Let's talk: editor@tmv.in
సందిగ్ధంలో సీజ్‌ఫైర్.. క్షీణించిన 900 పాయింట్లు

సందిగ్ధంలో సీజ్‌ఫైర్.. క్షీణించిన 900 పాయింట్లు

Pinjari Chand
10 ఏప్రిల్, 2026

పశ్చిమ ఆసియాలో సీజ్‌ఫైర్‌పై అనిశ్చితి నెలకొనడం, అంతర్జాతీయ మార్కెట్ల బలహీన ధోరణి ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ పతనంతో ముగిశాయి. ఐదు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడగా, కీలక సూచీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 900 పాయింట్లకు పైగా పడిపోయింది. రోజంతా తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన సెన్సెక్స్ చివరకు 931.25 పాయింట్లు (1.20%) పడిపోయి 76,631.65 వద్ద ముగిసింది. ఒక దశలో ఇది 1,215 పాయింట్లు క్షీణించి 76,347.90 వరకు దిగజారింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ కూడా 222.25 పాయింట్లు (0.93%) తగ్గి 23,775.10 వద్ద ముగిసింది.

సీజ్‌ఫైర్ ఒప్పందంపై ఆశలు తగ్గిపోవడం, అలాగే హర్ముజ్‌ వద్ద ఉద్రిక్తతలు మళ్లీ పెరగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళనలు పెరిగాయి. ఇరాన్‌ ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఆ మార్గాన్ని మళ్లీ మూసివేసినట్లు వార్తలు రావడం మార్కెట్లపై ప్రభావం చూపింది. అదనంగా ఆసియా, యూరప్ మార్కెట్ల బలహీనత, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణ కూడా పెట్టుబడిదారులను అప్రమత్తం చేశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 3.27 శాతం పెరిగి బ్యారెల్‌కు 97.85 డాలర్లకు చేరింది.

సెన్సెక్స్‌లోని కంపెనీల్లో ఇంటర్‌‌ గ్లోబ్‌ ఏవియేషన్‌, లార్సెన్‌ అండ్‌ టర్బో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. మరోవైపు భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, పవర్‌‌గ్రిడ్‌, ఎన్టీపీసీ, టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల రంగాలు ఎక్కువగా పడిపోయాయి. అయితే క్యాపిటల్ గూడ్స్, మెటల్, పవర్, హెల్త్‌కేర్ రంగాలు కొంత లాభాల్లో నిలిచాయి. స్టాక్ ఎక్స్చేంజ్ గణాంకాల ప్రకారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐస్‌) బుధవారం రూ.2,811 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐస్‌) రూ.4,168 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మరోవైపు అమెరికా మార్కెట్లు బుధవారం బలంగా లాభపడ్డాయి. డవ్‌ జోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.85 శాతం, నాస్‌డాక్‌ కంపోజిట్‌ 2.80 శాతం, ఎస్‌అండ్‌పీ 500 2.51 శాతం లాభపడ్డాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సీజ్‌ఫైర్‌పై స్పష్టత వచ్చే వరకు పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉందని, చమురు ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణంపై కూడా ప్రభావం ఉండొచ్చని అంటున్నారు.

సందిగ్ధంలో సీజ్‌ఫైర్.. క్షీణించిన 900 పాయింట్లు - Tholi Paluku