెస్ వద్ద చాలా ఉంది. మేం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తాం. వాటి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.ఈ పార్టీ వేర్లు చాలా లోతుగా ఉన్నాయి. కాంగ్రెస్‌ను ఎవరూ మాయ చేయలేరని ఇంకొక నేత రాజీవ్ శుక్లా అన్నారు.

సంస్థాగతంగా పార్టీ బలోపేతం అవసరం: దిగ్విజయ్ సింగ్ కు శశిథరూర్ మద్దతు - Tholi Paluku