
'సంజీవని' పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
రాష్ట్రాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆస్పరిలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో డిజిటల్ హెల్త్ రికార్డు ప్రోగ్రామ్ 'సంజీవని' పైలట్ ప్రాజెక్ట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, ముందస్తు అంచనా, నివారణ, చికిత్స విధానాల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.
ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుంచి రాష్ట్ర స్థాయి వరకు డేటాను అనుసంధానిస్తూ ప్రతీ ఒక్కరి వ్యక్తిగత హెల్త్ ప్రొఫైల్‌ను 'సంజీవని' ద్వారా నమోదు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, వారికి మెరుగైన వైద్యం అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలోనే 'హెల్త్ X' యాప్‌ను అందుబాటులోకి తెస్తామని, టెలి-కన్సల్టేషన్ల ద్వారా నిపుణులైన వైద్యులు మందులు, పోషకాహార సలహాలు అందిస్తారని తెలిపారు. స్క్రీనింగ్ టెస్టులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్లు, ల్యాబ్ సేవలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తెస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఏఐ డాక్టర్ సేవలు, రిమోట్ కేర్, డిజిటల్ నెర్వ్ సెంటర్ల ద్వారా అత్యాధునిక వైద్య విధానాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 22-ఏ జాబితా ద్వారా రైతుల భూములను లాక్కునేందుకు ప్రయత్నించిందని సీఎం ఆరోపించారు. భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి బ్లాక్‌చైన్ సాంకేతికతతో రీసర్వే ప్రక్రియను ప్రారంభించామని, 2027 మార్చి నాటికి దీనిని పూర్తి చేస్తామని చెప్పారు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కృష్ణా నదిలోకి నీటి ప్రవాహం తగ్గిందని, భూగర్భ జలాలను పెంచేందుకు 'జలధార' కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు.
రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాం
కర్నూలు జిల్లాలోని వేదవతి ప్రాజెక్టును రూ. 1,768 కోట్లతో పూర్తి చేస్తామని, రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆహార అలవాట్లు మారాయని, వరి సాగుతో పెద్దగా లాభాలు లేవని గ్రహించి రైతులు ఉద్యానవన (హార్టికల్చర్) పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా పండ్ల ఉత్పత్తిలో రాయలసీమ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రూ. 1 లక్ష కోట్లు వెచ్చిస్తామని చెప్పారు. ఇందులో ప్రభుత్వం రూ. 40,000 కోట్లు కేటాయిస్తుందని, ప్రైవేట్ పరిశ్రమల ద్వారా రూ. 60,000 కోట్ల పెట్టుబడులు తెస్తామని సీఎం చంద్రబాబు వివరించారు.
