Let's talk: editor@tmv.in
సంధ్యా శ్రీధర్‌రావుకు హైకోర్టులో చుక్కెదురు

సంధ్యా శ్రీధర్‌రావుకు హైకోర్టులో చుక్కెదురు

Gaddamidi Naveen
12 నవంబర్, 2025

గచ్చిబౌలి ప్రాంతంలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఎంప్లాయీస్ కోప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ లే ఔట్‌లో రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన సంధ్యా కన్వెన్షన్ యజమాని సంధ్యా శ్రీధర్‌రావుకు మంగళవారం హైకోర్టులో చుక్కెదురైంది.

జస్టిస్ విజ‌య్‌సేన్ రెడ్డి ఈ కేసు విచార‌ణ సందర్భంగా శ్రీధర్‌రావు ఆక్రమణలను తప్పుపట్టారు. రోడ్లు, పార్కులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని న్యాయస్థానం సీరియస్‌గా పరిగణించింది.ఈ లేఔట్ మొత్తం 20 ఎక‌రాల ప‌రిధిలో ఉండగా,అందులో 162 వ‌రకూ ప్లాట్లు ఉన్నాయని.లేఔట్‌లోని మెజారిటీ ప్లాట్లు తనవే అనే ఉద్దేశంతో రోడ్లు, పార్కులు ఆక్రమిస్తే, వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది.

లేఔట్ ఒకసారి వేసిన తర్వాత అది అలాగే కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.అందుకే హైడ్రా ఆక్రమణలను తొలగించిందని కోర్టు అభిప్రాయపడింది. సంధ్యా శ్రీధర్ రావు రోడ్ల ఆక్రమణలను ఇటీవల హైడ్రా తొలగించిన విషయం విదితమే. ఈ తొలగింపును సవాలు చేస్తూనే శ్రీధర్‌రావు హైకోర్టును ఆశ్రయించారు.

బాధితుల గోడు, కోర్టుకు విన్నపం

మంగళవారం జరిగిన విచారణలో, బాధితులైన ప్లాట్ యజమానులు కూడా ఇంప్లీడ్ అయ్యి వారి గోడును కోర్టుకు విన్నవించుకున్నారు. లేఔట్‌లో సరిహద్దులన్నీ చెరిపేసి, ఇష్టానుసారం నిర్మాణాలు చేపడుతున్నారని సంధ్యా శ్రీధర్‌రావుపై వారు ఫిర్యాదు చేశారు. ఎక్కువ ప్లాట్లు కొనుగోలు చేసి, తమను భయపెట్టి మిగతా ప్లాట్లు కూడా సొంతం చేసుకోవాలని శ్రీధర్‌రావు ప్రయత్నించారని బాధితులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఎక్కువ ప్లాట్లు తనవే ఉన్నాయనే ఉద్దేశంతో లేఔట్‌లోని రోడ్లు, పక్కనే ఉన్న తమ ప్లాట్లు, పార్కుల సరిహద్దులను పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ఇదేమని ప్రశ్నిస్తే, తమపై దాడి చేసేవారని, ఒక ప్లాట్ యజమానురాలిపై దాడి చేయడమే కాకుండా తప్పుడు కేసులు బాధితులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గతంలో ఈ దాడి కారణంగా సంధ్య శ్రీధర్‌రావుకు సుప్రీంకోర్టు రూ. 10లక్షలు ఫైను విధించిన విషయాన్ని కూడా బాధితులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాడులు భయబ్రాంతులకు గురి చేసిన సమయంలోనే తాము హైడ్రాను ఆశ్రయించామని బాధితులు తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే హైడ్రా అధికారులు రోడ్ల ఆక్రమణలను నిర్ధారించి చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.

హైకోర్టు ఆదేశాలు,హామీ

బాధితుల పక్షం విన్న అనంతరం న్యాయమూర్తి విజయ్‌సేన్‌ రెడ్డి హైడ్రా ఇప్పటికే పరిశీలించి ఆక్రమణలను తొలగించిన చర్యలను సమర్థించారు. ఒకసారి లే ఔట్‌లో రహదారులు నిర్ణయించబడిన తర్వాత అవి ఎప్పటికీ అదే విధంగా కొనసాగాలనే నిబంధనను గుర్తుచేశారు.హైడ్రా సమయానుకూలంగా స్పందించి రహదారుల ఆక్రమణలను తొలగించిందని,ఆ చర్యలను సమర్థిస్తూ భవిష్యత్తులో కూడా లే ఔట్‌లోని రహదారులు, పార్కులను పునరుద్ధరించాల్సిందిగా హైకోర్టు మళ్లీ ఆదేశించింది.హైకోర్టు ఈ సందర్భంగా బాధిత ప్లాట్‌ యజమానులకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చింది.మీతో కోర్టు ఉంది. మీ హక్కులు కాపాడటంలో ఎలాంటి వెనుకడుగు వేయదు అని న్యాయమూర్తి పేర్కొన్నారు.హైడ్రా అధికారులకు రహదారులు,పార్కులు మూల రూపంలో పునరుద్ధరించేందుకు సూచనలు ఇచ్చారు.

తదుపరి విచారణ ఈ నెల18న వాయిదా

సంధ్యా శ్రీధర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు హైడ్రా అధికారులు లే ఔట్‌లో పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలని హైకోర్టు సూచించింది.ఈ కేసు ద్వారా లే ఔట్‌ నియమాలను ఉల్లంఘించి సామూహిక ఆస్తులను ఆక్రమించే వ్యక్తులకు చట్టం తగిన శిక్ష విధిస్తుందని తెలిపారు. బాధితులకు అండగా నిలిచిన హైకోర్టు తీర్పుతో స్థానిక నివాసుల్లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం నెలకొంది.

సంధ్యా శ్రీధర్‌రావుకు హైకోర్టులో చుక్కెదురు - Tholi Paluku