
సంపన్నుల వలసలకు గేట్‌వే: ‘ట్రంప్ గోల్డ్ కార్డ్’ వీసా కార్యక్రమం ప్రారంభం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీయులకు ఒక సరికొత్త, ఖరీదైన వీసా కార్యక్రమాన్నిప్రారంభించారు. దీని పేరు "ట్రంప్ గోల్డ్ కార్డ్". ఎక్కువ డబ్బు చెల్లించగలిగే వారికి అమెరికాలో వేగంగా నివాసం (గ్రీన్ కార్డ్) పొందే అవకాశం కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
గోల్డ్ కార్డ్ అంటే ఏమిటి?
ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది ఒక రకంగా గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాస అనుమతి) లాంటిదే, కానీ ట్రంప్ చెప్పిన దాని ప్రకారం, ఇది "మరింత మెరుగైనది, మరింత శక్తివంతమైనది, పౌరసత్వానికి బలమైన మార్గం. ఈ కార్డు ద్వారా డబ్బు చెల్లించిన విదేశీయులు అమెరికాలో నివసించవచ్చు, పని చేయవచ్చు, చివరకు పౌరసత్వం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా అమెరికా ఖజానాకు బిలియన్ల డాలర్ల ఆదాయం వస్తుందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.
గోల్డ్ కార్డ్ ఖర్చు ఎంత?
ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ గోల్డ్ కార్డ్ పొందడానికి మూడు రకాల ప్యాకేజీలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కో ధర ఉంటుంది
వ్యక్తిగత గోల్డ్ కార్డ్:
ఒక వ్యక్తి సొంతంగా ఈ కార్డును పొందాలంటే, వారు 1 మిలియన్ డాలర్లు అమెరికా ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వాలి. దీనికి అదనంగా ప్రాసెసింగ్ కోసం 15,000 డాలర్లు (US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి) ఫీజుగా చెల్లించాలి.
కార్పొరేట్ గోల్డ్ కార్డ్:
అమెరికాలోని కంపెనీలు తమ విదేశీ ఉద్యోగుల కోసం ఈ కార్డును కొనుగోలు చేయవచ్చు. ఈ కార్డు ద్వారా ఒక్కో ఉద్యోగికి 2 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తానికి అదనంగా సాధారణంగా చెల్లించే 15,000 డాలర్ల ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది.
ప్లాటినం కార్డ్:
ఇది అన్నింటికంటే ఖరీదైన ప్యాకేజీ. దీని ధర ఏకంగా 5 మిలియన్ డాలర్లు. ఈ కార్డు తీసుకున్నవారికి ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. అదేమిటంటే వీళ్లు సంవత్సరంలో 270 రోజుల వరకు అమెరికాలో ఉన్నా, ఇతర దేశాల్లో సంపాదించిన డబ్బుపై అమెరికాలో పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఇది గ్లోబల్ ఇన్వెస్టర్లకు చాలా ఉపయోగపడుతుంది. ఏ కార్డుకు దరఖాస్తు చేసినా, ప్రాసెసింగ్ కోసం చెల్లించే 15,000 డాలర్లు ఫీజు తిరిగి ఇవ్వబడదు (నాన్-రిఫండబుల్). దరఖాస్తు తిరస్కరణకు గురైనా ఆ డబ్బు వెనక్కి రాదు.
దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది?
దరఖాస్తు చేయడానికి ఒక ప్రత్యేక వెబ్‌సైట్ Trumpcard.govను ప్రారంభించారు. ముందుగా ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు 15,000 డాలర్ల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత, అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవలు (యూఎస్ సీఐఎస్) దరఖాస్తుదారు, వారి కుటుంబ సభ్యుల నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాయి (వెట్టింగ్ ప్రాసెస్). వెట్టింగ్ ప్రక్రియలో ఆమోదం పొందిన తర్వాత, దరఖాస్తుదారు వారు ఎంచుకున్న టైర్‌కు సంబంధించిన 1 మిలియన్ లేదా 2 మిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించాలి. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత వారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది, ఇది శాశ్వత నివాసానికి అనుమతి ఇస్తుంది.
విద్యార్థులకు, నిపుణులకు ప్రయోజనం ఏమిటి?
ట్రంప్ ఈ పథకాన్ని ప్రత్యేకంగా ప్రముఖ అమెరికన్ విశ్వవిద్యాలయాల నుండి గ్రాడ్యుయేట్ అయిన విదేశీ విద్యార్థులను ఉద్దేశించి ప్రవేశపెట్టారు. ట్రంప్ మాట్లాడుతూ, "ఇండియా, చైనా లేదా ఇతర దేశాల నుండి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులు కాలేజీ పూర్తి అయిన వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది సిగ్గుచేటు, హాస్యాస్పదం. ఈ గోల్డ్ కార్డ్ ద్వారా కంపెనీలు వారికి అవసరమైన అద్భుతమైన ప్రతిభను దేశంలోనే అట్టిపెట్టుకోవచ్చు. ఇది యాపిల్ సీఈఓ టిమ్ కుక్ లాంటి వాళ్లు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరిస్తుంది" అని అన్నారు. కార్పొరేట్ గోల్డ్ కార్డ్ ద్వారా కంపెనీలు తమ అత్యంత ముఖ్యమైన విదేశీ ఉద్యోగుల కోసం డబ్బు చెల్లించి, వారికి వీసా భద్రత కల్పించవచ్చు.
ఈ పథకంపై విమర్శలు
ట్రంప్ ప్రభుత్వం ఒకవైపు చట్టవిరుద్ధ వలసలను అడ్డుకోవడానికి, చట్టబద్ధమైన వలసలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్న సమయంలోనే, డబ్బున్న విదేశీయులకు వీసా ఇచ్చేందుకు ఈ కొత్త పథకాన్ని తీసుకురావడంపై విమర్శలు వస్తున్నాయి. విమర్శకులు దీనిని "పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టడం”గా అభివర్ణిస్తున్నారు. అమెరికన్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ మాత్రం, ఈ గోల్డ్ కార్డ్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని, ప్రస్తుతం సగటు గ్రీన్ కార్డ్ హోల్డర్ కంటే ఎక్కువ సంపాదించే, ప్రభుత్వ సహాయ కార్యక్రమాలపై ఆధారపడని 'ఉత్తమ వ్యక్తులను' దేశంలోకి ఆహ్వానిస్తుందని చెప్పారు.
