Let's talk: editor@tmv.in
సంతాల్ సదస్సు వివాదం.. రాష్ట్రపతి పదవికి గౌరవం ఇవ్వాలి: చంద్రబాబు

సంతాల్ సదస్సు వివాదం.. రాష్ట్రపతి పదవికి గౌరవం ఇవ్వాలి: చంద్రబాబు

Panthagani Anusha
9 మార్చి, 2026

పశ్చిమ బెంగాల్ పర్యటనలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎదురైన చేదు అనుభవాలు, ప్రోటోకాల్ ఉల్లంఘనలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి పట్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని ఇది దేశ గౌరవానికే విఘాతమని వారు మండిపడ్డారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో తలెత్తిన లోపాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. "రాష్ట్రపతి వేదన చూసి మనసు కలచివేసింది. రాష్ట్రపతి కార్యాలయం మన గణతంత్ర గౌరవానికి చిహ్నం. ఆ పదవికి ఎల్లప్పుడూ అత్యున్నత మర్యాదలు దక్కాలి అని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ సంస్థలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని వాటి గౌరవాన్ని కాపాడటం ప్రతి రాజకీయ నాయకుడి ప్రాథమిక బాధ్యత అని చంద్రబాబు గుర్తుచేశారు. సిలిగురి పర్యటనలో ప్రోటోకాల్ లోపాలు జరగడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

అడ్మినిస్ట్రేటివ్ వైఫల్యంపై పవన్ ఆగ్రహం

డార్జిలింగ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సంతల్ సదస్సులో జరిగిన పరిణామాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. సంతల్ కమ్యూనిటీకి చెందిన ప్రజలు హాజరు కాలేని విధంగా, ఎక్కడో దూరంగా వేదికను మార్చడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సంతల్ సమాజపు గొప్ప వారసత్వాన్ని జరుపుకోవాల్సిన సమయంలో ఆ సంస్కృతికి తగిన గౌరవం దక్కకపోవడం విచారకరం. రాజ్యాంగ అధినేత పర్యటనను గౌరవప్రదంగా నిర్వహించడంలో స్థానిక పరిపాలనా యంత్రాంగం విఫలమైంది" అని పవన్ విమర్శించారు. గిరిజన బిడ్డ అయిన రాష్ట్రపతి పట్ల ఇటువంటి వైఖరి ప్రదర్శించడం సరికాదన్నారు.

మరోవైపు సిలిగురి, డార్జిలింగ్ పర్యటనలో తనకు ఎదురైన ఇబ్బందులపై రాష్ట్రపతి ముర్ము బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా అంతర్జాతీయ సంతల్ సదస్సుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గానీ, మంత్రులు గానీ హాజరుకాకపోవడంపై ఆమె స్పందిస్తూ రాష్ట్రపతి పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి తప్పకుండా ఉండాలి కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించలేదు అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గిరిజనులు చేరుకోలేని చోట వేదికను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆమె ప్రశ్నించారు.

కాగా ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఒకవైపు బీజేపీ నేతలు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా మరోవైపు ఇది రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని తృణమూల్ కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. ఏది ఏమైనా రాజ్యాంగ అధినేతకు జరిగిన ఈ పరాభవంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.