Let's talk: editor@tmv.in
సంఘ్‌ ఆదేశిస్తే పదవి నుంచి తప్పుకుంటా: మోహన్‌ భాగవత్‌

సంఘ్‌ ఆదేశిస్తే పదవి నుంచి తప్పుకుంటా: మోహన్‌ భాగవత్‌

Pinjari Chand
9 ఫిబ్రవరి, 2026

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. శతాబ్ది ఉత్సవాల్లో ఆయన తన పదవీ విరమణ గురించి ఆసక్తికర అంశాలు సభికులకు తెలియజేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) తనను పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశిస్తే వెంటనే ఆ నిర్ణయాన్ని గౌరవిస్తానని సంఘ్‌ సర్‌ సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌ స్పష్టం చేశారు. వయస్సు పరంగా 75 ఏళ్లు పూర్తి అయినప్పటికీ, సంఘ్‌ తనను కొనసాగమని కోరిందని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది వేడుకల సందర్భంగా ముంబైలో నిర్వహించిన పరస్పర సంభాషణ కార్యక్రమంలో భాగవత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. నేను 75 ఏళ్లు పూర్తి చేశానని సంఘ్‌కు తెలియజేశాను. అయితే, ఇంకా సేవ కొనసాగించాలని సంఘ్‌ చెప్పింది. సంఘ్‌ ఎప్పుడైతే తప్పుకోవాలని చెబుతుందో, ఆ క్షణమే తప్పుకుంటాను. కానీ సేవ నుంచి విరమించుకోవడం మాత్రం ఉండదని అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌లో సర్‌సంఘ్‌చాలక్‌ పదవికి ఎన్నికల ప్రక్రియ లేదని, ప్రాంతీయ, విభాగ స్థాయి నాయకులే ఆ బాధ్యతలను నిర్ణయిస్తారని భాగవత్‌ తెలిపారు. సాధారణంగా 75 ఏళ్లు దాటిన తర్వాత పదవి లేకుండా సేవ చేయాలన్న సంప్రదాయం ఉందని చెప్పారు. సంఘ్‌కు కుల ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఉండదని, సేవా నిబద్ధత ఆధారంగానే కార్యకర్తలు పై స్థాయికి ఎదుగుతారని వివరించారు. సర్‌సంఘ్‌చాలక్‌ హిందువే కావాలన్న నిబంధన ఉన్నప్పటికీ, కులానికి ఎలాంటి ప్రాధాన్యం లేదని స్పష్టం చేశారు.

సంఘ్ లో మొదట్లో బ్రహ్మణుల ప్రాబల్యం ఉండేది

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దశలో బ్రాహ్మణుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో అప్పట్లో ‘బ్రాహ్మణ సంస్థ’గా ముద్ర వేసినట్లు పేర్కొన్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారికి సర్‌సంఘ్‌చాలక్‌ పదవి అర్హత కాదని, అలాగే బ్రాహ్మణుడై ఉండడం అర్హత కాదని స్పష్టం చేశారు. అత్యుత్తమంగా అందుబాటులో ఉన్న వ్యక్తినే ఎంపిక చేస్తారని అన్నారు. తేలికపాటి వ్యాఖ్యల్లో భాగంగా ఆర్‌ఎస్‌ఎస్‌ తన కార్యకర్తల నుంచి చివరి రక్త బిందువు వరకు పని తీసుకుంటుంది. ఇప్పటివరకు ఎవరినీ పదవీ విరమణ చేయించాల్సిన పరిస్థితి రాలేదని అన్నారు.

సంఘ్‌ పని ప్రచారం కాదని, ‘సంస్కారాల’ వికాసమే లక్ష్యమని భాగవత్‌ చెప్పారు. అతిగా ప్రచారం చేసుకుంటే అహంకారం పెరుగుతుందని హెచ్చరించారు. ప్రచారం వర్షంలా సరైన సమయంలో, సరైన పరిమాణంలో ఉండాలని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల్లో ఇంగ్లిష్‌ మాధ్యమం ఉండదని, అది భారతీయ భాష కాదని భాగవత్‌ స్పష్టం చేశారు. అవసరమైతే ఇంగ్లిష్‌ను వినియోగిస్తామని, అయితే మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

ముస్లిం సమాజాల్లో సంఘ్‌ కార్యకలాపాలపై ప్రశ్నకు స్పందిస్తూ, పరస్పర వ్యతిరేకత ఉంటే ఘర్షణే మిగులుతుందని, అలా పని ముందుకు సాగదని అన్నారు. సంఘ్‌ ఏ కులాన్నీ, మతాన్నీ లక్ష్యంగా చేసుకోదని, భౌగోళికంగా పని చేస్తుందని వివరించారు. అవినీతిపై పోరాటానికి సంఘ్‌ మద్దతు ఇస్తుందని, కఠిన చట్టాలకు అనుకూలంగా ఉందని తెలిపారు. అవినీతి వ్యవస్థలో కాదని, మనుషుల మనసుల్లోనే ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఇప్పటి వరకు ఆర్‌ఎస్‌ఎస్‌కు ఐదుగురు చీఫ్‌లు.. బ్రాహ్మణేతరుడు ఒక్కరే

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) స్థాపన నుంచి ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు సర్‌సంఘ్‌చాలక్‌లు బాధ్యతలు నిర్వహించారు. వారిలో నలుగురు బ్రాహ్మణులు కాగా, బ్రాహ్మణేతర వర్గానికి చెందిన నాయకుడు ఒక్కరే సంఘ్‌ చీఫ్‌గా పని చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు కేశవ్‌ బాలిరామ్‌ హెగ్డేవార్‌ 1925 నుంచి 1940 వరకు సర్‌ సంఘ్‌చాలక్‌గా ఉన్నారు. ఆయన అనంతరం ఎం.ఎస్‌. గోళ్వాల్కర్‌ (గురు జీ) 1940 నుంచి 1973 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత బాలాసాహెబ్‌ దేవరస్‌ 1973 నుంచి 1994 వరకు సంఘ్‌ను నడిపించారు. ఈ ముగ్గురూ బ్రాహ్మణ వర్గానికి చెందినవారే.

