Let's talk: editor@tmv.in
సంధ్యా శ్రీధర్‌రావు అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం

సంధ్యా శ్రీధర్‌రావు అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం

Gaddamidi Naveen
18 నవంబర్, 2025

శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి ప్రధాన రహదారికి ఆనుకుని సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్‌రావు నిర్మించిన పలు అక్రమ కట్టడాలపై సోమవారం హైడ్రా ఉక్కుపాదం మోపింది.రహదారులు, పార్కులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా కూల్చివేసి, ఆక్రమిత రహదారులను పునరుద్ధరించింది.

హైకోర్టు ఆదేశాలు, కూల్చివేతల వివరాలు:

ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ (ఎఫ్సీఐ) లేఔట్‌లో రహదారులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.40 ఫీట్ల రహదారిపై అడ్డంగా ఐరన్ ఫ్రేమ్‌తో నిర్మించిన ఐదు అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు తొలగించి రహదారిని క్లియర్ చేశారు.అదే విధంగా రహదారి పక్కనే ఏర్పాటు చేసిన మ్యాంగో ఫుడ్ కోర్ట్‌‌, యూనో ఫుడ్ కోర్ట్‌ను కూడా కూల్చేశారు. 40 ఫీట్ల రహదారిపైకి దిగిన పెట్రోల్ బంక్‌ యొక్క పాక్షిక నిర్మాణాన్ని తొలగించారు. అంతేకాదు, 25 ఫీట్ల రహదారులపై ఏర్పాటు చేసిన చైనా ఫుడ్ స్టాళ్లు, ఫుడ్ కంటైనర్లు కూడా తొలగించడంతో మొత్తం ఏడు చోట్ల రహదారులు పూర్తిగా పునరుద్ధరించబడ్డాయి. రహదారులు ఖాళీ కావడంతో ప్లాట్ యజమానులు హర్షం వ్యక్తం చేశారు.

ఎఫ్సీఐ లేఔట్‌లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధరరావు రహదారులు, పార్కులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన విషయంపై హైకోర్టు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. 20 ఎకరాల లేఔట్‌లో 162 ప్లాట్లు ఉండగా, వాటిలో మెజారిటీ ప్లాట్లు తనవేనన్న ఉద్దేశంతో రహదారులు, పార్కులను మింగేయడం అంగీకారయోగ్యం కాదని కోర్టు పేర్కొంది.బాధిత ప్లాట్ యజమానులు కోర్టులో తమ గోడును వివరించడంతో కోర్టు వెంటనే రహదారులు పునరుద్ధరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగానే హైడ్రా అక్రమ నిర్మాణాలపై చర్యలు ముమ్మరం చేసింది.

లే ఔట్ ఆక్రమణ చరిత్ర

1980 దశకంలో 20 ఎకరాలలో ఎఫ్సీఐ హౌసింగ్ సొసైటీ లేఔట్ ఏర్పాటు చేయగా, కాలక్రమంలో లేఔట్ ఆనవాళ్లు మాయమయ్యేలా సంధ్యా శ్రీధరరావు వ్యవహరించారంటూ పలువురు ప్లాట్ యజమానులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.సంధ్యా కన్వెన్షన్ పేరిట అడుగుపెట్టి మా లేఔట్‌ను పూర్తిగా కబ్జా చేశారు. రహదారులు, పార్కులు, ప్లాట్ హద్దులు అన్నీ చెరిపేశారు. ప్రశ్నిస్తే మాపైనే దాడులు చేశారు. ఈ అక్రమాల నేపథ్యంలో పలువురు తీవ్ర నిరాశతో ప్రాణాలు తీసుకున్నారు.ఒకటా రెండా 30 వరకూ కేసులు ఆయనపై పలు పోలీసు స్టేషన్లో నమోదయ్యాయని.తమ లే ఔట్ కు సంబంధించి కూడా 5కు పైగా కేసులు ఆయనపై నమోదయ్యాయని.ప్లాట్ యజమానులు వేదన వ్యక్తం చేశారు. అధికారులు లేఔట్ స్థలంలో అనేక నిర్మాణాలకు అనుమతులు లేవని నిర్ధారించి కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌కు నివేదించారు. కమిషనర్ ఆదేశాల మేరకు గతంలో కూడా ఆక్రమణలను తొలగించినప్పటికీ, నిర్మాణాలు మళ్లీ కొనసాగడంతో మరోసారి హైడ్రా కఠిన చర్యలు చేపట్టింది.