Let's talk: editor@tmv.in
‘సంచార్ సాథీ’ కాదు స్నూపింగ్ యాప్: కాంగ్రెస్

‘సంచార్ సాథీ’ కాదు స్నూపింగ్ యాప్: కాంగ్రెస్

Pinjari Chand
3 డిసెంబర్, 2025

కేంద్ర ప్రభుత్వం సంచార్ సాథీ యాప్‌ను అన్ని కొత్త మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలని ఆదేశించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ యాప్‌ను ‘స్నూపింగ్ యాప్’(నిఘా యాప్) అని ముద్రవేస్తూ, పౌరుల గోప్యతా హక్కును కాలరాస్తూ, దేశాన్ని నియంతృత్వంలోకి నెట్టే చర్యగా కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఈ ఆదేశాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. టెలికాం శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం, భారత్‌లో అమ్మకానికి వచ్చే అన్ని కొత్త మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరిగా 90 రోజుల్లోగా ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలని తయారీదారులు, దిగుమతిదారులకు ఆదేశించింది. ఇప్పటికే ఉన్న ఫోన్లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల ద్వారా ఈ యాప్‌ను పుష్ చేయనున్నారు. మరీ ముఖ్యంగా ఈ యాప్‌ను డిసేబుల్ చేయడం లేదా తొలగించడం సాధ్యం కాదని ఆదేశంలో స్పష్టంగా పేర్కొన్నారు.

ప్రియాంక గాంధీ వాద్రా ఆగ్రహం

కాంగ్రెస్ అగ్రనేత జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా మీడియాతో మాట్లాడుతూ ఈ ఆదేశాన్ని ‘నియంతృత్వ ధోరణి’ అని ఆరోపించారు. సంచార్ సాథీ అంటే స్నూపింగ్ యాప్. ప్రజలకు గోప్యతా హక్కు ఉంది. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మెసేజ్‌లు పంపినా ప్రభుత్వం పరిశీలించకూడదు. ఇది నియంతృత్వం వైపు దేశాన్ని నెట్టే చర్య అని ఆమె అన్నారు. పార్లమెంటు పనిచేయకపోవడానికి కారణం ప్రభుత్వమేనని, ఎలాంటి చర్చకూ అనుమతించడం లేదని ఆమె విమర్శించారు. సైబర్ సెక్యూరిటీ అవసరమే కానీ, అందుకు ప్రతి పౌరుడి ఫోన్‌లోకి చొరబడే అధికారం లేదని స్పష్టం చేశారు.

ప్రజల గొంతుని నులిమే ప్రయత్నం ఇది–ఖర్గే

స‍ంచార్ సాథీ యాప్ పై కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, ప్రజల స్వరాన్ని అణచివేత దిశగా తీసుకెళ్లే ప్రయత్నమని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఈ నేపథ్యంలో ఖర్గే ఎక్స్ లో వివరిస్తూ ప్రజల గొంతుకను నులిమే కొత్త ప్రయత్నం స‍ంచార్ సాథీ. ప్రజల విశ్వాసం లేకుండా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం డిక్టేటర్‌షిప్ కు సూచిక అని మండిపడ్డారు.

భారత్ ఇప్పుడు సర్వైలెన్స్ స్టేట్ – సుర్జేవాలా

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఈ చర్యను ‘భారత్‌ను సర్వైలెన్స్ స్టేట్‌గా మార్చే ప్రయత్నం’అని మండిపడ్డారు. ఎక్స్ లో ఆయన ఈ విధంగా విమర్శించారు. ఇది అధికారిక పెగాసస్‌నా? లేక ఉత్తర కొరియా రెడ్ ఫ్లాగ్ యాప్‌నా? భారత్ ఇప్పుడు సర్వైలెన్స్ స్టేట్ అయిందా? పోలీస్ స్టేట్ అవుతోందా? గోప్యతా హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ అధికారికంగా చనిపోయాయా? యాప్ తప్పనిసరిగా ఇన్‌స్టాల్ అయితే ప్రభుత్వం పౌరుల లొకేషన్, సెర్చ్ హిస్టరీ, కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ సంభాషణలను కూడా పర్యవేక్షించగలదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రాజ్యసభలో అడ్జర్న్‌మెంట్ మోషన్

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఈ అంశంపై అడ్జర్న్‌మెంట్ మోషన్ నోటీసు(అత్యవసర ప్రజా ప్రయోజన అంశాన్ని చర్చించేందుకు) ఇచ్చారు. రూల్ 267 కింద అన్ని వ్యాపారాలను పక్కనపెట్టి ఈ విషయంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21 కింద జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగం. తొలగించలేని ఈ యాప్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయించడం ప్రజల గోప్యతపై తీవ్ర దాడి అని ఆమె తన నోటీసులో పేర్కొన్నారు.