1994 నుంచి 2000 వరకు సర్‌ సంఘ్‌చాలక్‌గా పనిచేసిన రాజేంద్ర సింగ్‌ (రాజ్జు భయ్యా) రాజ్‌పుత్‌ (క్షత్రియ) వర్గానికి చెందినవారు. ఇప్పటి వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌లలో ఏకైక బ్రాహ్మణేతరుడు ఆయనే. 2000 నుంచి ప్రస్తుతం వరకు మోహన్‌ భాగవత్‌ సర్‌సంఘ్‌చాలక్‌గా కొనసాగుతున్నారు. ఆయన కూడా బ్రాహ్మణ వర్గానికి చెందినవారు.

అందరి సమ్మతితోనే యూనిఫాం సివిల్ కోడ్‌.. విభజనలు సృష్టించకూడదు

యూనిఫాం సివిల్ కోడ్‌ (యూసీసీ)ను అందరి విశ్వాసం పొందేలా రూపొందించాలని, అది సమాజంలో విభజనలకు దారితీయకూడదని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. యూసీసీని సర్వసమ్మతితో రూపొందించాలి. అది చీలికలకు కారణం కావద్దు. ఉత్తరాఖండ్‌లో మూడు లక్షల సూచనలు స్వీకరించి, అన్ని వర్గాలతో చర్చించిన తర్వాతే చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు.

భారతదేశంలో మెజారిటీ–మైనారిటీ అన్న భేదాలు లేవని మనమంతా ఒకే సమాజమని వ్యాఖ్యానించారు. ముస్లిం, క్రైస్తవ సమాజాలతో విశ్వాసం, స్నేహం, సంభాషణ అవసరమని ఆయన నొక్కిచెప్పారు. ఇస్లాం శాంతి మతంగా చెప్పబడుతుందని, అయితే ఆత్మీయత లేకపోతే ఏ మతమైనా ఆధిపత్య భావనతో దూకుడుగా మారుతుందని ఆయన అన్నారు. నేడు ఇస్లాం, క్రైస్తవ మతాల్లో కనిపిస్తున్న కొన్ని ధోరణులు ప్రవక్త మహమ్మద్‌, యేసు క్రీస్తు బోధనలకు అనుగుణంగా లేవు. నిజమైన ఇస్లాం, క్రైస్తవ ధర్మాచరణ అవసరమని అన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆర్‌ఎస్‌ఎస్‌కు ‘అచ్చే దిన్‌’ వచ్చాయా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ అది తలక్రిందులుగా ఉంది. రామ్‌ మందిర నిర్మాణానికి మేము కట్టుబడి ఉన్నాం. మాకు మద్దతిచ్చినవారికే లాభం కలిగిందని భాగవత్‌ తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు మంచి రోజులు కార్యకర్తలు కష్టపడి చేసిన సేవ వల్లే వచ్చాయని, సిద్ధాంతపరమైన నిబద్ధతే కారణమని చెప్పారు. హిందుత్వ సిద్ధాంతకర్త వీ.డి. సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌పై స్పందిస్తూ, ఆ గౌరవాన్ని ఆయనకు అందిస్తే అవార్డు ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని వ్యాఖ్యానించారు.

భారత్‌–అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై తాను వివరాల్లోకి వెళ్లలేదని చెప్పారు. ప్రపంచంతో పూర్తిగా వేరుగా ఉండలేం. ఒప్పందాల్లో ఇవ్వడం–తీసుకోవడం ఉంటుంది. అది పరస్పర లాభదాయకంగా ఉండాలి. నష్టం కలగకుండా చూసుకోవాలని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అవసరమైనప్పుడు సూచనలు ఇస్తుందని, రాజకీయ ఒత్తిడి ఓటర్ల నుంచే వస్తుందని చెప్పారు. వాళ్ల తప్పులకు మమ్మల్ని నిందిస్తారు, ఎందుకంటే వాళ్లు మన నుంచే వచ్చారని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టుల ప్రభావం 100 ఏళ్లలో ఎందుకు పెరగలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ, అడిగితే తామే మార్గనిర్దేశం చేస్తామని భాగవత్‌ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సగటు వయస్సు 28 ఏళ్లు ఉందని, దాన్ని 25కి తగ్గించాలన్నదే లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో రవీనా టండన్‌, విక్కీ కౌశల్‌, అనన్య పాండే, దర్శకులు కరణ్‌ జోహార్‌, మధూర్‌ భండార్కర్‌, రమేష్‌ తౌరానీ, పండిత్‌ హృదయనాథ్‌ మంగేశ్కర్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.