
సంస్కారంతో కూడిన విద్యే అసలైన విజయం: మంత్రి దామోదర్
సంస్కారం, సమాజం పట్ల అవగాహన, బాధ్యతతో కూడిన విద్యా బోధనే విద్యార్థులను నిజమైన విజయతీరాలకు చేర్చుతుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. కేవలం పుస్తక జ్ఞానం సరిపోదని, విజ్ఞత, విలువలు, సమాజ బాధ్యత కలిగిన విద్యే విద్యార్థిని పరిపూర్ణుడిని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్‌లో నూతనంగా నిర్మించనున్న ట్రిపుల్ ఐటీ క్యాంపస్ భవనాలకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డితో కలిసి శనివారం శంకుస్థాపన చేసిన అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల లక్ష్యాలు, ఆశయాలను అడిగి తెలుసుకుంటూ, వారి భవిష్యత్‌పై విలువైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…మన సంస్కృతిలో తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ’ అన్నదే మన తొలి పాఠం. అమ్మ ప్రేమ ఆప్యాయతగా కనిపిస్తే, నాన్న ప్రేమ మౌనంగా ఉండి మనల్ని ఉన్నత శిఖరాలకు నడిపిస్తుంది. తల్లిదండ్రుల ప్రేమ, గురువుల మార్గదర్శకత్వం కలిసినప్పుడే విజయం మీ సొంతమవుతుందని ఆయన చెప్పారు. విద్యార్థులు తల్లిదండ్రులు, గురువులను గౌరవిస్తూ, సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను గుర్తించాలన్నారు.
ఈ సందర్భంగా పార్థసారథి రెడ్డి అనే ఐఐఐటీ విద్యార్థి తన లక్ష్యం ఐఏఎస్ అధికారి కావడమేనని, జిల్లా వెనుకబాటుతనాన్ని తొలగించడమే తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపాడు. మీ జీవితంలో స్ఫూర్తి ఎవరన్న ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ, “నా జీవితానికి తల్లిదండ్రులు, గురువులే స్ఫూర్తి. సమాజంలో మీరు ఒక భాగం. సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది” అని సమాధానం ఇచ్చారు.
అనంతరం శ్రీవిద్య అనే విద్యార్థిని యూపీఎస్సీలో మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్ అవుతానని ధీమాగా చెప్పగా, మంత్రి ఆమెను అభినందించారు. చదువులో, నాయకత్వ లక్షణాల్లో అమ్మాయిలే ముందుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బాలికల విద్యపై ప్రత్యేక మక్కువ ఉంది అంటూ మహిళల విద్య కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆమె ఇంగ్లీషులో మాట్లాడిన తీరు, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. వేదికపై ఉన్న విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, మహిళా ఐపీఎస్ అధికారిణిని విద్యార్థులకు పరిచయం చేస్తూ, “మీ లక్ష్యాలకు సజీవ స్ఫూర్తి ఇవాళ మీ ముందే ఉంది” అని మంత్రి పేర్కొన్నారు.