డిస్టోపియన్ టూల్:కేసీ వేణుగోపాల్

కాంగ్రెస్ మరో జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా సోమవారమే ఈ ఆదేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బిగ్ బ్రదర్ మనల్ని గమనిస్తున్నాడు. తొలగించలేని ప్రభుత్వ యాప్ అంటే ప్రతి భారతీయుడి కదలికలు, సంభాషణలు, నిర్ణయాలను నిఘా ఉంచే డిస్టోపియన్ టూల్ అని ఆయన ఎక్స్ లో రాశారు. టెలికాం శాఖ ఆదేశాలు వెంటనే అమలులోకి వచ్చాయి. 120 రోజుల్లోగా కంప్లయన్స్ రిపోర్టులు సమర్పించాలని, లేకుంటే టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023, సైబర్ సెక్యూరిటీ రూల్స్ 2024 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గోప్యతా హక్కులు వర్సెస్ సైబర్ మోసాల నిరోధకత మధ్య సమతూకం ఎలా ఉండాలనే ప్రశ్న మరింత ఉధృతమైంది.

యాప్ ను యాక్టివేట్ చేసుకోవడ తప్పనిసరి కాదు: సింధియా

ఇంతకుముందు జ్యోతిరాదిత్య సింధియా సంచార్ సాథీ యాప్‌ను ఫోన్‌లో యాక్టివేట్ చేయడం తప్పనిసరి కాదని, అది పూర్తిగా వినియోగదారుల ఇష్టంపై ఆధారపడి ఉంటుందని, ఎవరైనా కావాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చని చెప్పారు.రోజు పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడిన సింధియా, వినియోగదారులకు పూర్తి స్వేచ్ఛ ఉందని తెలిపారు. కావాలంటే యాక్టివేట్ చేసుకోండి, లేదంటే వద్దనుకోండి, డిలీట్ చేసుకోండి మీ ఇష్టం అని ఆయన అన్నారు. యాప్ వల్ల 2024లో రూ.22,800 కోట్ల ఆర్థిక మోసాలను అడ్డుకున్నామని, దీని వల్ల వినియోగదారులకు రక్షణ లభిస్తోందని సింధియా గుర్తు చేశారు. ప్రతిపక్షానికి ఏ ఏజెండా (ముద్దా) లేదు, కాబట్టి ముద్దా కోసం వెతుకుతున్నారు. వాళ్లకు సహాయం చేయలేమని ఆయన ఎద్దేవా చేశారు.

సర్వైలెన్స్ ఆరోపణలను తోసిపుచ్చిన సింధియా, యాప్‌లో కాల్ మానిటరింగ్ లేదా స్పైయింగ్ ఏమీ లేవని స్పష్టం చేశారు.

మీరిచ్చిన నోటిఫికేషన్ ఓ సారి చదవండి

శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది మంగళవారం కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సంచార్ సాథీ యాప్‌ను మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయాలన్న ఆదేశంపై సింధియా చేసిన వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా స్పందించారు. ఈ యాప్ ఫంక్షనాలిటీని ఎవరూ డిసేబుల్ చేయలేరు, పరిమితం చేయలేరని ఆమె గట్టిగా చెప్పారు. ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ టెలికాం శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ కాపీని ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఇలా అడిగారు. భారత టెలికాం మంత్రిని కోరుతున్నాను ‘అనవసర వివాదం’ అంటూ మాట్లాడే ముందు ఈ నోటిఫికేషన్ ఒక్కసారి చదవండి. పేజీ 2, పాయింట్ 7బీ చూడండి. అందులో స్పష్టంగా రాసి ఉంది. యాప్ ఫంక్షనాలిటీని డిసేబుల్ చేయడం లేదా పరిమితం చేయడం కుదరదు.

‘సంచార్ సాథీ’ కాదు స్నూపింగ్ యాప్: కాంగ్రెస్ - Tholi Paluku