Let's talk: editor@tmv.in
సంజయ్‌రౌత్‌ రెండు పాత్రల్లో ఇమడలేకపోతున్నారు: కాంగ్రెస్

సంజయ్‌రౌత్‌ రెండు పాత్రల్లో ఇమడలేకపోతున్నారు: కాంగ్రెస్

Pinjari Chand
7 ఏప్రిల్, 2026

ప్రాంతీయ పార్టీలను ‘ఊతకర్రలు’గా ఉపయోగిస్తూ సమాన భాగస్వాములుగా చూడడం లేదని శివసేన(యూబీటీ) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్రంగా విమర్శించింది. మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి సచిన్‌సావంత్‌ మాట్లాడుతూ, శివసేన (యూబీటీ) అధికార పత్రిక ‘సామ్నా’లో వచ్చిన సంపాదకీయాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌రౌత్‌ రాజకీయ నాయకుడిగా, జర్నలిస్టుగా ఉన్న పాత్రల మధ్య తరచూ గందరగోళానికి గురవుతున్నారని వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌లో సావంత్ మాట్లాడుతూ, ఒక జర్నలిస్టు బాధ్యత లోపాలను నిష్పక్షపాతంగా గుర్తించడం కాగా, రాజకీయ ప్రతినిధి ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడం సాధారణమని చెప్పారు. ఈ రెండు పాత్రలను కలిపి చూడడం వల్ల స్వీయ బాధ్యతను విస్మరించే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. అలాగే, తాను చెప్పేదే సత్యమని రావత్ భావిస్తున్నారని సావంత్ విమర్శించారు. మహావికాస్​ అఘాడి వంటి కూటమిలో ప్రతి పార్టీకి తనదైన అభిప్రాయం ఉంటుందని, కీలక నిర్ణయాలు తీసుకునే ముందు భాగస్వామ్య పార్టీలతో చర్చించడం అవసరమని ఆయన పేర్కొన్నారు.

ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని తరువాత కాంగ్రెస్ నాయకుల వైపు చూడటం కూటమి రాజకీయాల ఆత్మకు విరుద్ధమని సావంత్ వ్యాఖ్యానించారు. ముంబై, చంద్రపూర్ వంటి కీలక మున్సిపల్ సంస్థల్లో ఎంవీఏ అధికారాన్ని కోల్పోవడానికి కూటమిలో సమన్వయం లేకపోవడమే కారణమని ఆయన గుర్తు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని, పరస్పర ఆరోపణలలో పడే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అయితే ఆత్మపరిశీలన కూడా అంతే అవసరమని వ్యాఖ్యానించారు.

సమాన భాగస్వాములుగా చూడాలి

ఇదిలా ఉండగా, ‘సామ్నా’ సంపాదకీయంలో కాంగ్రెస్‌పై శివసేన (యూబీటీ) విమర్శలు గుప్పించింది. కేంద్రంలో అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకున్న పార్టీలు ప్రాంతీయ పార్టీలను కేవలం ఆధారాలుగా కాకుండా సమాన భాగస్వాములుగా చూడాలని పేర్కొంది. ప్రాంతీయ పార్టీలను కలుపుకుని వెళ్లడం బలహీనత కాదు, అది రాజకీయ పరిపక్వతకు సంకేతమని సంపాదకీయంలో పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే రాష్ట్రాల్లో బలమైన కూటములు అవసరమని, జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలను గౌరవిస్తుందని స్పష్టమైన సందేశం ఇవ్వాలని శివసేన పేర్కొంది.

ఎంపీసీసీ వ్యాఖ్యలపై శివసేన అసంతృప్తి

ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలు, రానున్న మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో ఈ విమర్శలు వెలువడ్డాయి. కాంగ్రెస్, శివసేన (యూబీటీ) రెండూ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ, చివరకు శరద్‌పవార్‌‌ ఏకాభిప్రాయ అభ్యర్థిగా ఎంపికై ఏకగ్రీవంగా గెలిచారు. ఇదే సమయంలో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్‌ సక్పాల్‌ మండలి ఎన్నికలపై చర్చలు జరగాల్సి ఉందని చేసిన వ్యాఖ్యలపై కూడా శివసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. శాసన మండలి ఎన్నికల్లో శివసేన అధినేత ఉద్దవ్‌ థాకరే సూచించే అభ్యర్థికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని పవార్ చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత గందరగోళ పరిస్థితికి కాంగ్రెస్ కూడా కారణమని శివసేన ఆరోపించింది. అప్పటి అసెంబ్లీ స్పీకర్ నానా పటోలే అకస్మాత్తుగా రాజీనామా చేయకపోయి ఉంటే ఎంవీఏ ప్రభుత్వం మరో 15 సంవత్సరాలు కొనసాగేదని పేర్కొంది. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఇటీవల చేసిన ప్రసంగంలో ఇండియా కూటమిలో అన్ని పార్టీలూ సమానమని చెప్పారని సంపాదకీయంలో గుర్తు చేసింది. ఈ పోరాటంలో ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ ఇద్దరూ రాహుల్ గాంధీకి మద్దతుగా ఉన్నారని పేర్కొంది. మహారాష్ట్రలో అధికార మార్పు జరిగితే ప్రాంతీయ మిత్రపక్షాల సహకారంతో కాంగ్రెస్ నేతృత్వం వహించే అవకాశం కూడా ఉంటుందని శివసేన (యూబీటీ) అభిప్రాయపడింది.